
కాలానుగుణంగా పాలనలో మార్పులు అవసరం: ప్రధాని మోడీ
పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా పరిపాలన వ్యవస్థను కాలానుగుణంగా నిరంతరం నవీకరించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. ప్రభుత్వ పరిపాలనలో ప్రధాన మంత్రంగా ‘నాగరిక దేవో భవ’ (పౌరుడే ప్రధానం) అనే భావనను అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం‘సాధన సప్తాహ్’ కార్యక్రమ ప్రారంభోత్సవంలో వీడియో సందేశం ద్వారా ఆయన మాట్లాడుతూ, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ సేవలను మరింత సామర్థ్యవంతంగా, సున్నితంగా మార్చే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. పరిపాలన వ్యవస్థ ప్రజా కేంద్రంగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, ప్రజల జీవన ప్రమాణాలు రోజురోజుకూ మెరుగుపడేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని ప్రధాని అన్నారు. ప్రజల జీవన నాణ్యత పెరగడమే ప్రభుత్వ పనితీరుకు అసలు ప్రమాణమని స్పష్టం చేశారు. అధికారులు ప్రతి రోజు కొత్త విషయాలు నేర్చుకోవాలని సూచించిన ఆయన, నిర్ణయాలు తీసుకునే ముందు తమ బాధ్యతలను గుర్తుంచుకోవాలని అన్నారు. అలా చేస్తే తీసుకునే నిర్ణయాల ప్రభావం మరింత విస్తృతంగా ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వ అధికారుల పనితీరు నమ్మకం పెంచాలి
ప్రపంచ వ్యవస్థలు వేగంగా మారుతున్న నేపథ్యంలో భారత్ కూడా పరిపాలన వ్యవస్థను నిరంతరం ఆధునికీకరించాల్సిన అవసరం ఉందని ప్రధాని పేర్కొన్నారు. సాధారణ పౌరుడికి స్థానిక ప్రభుత్వ కార్యాలయమే మొత్తం ప్రభుత్వానికి ప్రతినిధిగా కనిపిస్తుందని గుర్తుచేశారు. అందువల్ల ప్రభుత్వ అధికారుల పని తీరు, ప్రవర్తన ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని పెంచేలా ఉండాలని అన్నారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడం ప్రజాస్వామ్యానికి అత్యంత ముఖ్యమని చెప్పారు. దేశ సమాఖ్య వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ అన్ని రాష్ట్రాల అభివృద్ధి కలిసివస్తేనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రధాని పేర్కొన్నారు. ‘ఫార్వర్డ్ స్టేట్స్’, ‘బ్యాక్‌వర్డ్ స్టేట్స్’, ‘బిమారు స్టేట్స్’ వంటి పాత వర్గీకరణలను అధిగమించి రాష్ట్రాల మధ్య ఉన్న తేడాలను తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేసే విధానం అవసరమని ఆయన సూచించారు. అలా చేస్తేనే ప్రభుత్వ లక్ష్యాలు విజయవంతం అవుతాయని చెప్పారు. అభివృద్ధి చెందిన భారత్ (వికసిత భారత్) లక్ష్యాన్ని సాధించాలంటే వేగవంతమైన ఆర్థిక వృద్ధి, ఆధునిక మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నైపుణ్యాలతో కూడిన పెద్ద మానవ వనరులు అవసరమని ప్రధాని తెలిపారు.
పౌరుడి లక్ష్యాలకు.. ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి
ప్రస్తుత భారతదేశం ఆశయాలతో నిండిన సమాజంగా మారిందని, ప్రతి పౌరుడికి తన లక్ష్యాలు ఉన్నాయని అన్నారు. వాటిని సాధించేందుకు ప్రభుత్వం గరిష్ఠ మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ప్రభుత్వ పనితీరులో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొంటూ గత 11 సంవత్సరాల్లో ప్రభుత్వ సేవలు, ఆర్థిక వ్యవస్థ, పరిపాలనలో సాంకేతికత విస్తృతంగా ఉపయోగంలోకి వచ్చిందని ప్రధాని చెప్పారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు (ఏఐ) రావడంతో ఈ మార్పులు మరింత వేగంగా జరుగుతాయని అన్నారు. మంచి పరిపాలకుడు, మంచి ప్రభుత్వ ఉద్యోగి సాంకేతికత, డేటా వినియోగంపై మంచి అవగాహన కలిగి ఉండాలని ప్రధాని సూచించారు. భవిష్యత్తులో నిర్ణయాల ప్రక్రియలో ఇవే ప్రధాన ఆధారాలు అవుతాయని అన్నారు. ఏప్రిల్ 2 నుంచి 8 వరకు నిర్వహిస్తున్న ‘సాధన సప్తాహ్’ కార్యక్రమాన్ని కెపసిటీ బిల్డింగ్ కమిషన్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాలను పెంచేందుకు ఇది చేపట్టిన ముఖ్య కార్యక్రమాలలో ఒకటిగా పేర్కొన్నారు. ఈ కమిషన్ దేశంలోని ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాలను పెంపొందించేందుకు మార్గదర్శకాలు రూపొందించడం, ప్రమాణాలు నిర్దేశించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తోందని ప్రధాని తెలిపారు. అలాగే మిషన్ కర్మయోగి ద్వారా పరిపాలనలో సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
