Let's talk: editor@tmv.in
కార్మికులకు శుభవార్త.. అమల్లోకి 4 కొత్త లేబర్ కోడ్‌లు

కార్మికులకు శుభవార్త.. అమల్లోకి 4 కొత్త లేబర్ కోడ్‌లు

Shaik Mohammad Shaffee
22 నవంబర్, 2025

దేశంలోని కోట్లాది మంది కార్మికులకు ఊరటనిస్తూ, వారి సంక్షేమం, భద్రతను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. గత ఏడు దశాబ్దాలుగా ఉన్న 29 పాత కార్మిక చట్టాలను రద్దు చేస్తూ, కొత్తగా రూపొందించిన నాలుగు లేబర్ కోడ్‌లు (కార్మిక స్మృతులు) నవంబర్ 21 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.

కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సంస్కరణలు ‘ఆత్మనిర్భర్ భారత్’, 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యానికి కొత్త వేగాన్ని అందిస్తాయని ఆయన తెలిపారు.

అమలైన నాలుగు కొత్త కార్మిక కోడ్‌లు

భారతదేశ కార్మిక పాలనను ఆధునికీకరించి, సరళతరం చేయడానికి ఈ నాలుగు కోడ్‌లను ప్రవేశపెట్టారు. వేతనాల నియమావళి, 2019 (కనీస వేతనాలు, సకాలంలో జీతాల చెల్లింపుపై దృష్టి పెడుతుంది), పారిశ్రామిక సంబంధాల నియమావళి, 2020 (ఉద్యోగ నిబంధనలు, ఫిక్స్‌డ్-టర్మ్ ఉద్యోగులకు గ్రాట్యుటీపై మార్పులు చేసింది), సామాజిక భద్రత కోడ్, 2020 (పీఎఫ్, ఈఎస్‌ఐసీ, గిగ్ వర్కర్ల భద్రతను పెంచుతుంది), వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్, 2020 (పని ప్రదేశంలో భద్రత, మహిళలకు రాత్రి షిఫ్ట్‌లపై దృష్టి పెడుతుంది) అనే చట్టాలను తీసుకొచ్చింది.

కార్మికులకు లభించే ప్రధాన ప్రయోజనాలు

ఈ కొత్త చట్టాల ద్వారా దేశంలోని 40 కోట్ల మందికి పైగా కార్మికులకు లబ్ది చేకూరనుంది. ఈ చట్టాల ద్వారా ఇకపై దేశంలోని ప్రతి కార్మికుడికి, ప్రతి రంగంలోనూ సకాలంలో కనీస వేతనం చెల్లించడం చట్టబద్ధమైన హక్కు. జాతీయ స్థాయిలో ఫ్లోర్ వేజ్ నిర్ణయించడం వల్ల ఎవరి వేతనం కూడా ఒక స్థాయి కంటే తక్కువగా ఉండదు. అలాగే ప్రతి కార్మికుడికి (యువత సహా) నియామక పత్రం ఇవ్వడం తప్పనిసరి. ఇది ఉద్యోగ భద్రతకు, పారదర్శకతకు హామీ ఇస్తుంది.

గిగ్ వర్కర్లు (ఉదా:ఆన్‌లైన్ డెలివరీ ఏజెంట్లు), ప్లాట్‌ఫామ్ వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులతో సహా అందరికీ పీఎఫ్, ఈఎస్‌ఐసీ, బీమా, మెటర్నిటీ సపోర్ట్ వంటి సామాజిక భద్రత ప్రయోజనాలు లభిస్తాయి. ఫిక్స్‌డ్-టర్మ్ ఉద్యోగులకు కేవలం ఒక సంవత్సరం పనిచేసిన తర్వాతే గ్రాట్యుటీ సౌకర్యం లభిస్తుంది (పాత చట్టంలో ఈ అర్హతకు ఐదేళ్లు పనిచేయాలి). 40 ఏళ్లు పైబడిన కార్మికులకు యజమానులు సంవత్సరానికి ఒకసారి ఉచితంగా ఆరోగ్య పరీక్షలు చేయించడం తప్పనిసరి. ఓవర్‌టైమ్ పనిచేసిన కార్మికులకు రెట్టింపు వేతనం చెల్లించాలి.

మహిళలకు సమాన పనికి సమాన వేతనం తప్పనిసరి. వారి సమ్మతి, పూర్తి భద్రతా ఏర్పాట్లతో రాత్రిపూట షిఫ్టుల్లో కూడా పనిచేయడానికి అనుమతి లభిస్తుంది. మైనింగ్, ప్లాంటేషన్, బీడీ, టెక్స్‌టైల్ వంటి ప్రమాదకర రంగాల్లో పనిచేసే కార్మికులకు 100 శాతం ఆరోగ్య భద్రత, అదనపు భద్రతా చర్యలు అమలు చేస్తారు.

కంపెనీలు, పరిశ్రమలకు సరళత

కొత్త లేబర్ కోడ్‌ల వల్ల కార్మికులకే కాదు, వ్యాపార సంస్థలు, ఎంఎస్ఎంఈలకు కూడా ఎంతో మేలు జరుగుతుంది. 29 పాత చట్టాలలో ఉన్న సంక్లిష్టమైన నిబంధనలకు బదులుగా ఇకపై కంపెనీలకు ఒకే రిజిస్ట్రేషన్, పాన్-ఇండియా సింగిల్ లైసెన్స్, ఒకే రిటర్న్ మాత్రమే అవసరం అవుతుంది. దీనివల్ల పేపర్ వర్క్ భారం చాలా వరకు తగ్గుతుంది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల కంపెనీలు ప్రతి నెలా 7వ తేదీలోపు జీతాలు చెల్లించడం తప్పనిసరి. వివాదాలను త్వరగా పరిష్కరించడానికి రెండు సభ్యులతో కూడిన కొత్త ట్రిబ్యునల్ వ్యవస్థ ఏర్పాటు చేశారు.

ఈ సంస్కరణల ద్వారా కార్మికులకు గౌరవం, భద్రత, మెరుగైన వేతనాలు దక్కడమే కాకుండా, దేశంలోని పని విధానం కూడా మరింత ఆధునికంగా, పారదర్శకంగా మారుతుందని కేంద్రం ప్రకటించింది.

కార్మిక సంస్కరణలపై ప్రధాని మోదీ హర్షం

కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన 4 కొత్త లేబర్ కోడ్‌లపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కార్మికుల కోసం చేసిన సంస్కరణల్లో ఇవి అత్యంత సమగ్రమైనవి, ప్రగతిశీలమైనవి (ముందుకు నడిపించేవి) అని ఆయన అభివర్ణించారు.

“ఈ చట్టాలు కార్మికులకు ఎక్కువ శక్తిని ఇస్తాయి. అదే సమయంలో, వ్యాపార సంస్థలకు నిబంధనల అమలును సులభతరం చేసి 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ను పెంచుతాయి. ఈ కోడ్‌లు ముఖ్యంగా మహిళలు, యువతకు సామాజిక భద్రత, కనీస వేతనం, సకాలంలో జీతాల చెల్లింపు, సురక్షితమైన పని ప్రదేశాలను అందిస్తాయి. ఈ సంస్కరణలు భారతదేశ ఆర్థిక వృద్ధిని బలోపేతం చేసి, ఉద్యోగాలను పెంచి, 'వికసిత భారత్' లక్ష్యాన్ని వేగవంతం చేస్తాయి” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

కార్మికులకు శుభవార్త.. అమల్లోకి 4 కొత్త లేబర్ కోడ్‌లు - Tholi Paluku