
కార్మికులకు పెన్షన్ పెంపు, గిగ్ వర్కర్లకు ఈ-శ్రామ్ తప్పనిసరి
దేశంలో కార్మిక సంక్షేమాన్ని బలోపేతం చేయడానికి పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి కీలక సూచనలు చేసింది. ముఖ్యంగా గిగ్ వర్కర్లందరికీ ఈ-శ్రామ్ పోర్టల్‌లో నమోదు తప్పనిసరి చేయాలని, అలాగే అగ్రిగేటర్ సంస్థల బాధ్యతలను స్పష్టంగా నిర్వచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కార్మిక, వస్త్ర, నైపుణ్యాభివృద్ధి శాఖలపై ఏర్పాటుచేసిన ఈ సంఘం, నివేదికను చైర్మన్ బసవరాజ్ బొమ్మై లోక్‌సభలో సమర్పించారు.
ఈ కమిటీ తమ నివేదికలో ప్రధానంగా సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడం, కార్మికులకు న్యాయమైన వేతనాలు అందేలా చూడడం, కార్మిక పరిపాలనను ఆధునికీకరించడం వంటి అంశాలపై దృష్టి సారించింది. ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితిని మెరుగుపరచడానికి స్పష్టమైన విధానాలు అవసరమని అభిప్రాయపడింది.
కమిటీ ప్రస్తుత ఈపిఎస్ -1995 పథకంలో నెలకు కేవలం రూ.1,000గా ఉన్న కనీస పెన్షన్‌ను పెంచాలని బలంగా సూచించింది. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ పెన్షన్ మొత్తాన్ని తక్షణమే పునర్విమర్శించి పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
అదే విధంగా, నేషనల్ ఫ్లోర్ లెవల్ మినిమమ్ వేజ్‌ను కూడా పెంచాలని కమిటీ సూచించింది. కార్మికుల వాస్తవ ఆదాయాన్ని కాపాడేందుకు కాలానుగుణంగా ఆటోమేటిక్ వేతన సవరణలు జరిగే విధానాన్ని ప్రవేశపెట్టాలని పేర్కొంది. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కార్మికులకు ఆర్థిక భద్రత కల్పిస్తుందని తెలిపింది.
ఒప్పంద కార్మికులు ప్రమాదాలకు గురైనప్పుడు పరిహారం ఆలస్యం అవుతున్న సమస్యను కమిటీ గుర్తించింది. వారికి ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్ వంటి పథకాల కవరేజీ సమయానికి అందేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. అలాగే బాల కార్మిక నిర్మూలన కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరమని, ఎన్సిఎల్పి-ఎస్ఎస్ఏ విలీనాన్ని పునఃపరిశీలించాలని సూచించింది.
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతను కల్పించేందుకు ఈ-శ్రామ్ నమోదు తప్పనిసరి చేయాలని కమిటీ పేర్కొంది. పీఎం-వీబిఆర్వై పథకాన్ని రియల్ టైమ్‌లో పర్యవేక్షించి 2027 నాటికి 3.5 కోట్ల ఉద్యోగాల లక్ష్యాన్ని సాధించాలని సూచించింది. కొత్త లేబర్ కోడ్స్ అమలుకు కేంద్ర-రాష్ట్రాల సమన్వయం కోసం శాశ్వత బోర్డు ఏర్పాటు చేయాలని, డీజిఎంఎస్ లో ఖాళీలను త్వరగా భర్తీ చేసి ఆధునిక సాంకేతికతతో ప్రమాదాలను నివారించాలని కమిటీ స్పష్టం చేసింది.
