
కార్యకర్తలే టీడీపీ బలం..వారిని పట్టించుకోని వారికి పార్టీలో చోటు లేదు: ఏపీ సీఎం
తెలుగుదేశం పార్టీ ఉనికికి, విజయానికి కార్యకర్తలే అసలైన బలమని వారిని పట్టించుకోని నాయకులకు పార్టీలో భవిష్యత్తు ఉండదని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తొలుత కార్యాలయ ప్రాంగణంలో భారీ పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆయన, అనంతరం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన కార్యకర్తలకు అండగా ఉంటామని కష్టపడి పనిచేసే వారికే పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని తేల్చి చెప్పారు
త్యాగాల పునాదులపై పసుపు జెండా
టీడీపీ ప్రయాణం కేవలం రాజకీయ అధికారం కోసం సాగింది కాదని, ఇది త్యాగాలు మరియు పోరాటాల సుదీర్ఘ చరిత్ర అని చంద్రబాబు గుర్తుచేశారు. గత నాలుగు దశాబ్దాల్లో ఎందరో కార్యకర్తలు పార్టీ కోసం ప్రాణాలర్పించారని ఆస్తులు కోల్పోయి అష్టకష్టాలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇందిరా గాంధీ వంటి నాయకుల కాలంలో పార్టీని అణచివేసేందుకు కుట్రలు జరిగినప్పటికీ, కార్యకర్తల అండతోనే టీడీపీ ఫీనిక్స్‌లా ఎదిగిందని కొనియాడారు.
సంస్కరణల విప్లవం.. అభివృద్ధికి చిరునామా
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం పార్టీయే పునాది వేసిందని చంద్రబాబు వివరించారు. కిలో బియ్యం రూ.2 పథకం ద్వారా పేదల ఆకలి తీర్చడం నుంచి, మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం, డ్వాక్రా గ్రూపుల ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేయడం వరకు ప్రతిదీ టీడీపీ చలవేనన్నారు. విద్యుత్ రంగ సంస్కరణలు, ఐటీ అభివృద్ధిలో ఏపీని అగ్రభాగాన నిలబెట్టారని బీసీలకు రాజకీయ సాధికారత కల్పించడంలో తమ పార్టీ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు.
పోలవరం - అమరావతిపై స్పష్టమైన లక్ష్యం
రాష్ట్ర భవిష్యత్తును మార్చే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చంద్రబాబు ప్రకటించారు. అమరావతిని ఏకైక రాజధానిగా అభివృద్ధి చేసే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బహుళ రాజధానుల వంటి గందరగోళ ఆలోచనలను తిరస్కరిస్తూ 2028 నాటికి అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని హమీ ఇచ్చారు.
20 లక్షల ఉద్యోగాల దిశగా అడుగులు
ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తోందని ఆయన తెలిపారు. 'తల్లికి వందనం', 'స్త్రీ శక్తి', 'అన్నదాత సుఖీభవ' వంటి పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామన్నారు. యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని ఇప్పటికే 6.28 లక్షల ఉద్యోగ అవకాశాలను సృష్టించామని ఈ సందర్భంగా వెల్లడించారు.
అపోహలను తిప్పికొట్టండి.. ప్రజల్లోకి వెళ్లండి
పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లోనూ చారిత్రాత్మక విజయాన్ని సాధించేలా ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కార్యకర్తల సంక్షేమానికి పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని వారి పిల్లల చదువుల బాధ్యతను కూడా తామే తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
