
కాళేశ్వరం ప్రాజెక్ట్ విచారణ కేసులో కేసీఆర్, హరీశ్‌రావులకు తాత్కాలిక ఊరట
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు అవకతవకల ఆరోపణలపై జ్యుడిషియల్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ మంత్రి టీ హరీశ్‌రావు,ఇతరులపై ఎలాంటి ప్రతికూల చర్యలు తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును తెలంగాణ హైకోర్టు ఈ రోజు జనవరి 2026 వరకు పొడిగించింది.
బుధవారం ప్రధాన న్యాయమూర్తి అపరేశ్‌కుమార్ సింగ్, న్యాయమూర్తి జి.ఎం.మొహియుద్దీన్‌లతో కూడిన విభాగీయ బెంచ్ ముందు కేసీఆర్,హరీశ్‌రావు, మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి,ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ తదితరులు దాఖలు చేసిన వ్రిత్ పిటిషన్లు విచారణకు వచ్చాయి.ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫు న్యాయవాది ప్రతివాద అఫిడవిట్ సమర్పించడానికి మరింత సమయం కోరారు.దీంతో హైకోర్టు కేసును 2026 జనవరికి వాయిదా వేస్తూ,అప్పటివరకు కేసీఆర్, హరీశ్‌రావు,జోషి, సబర్వాల్‌లపై ఎటువంటి ప్రతికూల చర్యలు తీసుకోరాదని ఇచ్చిన ఆదేశాలను కొనసాగించింది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపిన రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. సి.గౌస్ నేతృత్వంలోని కమిషన్ తన నివేదికను ఇంతకుముందే ప్రభుత్వానికి సమర్పించింది.ఈ నివేదికను ఈ ఏడాది ఆగస్టులో రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.చర్చ అనంతరం, ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఈ విచారణను సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు.
కమిషన్ నివేదికలో కేసీఆర్, అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు పై ప్రాజెక్ట్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న అభియోగాలు పేర్కొనబడ్డాయి.ఈ నివేదికను సవాలు చేస్తూ కేసీఆర్, హరీశ్‌రావు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు.ఇప్పటికే హైకోర్టు వీరికి తాత్కాలిక రక్షణ కల్పిస్తూ,కేసు తుది తీర్పు వెలువడే వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశాలు జారీ చేసింది.
ఎందుకు కేసీఆర్, హరీష్ రావులు హైకోర్టుకు వెళ్ళారు?
కమిషన్ నివేదికను రూపొందించేటప్పుడు చట్టపరమైన ప్రక్రియలు పాటించలేదని వారు ఆరోపించారు.తమ వాదనలు వినిపించడానికి లేదా తమను తాము సమర్థించుకోవడానికి సరైన అవకాశం ఇవ్వలేదని వారు వాదించారు.కమిషన్ నివేదికలో లోపాలు ఉన్నందున, ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం లేదా సీబీఐ దర్యాప్తు జరగకూడదని, విచారణ, చర్యలు తప్పుగా సరిపోవచ్చని హైకోర్టులో వాదించారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మించబడింది?
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై ఈ ప్రాజెక్ట్ నిర్మించబడింది. మేడిగడ్డ,అన్నరాం,సుందిల్లా బ్యారేజీలను కలిపి గోదావరి నీటిని కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్, రంగారెడ్డి, యాదాద్రి వంటి జిల్లాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించబడింది.దేశంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పథకంగా కాళేశ్వరం గుర్తింపు పొందింది. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అవినీతి ఆరోపణలతో న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంది.
అవినీతి ఆరోపణలు?
ప్రాజెక్ట్ ప్రారంభ అంచనా రూ.38,500 కోట్లుగా ఉండగా, ఆ తర్వాత వ్యయం రూ.1.10 లక్షల కోట్లకు చేరిందని, కాంట్రాక్టుల కేటాయింపులో, నాణ్యత నియంత్రణలో పెద్ద ఎత్తున లోపాలు జరిగాయని కమిషన్ తేల్చింది. నివేదికలో సుమారు రూ.1,300 కోట్ల వరకూ అనవసర వ్యయం జరిగిందని సూచించింది.
