
కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఇండియా బ్లాక్ నిరసన
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు కొత్త కార్మిక చట్టాలపై పార్లమెంట్‌లో బుధవారం విపక్ష పార్టీలు తీవ్ర నిరసన తెలిపాయి. ఈ చట్టాలు కార్మికుల ఉద్యోగ భద్రతను ధ్వంసం చేస్తాయి, పెద్ద కంపెనీలకు అపార స్వేచ్ఛ ఇస్తాయి, క్రోనీ మిత్రులకు మాత్రమే లాభం చేకూరుస్తాయి అంటూ కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ(ఎం), ఆర్‌జేడీ తదితర పార్టీలు ఆరోపించాయి. ఈ నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలు పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతలు ఈ కార్మిక చట్టాలు దేశంలో కార్పొరేట్ జంగిల్ రాజ్ ను తీసుకొస్తాయన్నారు. కార్పోరేట్ జంగిల్ రాజ్ కి నో, లేబర్ జస్టిస్ కు ఎస్ అంటూ పెద్ద బ్యానర్లు ప్రదర్శించారు. శీతాకాల సభలు ప్రారంభమైనప్పటి నుంచే ఇండియా బ్లాక్ ఎంపీలు ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(ఎస్ఐఆర్) పై చర్చ కోరుతూ నిరసనలో ఉన్నారు. ప్రభుత్వం చర్చకు అంగీకరించినా, కార్మిక చట్టాల విషయంలో వారు తమ వ్యతిరేక ధోరణిని కొనసాగించారు. ప్రతిపక్ష ఫ్లోర్ లీడర్లు సమావేశమై, రాబోయే చర్చలపై వ్యూహరచన చేశారు. దీనికి ఖర్గే, రాహుల్ తదితరులు హాజరయ్యారు.
విపక్ష నేతలు లేవనెత్తిన ముఖ్య అంశాలు
ఉద్యోగ భద్రతపై దాడి
• పరిశ్రమలో 100 మంది కార్మికులు ఉంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన నిబంధనను 300 మందికి పెంచారు. దీంతో దేశంలోని 80 శాతం కర్మాగారాలు ఇకపై కార్మికులను ప్రభుత్వ అనుమతి లేకుండానే తొలగించే అవకాశం ఉంది.
• ఫిక్స్‌డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ (ఎఫ్టీఈ) విధానాన్ని విస్తరించడంతో దాదాపు అంతరించిపోనున్న శాశ్వత ఉద్యోగాలు .
12 గంటల పని దినం
• కాగితంపై 8 గంటల పని ఉన్నట్టు చూపినా రాష్ట్రాలకు 12 గంటల షిఫ్టులను అనుమతించే అవకాశం కల్పించారు. ఇది కార్మికుల అలసట, ప్రమాదాలను పెంచుతుంది.
• సమ్మె చేయాలంటే 60 రోజుల ముందస్తు నోటీసు + 14 రోజుల కూలింగ్ పీరియడ్ తప్పనిసరి. అత్యవసర పరిస్థితుల్లో కూడా తక్షణమే సమ్మె చేయడం అసాధ్యం.
• 51 శాతం సభ్యత్వం ఉన్న ఒకే యూనియన్‌కు మాత్రమే ఒప్పందాలు చేసే హక్కు ఇవ్వడంతో చిన్న యూనియన్లు పూర్తిగా అణచివేతకు గురవుతాయి.
• 50 శాతం కార్మికులు కలిసి సెలవు తీసుకుంటే అది సమ్మెగానే పరిగణించి జరిమానాలు విధించే అవకాశం.
• మధ్య తరగతి కర్మాగారాల్లో ‘హైర్ అండ్ ఫైర్’ స్వేచ్ఛ
• 300 మందికంటే తక్కువ కార్మికులున్న యూనిట్లకు స్టాండింగ్ ఆర్డర్స్ వర్తించవు. పని గంటలు, సెలవులు, తొలగింపు నియమాలు ఏవీ తప్పనిసరి కావు.
• కర్మాగార నిర్వచనాన్ని విద్యుత్ ఉపయోగించి పనిచేస్తే 20 మంది, లేకుండా 40 మంది కార్మికులకు పెంచారు. దీంతో చిన్న కర్మాగారాల్లో భద్రతా నిబంధనలు పూర్తిగా వర్తించకుండా పోతాయి.
• బీడీ కార్మికులు, జర్నలిస్టుల వంటి ప్రత్యేక వర్గాల రక్షణలను సాధారణ చట్టంలో విలీనం చేసి బలహీనపరిచారు.
• వలస కార్మికులకు స్థానభ్రంశ భత్యం రద్దు. నెలకు రూ.18,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారిని సామాజిక భద్రత నుంచి మినహాయించారు.
• ఆధార్ ఆధారిత నమోదు తప్పనిసరి చేయడంతో డాక్యుమెంట్ సమస్యలు ఉన్న లక్షలాది వలస కార్మికులు సంక్షేమ పథకాలకు దూరమవుతారు.
నేరాలను ‘డబ్బుతో కొనేసే’ అవకాశం
• జరిమానా చెల్లించి జీతం ఆలస్యం, ఓవర్‌టైమ్ నిరాకరణ వంటి నేరాలను కంపౌండింగ్ చేసే నిబంధనతో చట్ట ఉల్లంఘనలను చెల్లించదగిన ఖర్చుగా మార్చేశారు.
• ఈ నాలుగు కార్మిక కోడ్‌లు కార్మికుల హక్కులను పూర్తిగా కాలరాస్తాయి. ఇవి కార్పొరేట్ మిత్రులకు మాత్రమే లాభదాయకం అంటూ విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఆవరణలో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.
కార్మిక కోడ్స్‌పై కేంద్ర వాదన ఏమిటి
కార్మిక చట్టం 2020 ప్రకారం 51శాతం సభ్యత్వం ఉన్న గుర్తింపు పొందిన ట్రేడ్ యూనియన్‌ను నేగోటింగ్ యూనియన్ గా గుర్తించవచ్చు. ఈ విధానం సమూహపు చర్చా శక్తిని బలోపేతం చేస్తుందని కేంద్రం వాదిస్తోంది. మాస్ క్యాజువల్ లీవ్‌ను కూడా సమ్మెగా పరిగణిస్తూ ఆకస్మిక సమ్మెలను నిలువరించే విధానాన్ని తీసుకొచ్చింది.
