Let's talk: editor@tmv.in
కాశీబుగ్గ ఆలయంలో విషాదం: తొమ్మిది మంది మృతి

కాశీబుగ్గ ఆలయంలో విషాదం: తొమ్మిది మంది మృతి

Dantu Vijaya Lakshmi Prasanna
2 నవంబర్, 2025

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గలో శనివారం జరిగిన ఆలయ తొక్కిసలాటలో ఎనిమిది మంది మహిళలు, ఒక బాలుడు మరణించగా, పలువురు గాయపడ్డారు. అయితే, అంతకుముందు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మృతుల సంఖ్యను 10గా పేర్కొన్నారు. కాశీబుగ్గ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయంలో శనివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఈ తొక్కిసలాట జరిగిందని కాశీబుగ్గ సబ్-డివిజన్ ఇంఛార్జి డీఎస్పీ లక్ష్మణ రావు తెలిపారు.

"తొమ్మిది (మరణాలు). తొమ్మిది మాత్రమే. ఒక వ్యక్తి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. అతడు చనిపోలేదు. మొత్తం తొమ్మిది మంది. వారిలో 12 ఏళ్ల బాలుడు ఒకరు, మిగిలినవారంతా మహిళలే. ఇది ప్రైవేట్ ఆలయం. ప్రభుత్వ ఆలయం కాదు. దీనిని ఇటీవలనే నిర్మించారు” అని శ్రీకాకుళం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేవీ మహేశ్వర రెడ్డి తెలిపారు.

కాగా పోలీసు అధికారి ఒకరు ఈ సంఘటన గురించిన మరింత వివరాలు తెలుపుతూ, మెట్ల దగ్గర ఉన్న ఇనుప గ్రిల్ (రైలింగ్) కూలిపోవడం వల్ల ఈ ఘటన జరిగిందన్నారు. ప్రజలు భయంతో ఏదో కింద పడుతోందని భావించి పరుగులు తీశారు. వారు సుమారు ఆరు అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయారు. అక్కడ తొక్కిసలాట జరగలేదు. ఆరు అడుగుల ఎత్తు నుంచి ఒకరిపై ఒకరు పడటం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. "ఇది కేవలం ప్రమాదం ఆలయ యజమాని పొరపాటు వల్లే జరిగింది. వారు పోలీసుల బందోబస్తు కోసం దరఖాస్తు చేయలేదు, అనుమతులు కూడా తీసుకోలేదు,” అని ఆయన అన్నారు.

ప్రముఖుల స్పందన

• ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంఘటన పట్ల తాను బాధపడ్డానని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.2 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. "ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటతో నేను కలత చెందాను. తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఆయన 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

• కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈ సంఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

• ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు 'ఎక్స్' లో స్పందిస్తూ, "శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట నన్ను కలచివేసింది. ప్రాణాలు చాలా ముఖ్యం. మనం కూడా బాధ్యతగా ఉండాలి. అమాయకులు చనిపోయారు. చాలా బాధపడుతున్నాం. ఇందుకు కారణమైన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మృతి చెందడం చాలా విచారకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను" అని పేర్కొన్నారు. గాయపడినవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించానని, సహాయక చర్యలను పర్యవేక్షించాలని అధికారులను, స్థానిక నాయకులను కోరినట్లు కూడా సీఎం తెలిపారు.

• ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత 9 మంది మరణించారని, ఐదుగురు గాయపడ్డారని పేర్కొన్నారు. మరణించినవారిలో కనీసం ఏడుగురు 35-40 సంవత్సరాల వయస్సు వారేనని ఆమె తెలిపారు. ఆలయం మొదటి అంతస్తులో ఎత్తులో ఉందని, భక్తులు పైకి ఎక్కుతుండగా, రైలింగ్ విరిగిపోవడంతో ఒక మూలన నిలబడిన వారు కిందపడి, వారిపై ఇతరులు కూడా పడటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆమె వివరించారు. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయం ప్రైవేట్ ఆలయమని, దేవాదాయ శాఖ పరిధిలో లేదని చెబుతూనే, ప్రతి శనివారం ఇక్కడ 1,500 నుంచి 2,000 మంది భక్తులు రావడం సాధారణమని అనిత తెలిపారు. కార్తీక మాసంలో శనివారం రోజున ఏకాదశి తిథి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడం ఈ విషాదానికి కారణమైందని ఆమె అన్నారు.

ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బాధిత కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న ఈ ఆలయం లో ఈ దురదృష్టకర ఘటనలో భక్తులు మృతి చెందిన విషయం అత్యంత బాధాకరం అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రద్దీ నియంత్రణకు అదనపు దళాలు, అత్యవసర చర్యలు కొనసాగిస్తున్నామన్నారు.

లోకేష్ ఎక్స్ వేదికగా

కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన దురదృష్టకరం. ఇలాంటి ప్రమాద ఘటనల్లో కూడా సెకండ్ల వ్యవధిలో సానుభూతి, సహాయక చర్యలకంటే, శవ రాజకీయాలు చేసే రాబందుల పార్టీ మన రాష్ట్రంలో ఉండటం, ఇంకా దురదృష్టం. ఈ ఆలయం పూర్తిగా ఒడిశా రాజ కుటుంబం నిర్వహణలో ఉంది. ఇది ఒక ప్రైవేట్ దేవాలయం. ఈ ఏడాది మే నెలలోనే ప్రారంభమైంది. కానీ శవ రాజకీయం చేసే రాబందుల పార్టీ, ఏటా వేల మంది వస్తున్నారని ఫేక్ ప్రచారం చేస్తోంది.స్వయంగా ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పాండా, తాము అధికారులకు గానీ, పోలీసులకు గానీ ముందస్తు సమాచారం ఇవ్వలేదని, అసలు ఇంత మంది వస్తారని తమకే తెలియదని చెప్పారు. ఆలయ ధర్మకర్తలే “ఇంత మంది ఎప్పుడూ రాలేదు” అంటుంటే, ఈ విషయాన్ని ముందస్తు సమాచారం ఉంది అంటూ రాయడం శవ రాజకీయం తప్ప మరేమీ కాదు. ఏకాదశి రోజు తీవ్ర విషాదం నెలకొంది. మృతి చెందిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. తొక్కిసలాటలో గాయపడిన వారికి ప్రభుత్వం మెరుగైన వైద్య చికిత్స అందిస్తోంది. సమాచారం అందిన వెంటనే అధికారులు, జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడు గారితో, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష గారితో మాట్లాడాను. బాధితులకు తక్షణ సహాయం అందజేయాలని ఆదేశించాను అన్నారు.

మాజీ సీఎం వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి గారు పత్రికా ప్రకటన

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విచారకరం. మీడియాలో సమాచారం మేరకు 10 మంది మరణించారని తెలుస్తోంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలి. సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని మా పార్టీకి చెందిన నాయకులను ఆదేశించాను. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6గురు భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో మరో ఏడుగురు మరణించారు. ఇప్పడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకూ 10 మంది మరణించారని మీడియా ద్వారా సమాచారం వస్తోంది. ఈ 18 నెలల కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నది అర్థం అవుతోంది. పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. చంద్రబాబుగారి అసమర్థ పాలనకు నిదర్శనం ఇది. ఇకనైనా కళ్లుతెరిచి తప్పులను సరిదిద్దుకోవాలి.