
కిష్త్వార్‌లో ‘ఉగ్ర’ వేట.. మొబైల్ ఇంటర్నెట్ సేవలు బంద్
జమ్మూకాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతా దళాలు తమ ఆపరేషన్‌ను మరింత ఉధృతం చేశాయి. చట్రూ ప్రాంతంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో జైష్-ఎ-మొహమ్మద్‌కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో సైన్యం, జమ్మూకాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతికూల వాతావరణం, దట్టమైన మంచు కురుస్తున్నప్పటికీ సైన్యం వెనక్కి తగ్గకుండా శత్రువుల కోసం వేట కొనసాగిస్తోంది.
జనవరి 18 నుంచి కొనసాగుతున్న 'వేట'
ఈ భారీ ఆపరేషన్ జనవరి 18న ప్రారంభమైంది. మండ్రాల్–సింగ్‌పోరా సమీపంలోని సోన్నార్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన భీకర కాల్పుల్లో ఒక పారా ట్రూపర్ వీరమరణం పొందగా, మరో ఏడుగురు సైనికులు గాయపడ్డారు. క్లిష్టమైన భౌగోళిక పరిస్థితులు, దట్టమైన అడవులను అడ్డంకిగా మార్చుకుని ఉగ్రవాదులు అప్పట్లో తప్పించుకున్నారు. ఆ తర్వాత జనవరి 22న మాలి దానా టాప్ వద్ద, జనవరి 25న జాన్సీర్–కాండివార్ ప్రాంతంలో మరో రెండుసార్లు ఎన్‌కౌంటర్లు జరిగినప్పటికీ, ముష్కరులు దట్టమైన అడవుల్లోకి పారిపోయారు. సుమారు రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయినప్పటికీ, భద్రతా దళాలు డ్రోన్లు, ఆధునిక సాంకేతిక నిఘా వ్యవస్థల సహాయంతో అడుగడుగునా గాలిస్తున్నాయి.
ప్రజా భద్రత దృష్ట్యా ఇంటర్నెట్ నిలిపివేత
ఉగ్రవాదుల కదలికలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. సింగ్‌పోరా, చింగం, చట్రూ ప్రాంతాల్లో సుమారు ఆరు కిలోమీటర్ల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిలిపివేతను జనవరి 30 అర్ధరాత్రి వరకు పొడిగిస్తూ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను ఉపయోగించి దేశ వ్యతిరేక శక్తులు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా, భద్రతా దళాల కదలికలపై ఉగ్రవాదులకు సమాచారం అందకుండా ఉండేందుకే ఈ ముందస్తు చర్యలు చేపట్టినట్లు జమ్మూ జోన్ ఐజీపీ వెల్లడించారు.
పూంచ్ జిల్లాలోనూ హై అలర్ట్
కిష్త్వార్‌లో ఆపరేషన్ కొనసాగుతుండగానే, పూంచ్ జిల్లా సూరన్‌కోట్ ప్రాంతంలోనూ ఉద్రిక్తత నెలకొంది. పజ్జా మోర్, నబానా టాప్ పరిసరాల్లో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా దళాలు అక్కడ కూడా గాలింపు (సెర్చ్ ఆపరేషన్) మొదలుపెట్టాయి. ముష్కరులను పూర్తిగా నిర్వీర్యం చేసే వరకు ఈ పోరాటం ఆగదని, అటవీ ప్రాంతాల్లోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.
