
కాలుష్యాన్ని నివారించలేం…యంత్రించవచ్చు: డిప్యూటీ సీఎం
రాష్ట్ర ఆర్థిక పురోగతిలో పరిశ్రమల పాత్ర కీలకమని, అయితే అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టకూడదని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాలుష్యాన్ని పూర్తిగా నివారించడం సాధ్యం కాకపోయినా అధునాతన సాంకేతికతను ఉపయోగించి దానిని నియంత్రించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా పారిశ్రామిక వాడల్లో కాలుష్య నియంత్రణ మండలి (పిసిబి) నిబంధనలను పరిశ్రమలు తు.చ. తప్పకుండా పాటించాలని ఈ మేరకు శుక్రవారం సాయంత్రం విశాఖలోని ఓ ప్రైవేటు హోటల్ లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణం, కాలుష్య నియంత్రణ అంశంపై విశాఖ పరిసరాల్లోని పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశంలో పాల్గొన్న ఆయన పోర్టు నుంచి పారిశ్రామిక వాడల వరకు యాజమాన్యాలు కాలుష్య నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
ఉత్తరాంధ్రలో ఆందోళనకర పరిస్థితులు
గత కొన్నేళ్లుగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో అభివృద్ధి జరుగుతున్నప్పటికీ గాలి నాణ్యత వేగంగా క్షీణించడంపై ఉప ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. పరవాడ పారిశ్రామికవాడ పరిధిలోని తాడి గ్రామం వంటి ప్రాంతాల్లో పరిస్థితులు అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. రసాయన పరిశ్రమల వల్ల వెలువడుతున్న కాలుష్యం కారణంగా ఆయా గ్రామాల్లో ఇంటికొకరు చొప్పున క్యాన్సర్ బారిన పడటం, చిన్నారుల్లో చర్మ వ్యాధులు, మహిళల్లో గర్భస్రావాలు పెరగడం వంటి ఘటనలు తన దృష్టికి వచ్చాయని వీటిని మానవతా దృక్పథంతో పరిష్కరించాలని కోరారు.
ప్రజల్లో పెరిగిపోతున్న అభద్రతా భావం
పరిశ్రమలు నిబంధనలు సరిగ్గా పాటించడం లేదనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉత్తరాంధ్రను అన్ని రకాల కాలుష్యాలకు ఒక 'డంపింగ్ యార్డ్ గా మార్చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. పరిశ్రమలు రావడం వల్ల తమ ప్రాణాలు పోతాయనే భయం ప్రజల్లో ఉండకూడదని, యాజమాన్యాలు సాటి మనుషుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఆధునిక సాంకేతికతతో వ్యర్థాల నిర్వహణ చేపట్టి స్థానిక ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
'గ్రేట్ గ్రీన్ వాల్' పర్యావరణ పరిరక్షణకు కొత్త బాట
పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'గ్రేట్ గ్రీన్ వాల్' ప్రాజెక్టును ముందుకు తీసుకు వస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని 970 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 5 కిలోమీటర్ల వెడల్పున మూడు బఫర్ జోన్లుగా విడగొట్టి మొక్కలతో రక్షణ గోడను నిర్మించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశమని వివరించారు. ప్రతి పరిశ్రమ తమ ప్రాంగణంలో కనీసం 33 శాతం గ్రీన్ బెల్ట్ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని ఈ పర్యావరణ యజ్ఞంలో పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
