Let's talk: editor@tmv.in
కాలుష్యం గుప్పిట్లో ఢిల్లీ

కాలుష్యం గుప్పిట్లో ఢిల్లీ

Shaik Mohammad Shaffee
18 అక్టోబర్, 2025

దీపావళి పండుగ ఇంకా రాకముందే దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం దట్టమైన పొగలా కమ్మేసింది. వరుసగా మూడో రోజు శుక్రవారం కూడా గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) 'చాలా ప్రమాదకరమైన' స్థాయిలోనే నమోదై, ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి ఏర్పడింది.

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం, శుక్రవారం ఉదయం 8 గంటలకు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 350 మార్కును దాటింది. ఇది తీవ్రమైన ప్రజారోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 370గా నమోదైంది. అక్షర్ ధామ్ ప్రాంతంలో ఏక్యూఐ 369, వాజీపూర్‌లో 328, జహంగీర్‌పురి 324గా నమోదైంది.

నిపుణులు చెప్పినదాని ప్రకారం ఏక్యూఐ 0- 50 మధ్య ఉంటే దాన్ని మంచి గాలిగా పరిగణిస్తారు. 51- 100 మధ్య ఉంటే సంతృప్తికరంగా, 101-200 మధ్య ఉంటే 'మధ్యస్థం'గా, 201-300ల మధ్య ఉంటే అధ్వాన్నమని (పూర్), 301- 400 మధ్య ఉంటే తీవ్ర అధ్వాన్నమని (వెరీ పూర్), 401-500 మధ్య ఉంటే ప్రమాదకరంగా పరిగణిస్తారు.

‘గ్రాప్’ తొలి దశ అమలు

ఢిల్లీలో విషమిస్తున్న వాయు కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (గ్రాప్) తొలి దశను అమలు చేశారు. ఈ దశలో భాగంగా నిర్మాణ, కూల్చివేత పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. డీజిల్ జనరేటర్ల వాడకంపై నిషేధం విధించారు. యాంటీ-స్మోగ్ గన్‌ల వినియోగం, రోడ్లపై నీటిని చల్లడం వంటి చర్యలు చేపట్టారు. కాలుష్యం మరింత పెరిగి, ఏక్యూఐ 400-500 మధ్య ఉంటే (తీవ్ర స్థాయి), రెండో దశ కింద మరిన్ని కఠినమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో, ప్రజలు వీలైనంత వరకు బయటకు వెళ్లవద్దని, ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్‌లు వాడటం మంచిదని, కాలుష్య నియంత్రణ చర్యలకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఢిల్లీలో కాలుష్యానికి కారణాలు

ప్రతి ఒక్కరూ వ్యక్తిగత వాహనాలను (కార్లు, బైక్‌లు) ఎక్కువగా ఉపయోగించడం, ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు తక్కువ సమయంలో పొలాలను సిద్ధం చేసుకోవడానికి పంట వ్యర్థాలను తగలబెట్టడం, భవనాలు, రోడ్ల నిర్మాణ సమయంలో దుమ్ము, ధూళిని నియంత్రించడంలో అజాగ్రత్త చూపడం, నిర్మాణ వ్యర్థాలను సరిగ్గా తొలగించకపోవడం, పరిశ్రమలు కాలుష్య నియమాలను ఉల్లంఘించడం, మురికివాడల్లో, ఇళ్లలో వంట కోసం బొగ్గు, కలప వంటి కాలుష్య ఇంధనాలను వాడటం, వీధులు, బహిరంగ ప్రదేశాలలో చెత్త, ప్లాస్టిక్‌ను తగలబెట్టడం వల్ల విషపూరితమైన పొగ వాతావరణంలో కలిసి పోయి వాయు కాలుష్యాన్ని మరింత తీవ్రతరం చేస్తుంది.

కాలుష్యాన్ని తగ్గించే చర్యలు

కాలుష్యం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఎన్95 లేదా పీ100 మాస్కులు ధరించి మాత్రమే బయటకు వెళ్లండి. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో బయట జాగింగ్, వాకింగ్ వంటివి తగ్గించండి. వీలైతే ఇంట్లోనే చేయండి. ఇంట్లో గాలి నాణ్యతను మెరుగుపరచుకోవడానికి ఎయిర్ ప్యూరిఫైయర్లు ఉపయోగించండి. కిటికీలు, తలుపులు మూసి ఉంచండి. కాలుష్యం వల్ల శరీరంలో ఏర్పడే నష్టాన్ని తగ్గించడానికి విటమిన్ సి, విటమిన్ ఇ, ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఆహారం (పండ్లు, ఆకు కూరలు) తీసుకోండి.

నీరు ఎక్కువగా తాగండి. అనారోగ్యంతో ఉన్నవారు, చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్లడం పూర్తిగా మానుకోవడం మంచిది. వీలైనప్పుడల్లా వ్యక్తిగత వాహనాల బదులు మెట్రో, బస్సులు, కార్‌పూలింగ్ వంటి వాటిని ఉపయోగించండి. దగ్గరి ప్రయాణాలకు సైకిల్‌ను లేదా నడకను ఎంచుకోండి. చెత్త, ఆకులను ఎప్పుడూ తగలబెట్టవద్దు. సరిగ్గా రీసైకిల్ చేయండి. నిర్మాణ పనులు జరిగే చోట దుమ్ము నియంత్రణకు తడిపిన తెరలు వాడండి. చుట్టూ, ఇంట్లో మొక్కలు పెంచండి. ఇవి గాలిని సహజంగా శుద్ధి చేస్తాయి.