
కార్వార్ నావల్ బేస్‌లో ప్రయాణించిన రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం భారత నౌకాదళానికి చెందిన స్వదేశీ కల్వరి తరగతి జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగ్‌శీర్‌పై సముద్ర ప్రయాణం చేశారు. కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్ నుంచి ప్రారంభమైన ఈ సీ సార్టీ పశ్చిమ తీర సముద్ర ప్రాంతంలో నిర్వహించారు. ఈ సందర్భంగా భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి కార్యాలయం సామాజిక వేదిక ‘ఎక్స్’లో ఒక పోస్టు చేసింది. ఆ పోస్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటకలోని కార్వార్ నావల్ బేస్ నుంచి భారత నౌకాదళానికి చెందిన స్వదేశీ కల్వరి క్లాస్ సబ్‌మరీన్ ఐఎన్ఎస్ వాగ్‌శీర్‌లో ప్రయాణించారు. పశ్చిమ తీరంలో సముద్రంపై సార్టీ(ప్రయాణం) చేశారు. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అయిన రాష్ట్రపతి వెంట నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె. త్రిపాఠి ఉన్నారని పేర్కొంది. కల్వరి తరగతి జలాంతర్గామిలో ప్రయాణం చేసిన రెండో భారత రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ఇంతకు ముందు మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏ.పీ.జే. అబ్దుల్ కలాం మాత్రమే ఇలాంటి సముద్ర ప్రయాణం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము చేసిన ఈ సముద్ర ప్రయాణానికి విశేష ప్రాధాన్యత ఏర్పడింది.
ఐఎన్ఎస్ వాగ్‌శీర్ అనేది ప్రాజెక్ట్–75 కింద నిర్మించిన ఆరవ కల్వరి తరగతి జలాంతర్గామి. ఈ జలాంతర్గామిని 2025 జనవరి 15న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో అధికారికంగా భారత నౌకాదళంలోకి చేర్చారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ త్రిపాఠి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అలాగే ఫ్రాన్స్‌కు చెందిన నావల్ గ్రూప్ ఛైర్మన్, సీఈవో పియెర్ ఎరిక్ పొమెల్లెట్ కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.
ఐఎన్ఎస్ వాగ్‌శీర్‌ను మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) నిర్మించింది. ఇది ఫ్రాన్స్‌కు చెందిన నావల్ గ్రూప్ రూపొందించిన స్కార్పీన్ డిజైన్ ఆధారంగా తయారైంది. ఈ జలాంతర్గామిని 2022 ఏప్రిల్ 20న జలప్రవేశం చేశారు. అనంతరం విజయవంతంగా సముద్ర పరీక్షలు పూర్తిచేసుకుంది. ఈ సబ్‌మైరన్ ఇప్పటికే సేవలో ఉన్న ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖండేరి, ఐఎన్ఎస్ కరణ్‌జ్, ఐఎన్ఎస్ వేలా, ఐఎన్ఎస్ వాగిర్‌ల సరసన చేరింది. ఇవి వరుసగా 2017 డిసెంబర్, 2019 సెప్టెంబర్, 2021 మార్చి, 2021 నవంబర్, 2023 జనవరిలో నౌకాదళంలోకి వచ్చాయి.
ఐఎన్ఎస్ వాగ్‌శీర్ కమిషనింగ్‌తో భారతదేశం చేపట్టిన స్వదేశీ జలాంతర్గామి నిర్మాణ కార్యక్రమం విజయవంతమైందని నౌకాదళ వర్గాలు పేర్కొన్నాయి. పూర్తిగా భారతదేశంలోనే నిర్మించిన ఈ జలాంతర్గామి, సాంకేతికత బదిలీ ద్వారా తయారై, కేంద్ర ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’ విధానానికి బలమైన ఉదాహరణగా నిలిచింది.
ఇదిలా ఉండగా, రాష్ట్రపతి కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 29న జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో నిర్వహించనున్న ఓల్ చికీ లిపి శతాబ్ది వేడుకల్లో పాల్గొననున్నారు. అదే రోజు ఆమె ఎన్ఐటీ జంషెడ్‌పూర్ 15వ స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. తదుపరి రోజు డిసెంబర్ 30న, జార్ఖండ్‌లోని గుమ్లాలో జరిగే అంతర్రాష్టీయ జనసాంస్కృతిక సమాగం – కార్తీక్ జాత్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.
