Let's talk: editor@tmv.in
కివీస్‌తో టీ20 సిరీస్‌కు మ్యాక్స్‌వెల్‌ దూరం

కివీస్‌తో టీ20 సిరీస్‌కు మ్యాక్స్‌వెల్‌ దూరం

Shaik Mohammad Shaffee
1 అక్టోబర్, 2025

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ కివీస్‌తో జరగనున్న మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ నుంచి మణికట్టు గాయం కారణంగా మంగళవారం తప్పుకున్నాడు. అలాగే టీమిండియాతో త్వరలో జరగనున్న అయిదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా గాయం వల్ల గైర్హాజరయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మౌంట్ మాంగనూయ్‌లోని నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న సమయంలో మిచెల్ ఓవెన్ కొట్టిన స్ట్రెయిట్ డ్రైవ్ బంతి మాక్స్‌వెల్ కుడిచేతి మణికట్టుకు బలంగా తగిలింది. దీంతో ఆయన కివీస్‌తో టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు. మాక్స్‌వెల్ స్థానంలో సిడ్నీ సిక్సర్స్, న్యూ సౌత్‌ వేల్స్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ జోష్ ఫిలిప్‌ను ఆస్ట్రేలియా జట్టులోకి తీసుకున్నారు. అలెక్స్‌ కారీ బ్యాకప్‌ వికెట్‌ కీపర్‌‌‌గా ఉండనున్నాడు. అయితే టీ20 వరల్డ్‌ కప్‌కు ముందు ఆసీస్ జట్టు ఆటగాళ్ల గాయాలతో తీవ్ర ఇబ్బందులు పడుతోంది.

గ్లెన్ మాక్స్‌వెల్ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే, ఈ విధ్వంసకర ఆల్ రౌండర్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో (వన్డే, టీ20) ప్రత్యేక గుర్తింపు పొందాడు. 2012లో అంతర్జాతీయ ఆరంగేట్రం చేసిన మాక్స్‌వెల్‌, తన అనూహ్యమైన షాట్లు, వేగవంతమైన స్కోరింగ్‌తో “ది బిగ్ షో”గా ప్రసిద్ధి చెందారు. ఆఫ్-స్పిన్ బౌలింగ్, అద్భుతమైన ఫీల్డింగ్ అతడి అదనపు బలాలు. 2023 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 201 (నాటౌట్) పరుగుల చారిత్రక ఇన్నింగ్స్ అతడి కెరీర్‌కే హైలైట్‌. ఐపీఎల్, బిగ్ బాష్ లీగ్‌లలోనూ స్టార్‌గా రాణించారు. మాక్స్‌వెల్ ఆస్ట్రేలియాకు 2015 వన్డే ప్రపంచకప్, 2021 టీ20 ప్రపంచకప్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్‌ నేటి నుంచి ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 1, అక్టోబర్‌ 3, అక్టోబర్‌ 4న మ్యాచ్‌లు మౌంట్ మాంగనూయ్‌ వేదికగా జరగనున్నాయి. అలాగే టీమిండియా అక్టోబర్‌ 19 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఇందులో భాగంగా మూడు వన్డే మ్యాచ్‌లు, అయిదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్‌ 25 నుంచి టీ20 మ్యాచ్‌లు మొదలు కానున్నాయి.

కివీస్‌తో టీ20 సిరీస్‌కు మ్యాక్స్‌వెల్‌ దూరం - Tholi Paluku