Let's talk: editor@tmv.in
కిడ్నాప్ చేసి రూ 80 లక్షల బంగారు దోచుకొని!

కిడ్నాప్ చేసి రూ 80 లక్షల బంగారు దోచుకొని!

Panthagani Anusha
19 అక్టోబర్, 2025

నగరంలో వ్యాపార లావాదేవీల పేరుతో నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ముంబైలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బంగారు వ్యాపారంలో తలెత్తిన పాత వివాదం కారణంగా ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి, తీవ్రంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్న పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన పరేల్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో జరిగింది.

ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 14 సాయంత్రం సమయంలో బాధితుడు లోకమాన్య తిలక్ మార్గ్‌లోని ఓల్డ్ హనుమాన్ గల్లీ వద్ద తన నివాస సమీపంలో నడుస్తూ నడుస్తూ వెళుతున్న సమయంలో హఠాత్తుగా ఒక కారు అక్కడికి వచ్చి ఆగింది. కాగా ఆ కారులో ఉన్న ముగ్గురు పురుషులు, ఒక మహిళ బాధితుడిని బలవంతంగా కారులోకి ఎక్కించి, పరేల్ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌కు తీసుకెళ్లారు.

ఆ ఫ్లాట్‌లోకి తీసుకెళ్లిన తరువాత నిందితులు బాధితుడిని తీవ్రంగా కొట్టి బెదిరింపులకు గురిచేశారు.అనంతరం వారు బాధితుడి వద్ద నుండి 591 గ్రాముల బంగారం (విలువ రూ.76.23 లక్షలు), రూ.2.99 లక్షల చెక్కు, అదేవిధంగా యూపీఐ ద్వారా రూ.15,000 తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు.ఈ ఘటన అనంతరం బాధితుడు స్థానిక పోలిస్త్తిన్ లో ఫిర్యాదు చేయగా వెంటనే ఎల్.టి. మార్గ్ పోలీస్ అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇక విచారణలో భాగంగా సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా అరెస్టయిన వారు తారక్ మైతి (35), రఘునాథ్ మైతి (34) – ఇద్దరూ నవి ముంబైకు చెందిన జువెలర్లు దీపక్ మహాదిక్ (45) అనే కుక్కల శిక్షకుడు, అతని భార్య అల్కా మహాదిక్ (35) (సివ్రీ ప్రాంతానికి చెందినవారు), రాహుల్ దివే (30) సునీల్ గోరై (28)గా గుర్తించారు.అనంతరం నిందితులపై అపహరణ, దాడి, దోపిడీ, బెదిరింపు వంటి పలు నేరాల కింద భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి. నిందితులను కోర్టులో హాజరుపరచగా, వారిని అక్టోబర్ 18 వరకు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ అక్కడి జిల్లా కోర్టు తాత్కాలిక తీర్పు వెలువరించింది.

మరోవైపు ఈ కేసు పై దర్యాప్తు కొనసాగిస్తున్న దర్యాప్తు పోలీసులు బాధితుడి నుంచి తీసుకున్న బంగారం, చెక్కు, నగదు మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఈ గ్యాంగ్ గతంలో ఇలాంటి నేరాల్లో పాల్గొన్నదేమో అనే దిశలో విచారణ చేపట్టారు.

ముంబై నగరంలో ఇటీవలి కాలంలో వ్యాపార లావాదేవీలకు సంబంధించి పెరుగుతున్న ఆర్థిక మోసాలు, దాడులు పోలీసు శాఖను అప్రమత్తం చేస్తున్నాయి. అధికారులు వ్యాపార వర్గాలను జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరిస్తున్నారు.

ఇదిలా ఉండగా గతంలోనూ ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. కాగా కోల్‌కతా ఉత్తర అంచున ఉన్న బరానగర్‌లో పట్టా పగలే బంగారం దుకాణంలో దోపిడీకి దిగిన దుండగులు వ్యాపారిని కట్టేసి, తీవ్రంగా కొట్టి ప్రాణాలు తీశారు.

కిడ్నాప్ చేసి రూ 80 లక్షల బంగారు దోచుకొని! - Tholi Paluku