
కాల్పుల నడుమ మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ నాగేంద్ర అరెస్ట్
అతడో కరుడుగట్టిన నేరగాడు.. ఆంధ్రా, కర్ణాటక రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్. 90కి పైగా కేసులతో నేర ప్రపంచంలో తనకంటూ ఒక చీకటి సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న కవాడి నాగేంద్ర ఆట ఎట్టకేలకు ముగిసింది. శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు జరిపిన మెరుపు దాడిలో, కాల్పుల అనంతరం ఈ కిరాతకుడిని బంధించారు.
అత్తాకోడళ్లపై అఘాయిత్యం కేసులో నిందితుడు
2024లో హిందూపురం పరిధిలోని చిలమత్తూరులో అత్తాకోడళ్లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ దారుణమైన కేసులో నాగేంద్ర ప్రధాన నిందితుడు. ఆ ఘటన జరిగిన నాటి నుంచి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న ఇతడు, అడవుల్లో తలదాచుకుంటూ నేర కార్యకలాపాలు సాగిస్తున్నాడు. కాగా నిందితుడిపై ఆంధ్రప్రదేశ్,కర్ణాటక రాష్ట్రాల్లో కలిపి సుమారు 90కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉండటం గమనార్హం. కేవలం శ్రీ సత్యసాయి మరియు ఉమ్మడి అనంతపురం జిల్లాల్లోనే ఇతనిపై 40కి పైగా కేసులు నమోదయ్యాయి.
నాగేంద్ర అటవీ ప్రాంతంలో ఉన్నాడన్న పక్కా సమాచారంతో హిందూపురం డీఎస్పీ మహేష్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చేపట్టాయి. శుక్రవారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో పోలీసులు నిందితుడిని చుట్టుముట్టగా, తప్పించుకునే క్రమంలో నాగేంద్ర తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ రవిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. అనంతరం లొంగిపోయినట్లు నటిస్తూనే సీఐ ఆంజనేయులు దగ్గరకు రాగానే ఒక్కసారిగా కత్తితో విరుచుకుపడ్డాడు. ఈ పెనుగులాటలో సీఐ, కానిస్టేబుల్ ఇద్దరూ గాయపడ్డారు.
ఆత్మరక్షణలో భాగంగా కాల్పులు
దుండగుడి దాడితో అప్రమత్తమైన పోలీసులు తొలుత గాల్లోకి కాల్పులు జరిపి హెచ్చరించారు. అయినా వెనక్కి తగ్గకుండా పోలీసులను చంపేందుకు ప్రయత్నించడంతో సీఐ ఆంజనేయులు ఆత్మరక్షణ కోసం నాగేంద్ర మోకాలి కింద కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయంతో నిందితుడు కుప్పకూలడంతో పోలీసులు అతడిని బంధించారు. ప్రస్తుతం నిందితుడితో పాటు గాయపడిన పోలీసు సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ కరుడుగట్టిన నేరస్థుడిని పట్టుకున్న పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
