
కాలగణనకు ఉజ్జయిని అసలు కేంద్రం: ధర్మేంద్ర ప్రధాన్
గ్రీన్విచ్ మీన్ టైమ్ (జీఎంటీ) స్థానంలో ‘మహాకాల్ స్టాండర్డ్ టైమ్’ (ఎంఎస్‌టీ)ను స్థాపించే సమయం వచ్చిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని కాల గణనకు అసలు కేంద్రం అని ఆయన పేర్కొన్నారు. ‘మహాకాల్ – ది మాస్టర్ ఆఫ్ టైమ్’ అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోని ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలు అయిన ఉజ్జయిని, వారణాసి (కాశీ), కంచీపురం, పురీ వంటి ప్రదేశాలు శాస్త్రం, కళలు, సంస్కృతి, సాహిత్యం, ఆధ్యాత్మికతల సమన్వయానికి ప్రయోగశాలలని ఆయన అన్నారు. ఉజ్జయిని వద్దే ప్రైమ్ మెరిడియన్, ట్రాపిక్ ఆఫ్ కేన్సర్(దేశాన్ని మధ్యగా విభజించే రేఖ) కలుస్తాయని, ప్రాచీన కాలంలో ప్రపంచ కాల గణనలు ఇక్కడే జరిగేవని ప్రధాన్ పేర్కొన్నారు. అందుకే గ్రీన్విచ్ మీన్ టైమ్ స్థానంలో ‘మహాకాల్ స్టాండర్డ్ టైమ్’ను తార్కికంగా స్థాపించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆధునిక కృత్రిమ మేధస్సు (ఏఐ) సాధనాలు కూడా కాల గణనకు అసలు కేంద్రం ఉజ్జయిని పరిసర ప్రాంతమేనని గుర్తిస్తున్నాయని ఆయన అన్నారు.
దేశ శాస్త్రీయ గౌరవాన్ని ప్రపంచ స్థాయిలో మళ్లీ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఉజ్జయినిలోని సైన్స్ సెంటర్, ప్లానెటేరియంను బలోపేతం చేయడం ఈ దిశలో కీలక అడుగు అని తెలిపారు. శాస్త్రం ఆధ్యాత్మికత లేకుండా అసంపూర్ణమని పేర్కొంటూ, మహకాలేశ్వర్‌ను ఉదాహరణగా ఆయన వివరించారు. భారతీయ జ్ఞాన సంప్రదాయంలో ప్రకృతి మార్పులకు అనుగుణంగా జీవన విధానాన్ని మార్చుకునే శాస్త్రీయ అవగాహన శతాబ్దాలుగా ఉందని ప్రధాన్ పేర్కొన్నారు.
పాఠశాల స్థాయిలోనే ఏఐ
జాతీయ విద్యా విధానం ఎన్‌ఈపీ–2020ను ప్రస్తావిస్తూ, కేవలం కంఠస్థ విద్య నుంచి సృజనాత్మకత, డిజైన్ థింకింగ్, విమర్శనాత్మక ఆలోచనలపై దృష్టి పెట్టే విద్యా విధానం అవసరమని అన్నారు. ప్రపంచంలో కృత్రిమ మేధస్సు యుగం కొనసాగుతున్నందున విద్యార్థులు వెనుకపడకుండా పాఠశాల స్థాయిలోనే ఏఐ వంటి కొత్త కోర్సులు ప్రవేశపెడుతున్నామని చెప్పారు. జ్ఞానంపై ఏ ఒక్క భాషకూ ఏకాధిపత్యం ఉండదని, అందుకే విద్యను భారతీయ భాషలు, జానపద సంస్కృతితో అనుసంధానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ వెబ్‌సైట్, బ్రోచర్, పుస్తకాలను వారు విడుదల చేశారు. శాస్త్రీయ నాయకత్వాన్ని పెంపొందించేందుకు రూపొందించిన ఈ బహుళ స్థాయి మూల్యాంకన వ్యవస్థపై ఒక వీడియోను ప్రదర్శించారు. రూ.15 కోట్ల వ్యయంతో నిర్మించిన సైన్స్ సెంటర్‌ను ప్రారంభించారు. అలాగే 2028లో జరగనున్న సింహస్థ కుంభామేళా ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని మోహన్ యాదవ్ చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద సాంస్కృతిక మహోత్సవంగా భావించే ఈ కార్యక్రమానికి సుమారు 35 నుంచి 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఆయన తెలిపారు.
