
కార్మిక సవరణ బిల్లు ‘చారిత్రాత్మకం’: ఎన్డీయే
పారిశ్రామిక సంబంధాల కోడ్ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా బీజేపీ, దాని మిత్రపక్షాలు దీన్ని కార్మిక సంక్షేమానికి సంబంధించిన ‘చారిత్రాత్మక సంస్కరణ’గా అభివర్ణించగా, ప్రతిపక్షాలు దీన్ని ‘కార్మిక వ్యతిరేకం’గా విమర్శిస్తూ పూర్తిగా ఉపసంహరించాలంటూ డిమాండ్ చేశాయి. ప్రతిపాదిత చట్టం లక్ష్యాలు, కారణాల ప్రకటన ప్రకారం, పారిశ్రామిక సంబంధాల కోడ్, 2020 చట్టం ట్రేడ్ యూనియన్ల చట్టం, 1926; ఇండస్ట్రియల్ ఎంప్లాయ్‌మెంట్ (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం, 1946; ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, 1947లను భర్తీ చేస్తుంది. ఇవి ట్రేడ్ యూనియన్లు, పారిశ్రామిక ఉపాధి, పారిశ్రామిక వివాదాలకు సంబంధించినవి.
చర్చలో పాల్గొన్న జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్ (ఎన్డీయే మిత్రపక్షం) మాట్లాడుతూ, ఇది కార్మికులకు అనుకూలమైన మోడీ ప్రభుత్వ ముందడుగు అని, కార్మికుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకువస్తుందని పేర్కొన్నారు. ఇది చారిత్రాత్మక సంస్కరణ అని అన్నారు.
శివసేన (ఎన్డీయే) సభ్యుడు రవీంద్ర వైకర్ బిల్లుకు మద్దతు తెలుపుతూ, ఇది కార్మిక చట్టాల్లో పెద్ద సంస్కరణగా నిలుస్తుందని, అన్ని వర్గాల ఉద్యోగుల హక్కులను నిర్ధారిస్తుందని చెప్పారు. ఇకపై హక్కుల రక్షణ కోసం కార్మికులు కోర్టులను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.
ఎన్‌సీపీ సభ్యురాలు సుప్రియా సూలే బిల్లుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ, ప్రభుత్వం కష్టపడే కార్మికులు, రైతులు, పేదల ప్రయోజనాలకు విరుద్ధంగా పనిచేస్తోందని ఆరోపించారు. పరిశ్రమల అభివృద్ధికి తమ పార్టీ అనుకూలమేనని, కానీ కార్మికుల గౌరవం, న్యాయం, హక్కుల పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఉండాలన్నారు. దేశ కార్మికులను అభద్రతాభావంలోకి నెట్టడాన్ని మేము సమర్థించం. దయచేసి మళ్లీ ఆలోచించండని ఆమె కోరారు. బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో కార్మిక సంక్షేమంపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం పెద్ద ముందడుగు వేసిందన్నారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) ఎంపీ అరుణ్ భారతి మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్, బీహార్ కార్మికులు దేశంలోని ఇతర ప్రాంతాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారని, ఈ బిల్లు వారి హక్కులను రక్షించి గౌరవాన్ని కల్పిస్తుందని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ గురుమూర్తి మద్దిల బిల్లుకు మద్దతు తెలుపుతూ, ఇది కార్మికులకు ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీ రాజు బిస్తా బిల్లుకు మద్దతు తెలుపుతూ, ఇది 50 కోట్ల కార్మికులకు గౌరవం ఇవ్వబోతుందని అన్నారు. సమయానికి వేతనాలు, మహిళా కార్మికులకు సమాన వేతనాలు, సామాజిక భద్రతను ఈ బిల్లు నిర్ధారిస్తుందని పేర్కొన్నారు.
కార్మికుల హక్కులు రక్షించాలి
డీఎంకే ఎంపీ రాణి శ్రీకుమార్ మాట్లాడుతూ, ఈ చట్టం అమల్లోకి వస్తే కార్మికుల గౌరవం, భద్రత దెబ్బతింటాయని అన్నారు. కార్మికుల స్వరాన్ని ప్రభుత్వం వినాలని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ ఎం.కే. విశ్ణు ప్రసాద్ బిల్లును వ్యతిరేకిస్తూ, ఇది ఉద్యోగుల హక్కులను బలహీనపరుస్తుందని అన్నారు. ఈ బిల్లు ప్రభుత్వానికి మార్కెట్ ప్రాధాన్యం ఎక్కువగా ఉండి, ఉద్యోగుల ప్రయోజనాలకు తక్కువ ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు. సీపీఎం ఎంపీ కె. రాధాకృష్ణన్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఉపసంహరించాలన్నారు. ఆప్ సభ్యుడు మల్విందర్ సింగ్ కాంగ్ మాట్లాడుతూ, కార్మిక కోడ్లు ఉద్యోగుల ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేస్తాయని ఆరోపించారు. కనీస వేతనాల నిబంధన ఈ బిల్లుతో ముగుస్తుందని అన్నారు. ఐయూఎంఎల్ సభ్యుడు ఈ.టి. మహమ్మద్ బషీర్ మాట్లాడుతూ, ఈ బిల్లు ట్రేడ్ యూనియన్లకు అడ్డంకిగా మారుతుందని, దేశం అత్యధిక నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్న సమయంలో ఈ చట్టం తీసుకురావడం సమంజసం కాదన్నారు. సీపీఎం సభ్యుడు సుదామ ప్రసాద్ కూడా బిల్లును వ్యతిరేకిస్తూ, ‘హైర్ అండ్ ఫైర్’ విధానాన్ని ప్రోత్సహిస్తుందని విమర్శించారు. ఆర్‌ఎల్పీ సభ్యుడు హనుమాన్ బెనీవాల్ మాట్లాడుతూ, కార్మిక హక్కులను రక్షించే చట్టాలను ఈ బిల్లు బలహీనపరుస్తుందని అన్నారు. కార్మిక వ్యతిరేక చట్టాలను నేను అంగీకరించలేను అని పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌పీ ఎంపీ ఎన్.కే. ప్రేమచంద్రన్ మాట్లాడుతూ, ఇది కార్మికుల ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను హరించేస్తుందని విమర్శించి, పూర్తిగా ఉపసంహరించాలన్నారు. ఆజాద్ సమాజ్ పార్టీ (కాన్షీ రామ్) సభ్యుడు చంద్రశేఖర్ ఆజాద్ మాట్లాడుతూ, ఈ బిల్లు కంపెనీలకు ‘హైర్ అండ్ ఫైర్’ విధానాన్ని అమలు చేయడానికి మార్గం సుగమం చేస్తుందని ఆరోపించారు. మార్పులకు మేము వ్యతిరేకం కాదు. కానీ కార్మికుల హక్కులు రక్షించబడాలని అన్నారు. స్వతంత్ర సభ్యుడు అబ్దుల్ రషీద్ షేఖ్ అసంఘటిత రంగ కార్మికుల హక్కులను కాపాడాలని కోరారు. మరో స్వతంత్ర సభ్యుడు ఉమేష్ భాయ్ బాబుభాయ్ పటేల్ కూడా కార్మిక వ్యతిరేక అంశాల కారణంగా బిల్లుపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక బిల్లుకు నేను మద్దతు ఇవ్వలేనని స్పష్టం చేశారు.
బిల్లులో సెక్షన్ 104 కింద సేవింగ్ నిబంధనలు చేర్చారు. ఇప్పటికే కోడ్‌లోని సెక్షన్ 104 ద్వారా పాత చట్టాలు రద్దయినప్పటికీ, భవిష్యత్తులో కార్యనిర్వాహక శాఖకు రద్దు చేసే అధికారాన్ని అప్పగించిందన్న అపోహలు తలెత్తకుండా చట్టపరమైన స్పష్టత కోసం ఈ నిబంధనలు చేర్చినట్లు వివరణలో పేర్కొన్నారు.
