Let's talk: editor@tmv.in
కాశీబుగ్గ తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యం: మాజీ మంత్రి ధర్మాన తీవ్ర విమర్శలు

కాశీబుగ్గ తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యం: మాజీ మంత్రి ధర్మాన తీవ్ర విమర్శలు

Gaddamidi Naveen
2 నవంబర్, 2025

కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్రంగా విమర్శించారు. కార్తీక మాసంలో ఏకాదశి రోజున భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చినా, ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు చేయకపోవడం వల్లే తొక్కిసలాట జరిగి ప్రాణనష్టం సంభవించిందని ఆయన అన్నారు.

పలాసలో మీడియాతో మాట్లాడిన ధర్మాన ప్రసాదరావు ఆలయం ప్రైవేట్‌దా, ప్రభుత్వదా అనే వివాదం పక్కన పెట్టాలి. భక్తుల భద్రత, ప్రజల ప్రాణ రక్షణ బాధ్యత మాత్రం పూర్తిగా ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. కాశీబుగ్గ ఘటనలో 9 మంది మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని, మరో ఆరుగురు చిన్న గాయాలతో చికిత్స పొందుతున్నారని ఆయ‌న తెలిపారు. ఇంత పెద్ద రద్దీ ఉండబోతుందని ముందే తెలుసు. అయినప్పటికీ కేవలం ఇద్దరు కానిస్టేబుళ్లను మాత్రమే బందోబస్తుకు పంపడం ప్రభుత్వం చేసిన అజాగ్రత్త అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, డాక్టర్ సీదిరి అప్పలరాజు, అలాగే వైయస్సార్‌సీపీ నాయకులు చింతాడ రవికుమార్‌, పేరడ తిలక్‌, మామిడి శ్రీకాంత్‌ తదితరులు బాధిత కుటుంబాలను పరామర్శించారు. గాయపడిన భక్తులకు స్వయంగా వైద్య సేవలు అందించిన డాక్టర్‌ సీదిరి అప్పలరాజు పరిస్థితిని సమీక్షించారు.

రాష్ట్రంలో వరసగా ఆలయాల్లో జరిగే దుర్ఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని బహిర్గతం చేస్తున్నాయని చెప్పారు. సింహాచలంలో చందనోత్సవం రోజున గోడ కూలి ఏడుగురు మరణించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగింది. కాశీబుగ్గలో ఇప్పుడు 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ప్రభుత్వం మాత్రం తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైంది. ప్రజల ప్రాణాలు అంత విలువ లేనివేనా?” అని ధర్మాన ప్రశ్నించారు.

ప్రభుత్వం వెంటనే మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించాలి. అలాగే గాయపడిన వారికి తగిన ఆర్థిక సాయం అందించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని ఆలయాల్లో కఠినమైన భద్రతా చర్యలు, తగిన ఏర్పాట్లు చేయాలని ధర్మాన ప్రసాదరావు డిమాండ్‌ చేశారు.

భక్తుల ప్రాణాలను కాపాడడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, ఆలయ భద్రతపై సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని మాజీ మంత్రి హెచ్చరించారు. “భక్తుల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వ ధర్మం. అదే నిజమైన సుపరిపాలన” అని ఆయన వ్యాఖ్యానించారు.

కాశీబుగ్గ తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యం: మాజీ మంత్రి ధర్మాన తీవ్ర విమర్శలు - Tholi Paluku