Let's talk: editor@tmv.in
కిష్త్వార్‌లో మళ్లీ భద్రతా దళాల కార్డన్ సెర్చ్

కిష్త్వార్‌లో మళ్లీ భద్రతా దళాల కార్డన్ సెర్చ్

Pinjari Chand
2 ఫిబ్రవరి, 2026

జమ్మూ–కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో దాక్కున్న ముగ్గురు జైష్-ఎ-మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాదులను గుర్తించి నిర్వీర్యం చేయడానికి భద్రతా దళాలు ఆదివారం మళ్లీ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. శనివారం జరిగిన స్వల్ప కాల్పుల ఘటన అనంతరం మంచుతో నిండిపోయిన ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు పరారీలో ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. రాత్రంతా కొనసాగిన కార్డన్ సెర్చ్ తర్వాత ఆదివారం ఉదయం ఆపరేషన్ తిరిగి ప్రారంభమైందని ఒక ఉన్నతాధికారి తెలిపారు. ఉగ్రవాదులు నిరంతరం తాము దాక్కున్న ప్రదేశాలను మార్చుకుంటూ పరారవుతున్నారని, వారిని పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. పక్క ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. జిల్లా మొత్తం ఉగ్రవాదుల కదలికలపై అప్రమత్తంగా ఉండేందుకు విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (వీడీజీస్)ను ఆపరేషనల్ మోడ్‌లో ఉంచారు. ఉగ్రవాదులకు ఆహారం, ఆశ్రయం అందిస్తున్న వారిపైనా నిఘా కొనసాగుతోంది.

కొన్ని రోజులుగా ఈ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. శనివారం తెల్లవారుజామున కిష్త్వార్ జిల్లా డోల్గాం ప్రాంతంలో సైన్యం ఉగ్రవాదులతో మళ్లీ కాల్పులు మొదలు పెట్టింది. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది గాయపడినట్లు భావిస్తున్నారు. డ్రోన్ నిఘాలో రక్తపు గుర్తులు కనిపించినట్లు సమాచారం. గత రెండు వారాల్లో నాలుగోసారి ఈ ప్రాంతంలో ఉగ్రవాదులతో కాల్పులు జరగడం. చత్రూ–డోల్గాం–దిచ్ఛర్ బెల్ట్‌లోని మంచుతో నిండిన ఎత్తైన ప్రాంతాల్లో డ్రోన్‌లు, హెలికాప్టర్ల సహాయంతో గగనతల నిఘా కొనసాగుతోంది. స్పెషల్ ఫోర్సెస్, రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్లు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఓజీ), సీఆర్‌పీఎఫ్‌తో కూడిన సంయుక్త బృందం శనివారం నుంచి స్నిఫర్ డాగ్స్‌ను కూడా రంగంలోకి దింపింది. ఆపరేషన్ నేపథ్యంలో శుక్రవారం నుంచి సింగ్‌పోరా, చింగం, చత్రూ ప్రాంతాలతో కూడిన ఆరు కిలోమీటర్ల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

ఏడు నెలల్లో ఆరు ఎన్ కౌంటర్లు

కిష్త్వార్ జిల్లా గత ఏడునెలల్లో ఆరు ఎన్‌కౌంటర్లకు వేదికగా మారింది. డోడా, ఉధంపూర్ జిల్లాలకు సరిహద్దుగా ఉండే ఈ ప్రాంతంలో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులపై భద్రతా దళాలు కఠిన చర్యలు చేపడుతున్నాయి. జనవరి 18న సోన్నార్ అటవీ ప్రాంతంలో ఆపరేషన్ ప్రారంభమై తీవ్ర కాల్పుల ఘటన జరిగింది. ఈ ఘటనలో ఒక పారా ట్రూపర్ వీరమరణం పొందగా, ఏడుగురు సైనికులు గాయపడ్డారు. దట్టమైన అటవీ ప్రాంతం, కఠిన భౌగోళిక పరిస్థితులను ఉపయోగించుకుని ఉగ్రవాదులు తప్పించుకున్నప్పటికీ, రెండు అడుగులకుపైగా మంచు పడుతున్నా భద్రతా దళాలు గాలింపు కొనసాగించాయి. జనవరి 22న మాలి దానా వద్ద, జనవరి 25న జాన్సీర్–కాండివార్ వద్ద మరో రెండు సార్లు ఎన్‌కౌంటర్లు జరిగినప్పటికీ ఉగ్రవాదులు మళ్లీ అటవీ ప్రాంతాల్లోకి జారుకున్నారు.

ఇదిలా ఉండగా ఉత్తర సైన్యాధిపతి లెఫ్టినెంట్ జనరల్ ప్రతీక్ శర్మ శనివారం కిష్త్వార్ జిల్లాను సందర్శించి ఉగ్రవాద నిరోధక వ్యవస్థను సమీక్షించారు. కొనసాగుతున్న ఆపరేషన్లలో సైనికులు చూపుతున్న అచంచల ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు. జమ్మూ ప్రాంతంలో మారుతున్న భద్రతా పరిస్థితులపై ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష తర్వాత ఈ పర్యటన జరిగింది.