
కార్వాన్ నియోజకవర్గంలో పావురాలకు మేత వేయవద్దు: అక్బరుద్దీన్ ఒవైసీ
పావురాలకు నిర్దిష్ట ప్రదేశాల్లో నియంత్రణలేని ఆహారం వేయడం వల్ల ఏర్పడుతున్న ఆరోగ్య సమస్యలపై తెలంగాణ శాసనసభలో ఎంఐఎం శాసనసభ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ శుక్రవారం కీలకంగా ప్రస్తావించారు. పావురాల మలమూత్రం, రెక్కల ధూళి వల్ల శ్వాసకోశ వ్యాధులు, అలర్జీలు వంటి సమస్యలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. పావురాలకు మేత వేయాలనుకునే వారు తమ సొంత డాబాల పైన వేసుకోవాలని, బహిరంగ రోడ్ల మీద వేయడం వల్ల అందరికీ ఇబ్బంది కలుగుతోందని సూచించారు.
ఈ నేపథ్యంలో ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సూచనల మేరకు, ఎంఐఎం శాసనసభ ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో కర్వాన్ నియోజకవర్గంలో యాంటీ-పావురాల ఆహార అవగాహన డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం జనవరి చివరి వారంలో ప్రారంభం కానుంది.
ఈ అవగాహన డ్రైవ్ ప్రధాన లక్ష్యం, ప్రజలకు పావురాల ఆహారం వల్ల కలిగే ఆరోగ్య ప్రమాదాలపై స్పష్టమైన సమాచారం అందించడం. నియంత్రణలేని పావురాల పెరుగుదల వల్ల పరిసరాల పరిశుభ్రత దెబ్బతిని, దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రజలకు తెలియజేయనున్నారు. కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమాలు, ఇంటింటి సందర్శనలు, ప్రత్యక్ష సంభాషణల ద్వారా ప్రజలతో మమేకమవుతూ అవగాహన కల్పించనున్నారు. అలాగే ఉర్దూ, తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో సమాచార పత్రికలను పంపిణీ చేయడం ద్వారా ప్రతి వర్గానికి ఈ సందేశం చేరేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
నగరంలో పెరుగుతున్న పావురాల జనాభా వల్ల శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో, ఎంఐఎం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
