Let's talk: editor@tmv.in
కాలుష్య రహిత రవాణా దిశగా హైదరాబాద్‌ నగరం

కాలుష్య రహిత రవాణా దిశగా హైదరాబాద్‌ నగరం

Gaddamidi Naveen
1 నవంబర్, 2025

హైదరాబాద్ నగరాన్ని “క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ రవాణా వ్యవస్థను వేగవంతం చేస్తోంది. డీజిల్ బస్సుల స్థానంలో దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టే ప్రక్రియలో భాగంగా, పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్ నగరానికి 2,000 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించబడినాయి.

ఈ నేపథ్యంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో సచివాలయంలో కీలక సమీక్షా సమావేశం జరిగింది. ఇందులో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, ఆర్టీసీ అధికారులు ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

సమావేశంలో ఈ-బస్సుల ఆపరేషన్లలో ఎదురవుతున్న సవాళ్లు, మౌలిక సదుపాయాల లోపాలు, సాంకేతిక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఎలక్ట్రిక్ బస్సుల సజావు ఆపరేషన్ కోసం అవసరమైన హై టెన్షన్ విద్యుత్ కనెక్షన్లు ఎంపిక చేసిన డిపోలలో సకాలంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

పీఎం ఈ-డ్రైవ్ పథకం వివరాలు

దేశవ్యాప్తంగా 9 నగరాల్లో మొత్తం 15,000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టే యోజనలో భాగంగా హైదరాబాద్ నగరానికి 2,000 బస్సులు కేటాయించబడ్డాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కో బస్సుకు రూ. 35 లక్షల సబ్సిడీని మంజూరు చేయగా, టెండర్లను నవంబర్ 6న పిలిచింది.

తెలంగాణలో ఈ-వాహనాల పురోగతి

ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. 2-వీలర్లు, 3-వీలర్లు, 4-వీలర్లు, బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లు వంటి వాహనాలకు పన్ను రాయితీలు అందిస్తోంది.

తెలంగాణ రాష్ట్రం 2019లోనే దేశంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అప్పుడే 2019 మార్చిలోనే 40 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది.ప్రస్తుతం రాష్ట్రంలో 775 ఎలక్ట్రిక్ బస్సులు (510 ఇంటర్‌సిటీ, 265 సిటీ బస్సులు) నడుస్తున్నాయి. మిగిలిన 275 బస్సులు 2026 మార్చి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తయారీ కంపెనీల సమస్యలు, ప్రభుత్వ హామీ

గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని, టీజీఆర్టీసీ కొన్ని సమస్యలను తయారీ కంపెనీల ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లింది.సమావేశంలో ఈ-బస్ రంగంలోని కంపెనీల ప్రతినిధులు,టెండర్ షరతులను పాటించకపోవడం,ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటులో జాప్యం,బస్సుల డెలివరీల్లో ఆలస్యం,బ్రేక్‌డౌన్ ఫ్రీక్వెన్సీ అధికంగా ఉండటం,డీజిల్ బస్సులతో పోలిస్తే సర్వీస్ రద్దులు ఎక్కువగా నమోదవడం వంటి అంశాలను చర్చించారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తుందని, ఈ-డ్రైవ్ పథకం కింద ఈ-బస్సుల సజావుగా ఆపరేషన్ల కోసం సమన్వయ చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.