
కార్పొరేట్ సామాజిక బాధ్యతలో పర్యావరణ పరిరక్షణ తప్పనిసరి: సుప్రీంకోర్టు
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) అనేది పర్యావరణ బాధ్యత నుంచి వేరు చేయలేనిదని సుప్రీంకోర్టు శనివారం కీలక తీర్పు వెలువరించింది. పర్యావరణం, జీవవైవిధ్యం, ఇతర జీవజాల హక్కులను పట్టించుకోకుండా సంస్థలు తమను తాము ‘సామాజికంగా బాధ్యతగల సంస్థలు’గా చెప్పుకోలేవని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, ఏఎస్ చంద్రకర్‌లతో కూడిన ధర్మాసనం, అంతరించిపోతున్న గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (గోడావన్) పక్షి పరిరక్షణకు సంబంధించి పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పనిచేస్తున్న నాన్-రిన్యూవబుల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల కార్యకలాపాలు ఈ అరుదైన పక్షి నివాసానికి ముప్పుగా మారుతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది.
సీఎస్ఆర్ అంటే పర్యావరణ బాధ్యత కూడా
కార్పొరేట్ సామాజిక బాధ్యత నిర్వచనంలో పర్యావరణ బాధ్యత సహజంగానే భాగంగా ఉండాలి. పర్యావరణం, జీవ వ్యవస్థలోని ఇతర జీవుల హక్కులను విస్మరిస్తూ, సంస్థలు తమను తాము సామాజిక బాధ్యతగలవిగా ప్రకటించుకోలేవని ధర్మాసనం పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51ఏ(జీ) ప్రకారం ప్రతి పౌరుడికి సహజ పర్యావరణాన్ని, అడవులు, నదులు, సరస్సులు, వన్యప్రాణులను రక్షించాల్సిన ప్రాథమిక కర్తవ్యముందని కోర్టు గుర్తుచేసింది.
కార్పొరేషన్ కూడా ఒక లీగల్ పర్సన్‌గా, సమాజంలోని కీలక భాగంగా ఈ బాధ్యతను పంచుకుంటుంది. సీఎస్ఆర్ నిధులు ఈ రాజ్యాంగబద్ధ కర్తవ్యానికి ప్రతిరూపం. కాబట్టి పర్యావరణ పరిరక్షణకు నిధులు కేటాయించడం దానధర్మం కాదు – అది రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించడమే అని స్పష్టం చేసింది.
కంపెనీల లాభాలు సమాజానికి చెందినవే
కంపెనీల చట్టం, 2013లోని సెక్షన్ 135 ద్వారా పార్లమెంట్ ఈ బాధ్యతను సంస్థాగతంగా మలిచిందని కోర్టు పేర్కొంది. కార్పొరేట్ లాభాలు కేవలం షేర్‌హోల్డర్ల వ్యక్తిగత ఆస్తి మాత్రమే కాదు. ఆ లాభాల్లో ఒక భాగం సమాజానికి చెందుతుంది. ప్రైవేట్ ఆస్తి అనేది ఒక ‘ట్రస్ట్’ అన్న భావనలోనే చట్టబద్ధత దాగి ఉందని వ్యాఖ్యానించింది.
డైరెక్టర్ల బాధ్యత విస్తరణ
గతంలో డైరెక్టర్ల ప్రధాన బాధ్యత షేర్‌హోల్డర్ల లాభాలను గరిష్టంగా పెంచడమేనని కోర్టు గుర్తుచేసింది. అయితే సెక్షన్ 166(2) ద్వారా ఈ పరిమిత దృష్టిని విస్తరించారని పేర్కొంది. ఇప్పుడు డైరెక్టర్లు సంస్థ, ఉద్యోగులు, షేర్‌హోల్డర్లు మాత్రమే కాకుండా – సమాజం, పర్యావరణ పరిరక్షణ ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుని నైతికంగా వ్యవహరించాల్సిన చట్టబద్ధ బాధ్యత ఉందని స్పష్టం చేసింది.
‘ పోల్యూటర్ పే సూత్రం’ వర్తింపు
గనులు, విద్యుత్ ఉత్పత్తి, మౌలిక సదుపాయాల వంటి కార్పొరేట్ కార్యకలాపాలు అంతరించిపోతున్న జాతుల నివాసాలను ప్రమాదంలోకి నెట్టినప్పుడు, ‘పోల్యూటర్ పే’ సూత్రం ప్రకారం ఆ సంస్థలే పునరుద్ధరణ ఖర్చును భరించాలని కోర్టు ఆదేశించింది.
సీఎస్ఆర్ నిధులు తప్పనిసరిగా ఇన్-సిటు(జంతువు/మొక్క ఉన్న చోటే కాపాడటం), ఎక్స్-సిటు(బయటికి తీసుకెళ్లి కాపాడటం) సంరక్షణ చర్యలకు వినియోగించాల్సిందేనని స్పష్టం చేసింది.
గోడావన్ నివాసంలో అతిథుల్లా వ్యవహరించాలి
రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పనిచేస్తున్న నాన్-రిన్యూవబుల్ పవర్ జనరేటర్లు – తాము గోడావన్ నివాసంలో అతిథులమనే భావనతో కార్యకలాపాలు నిర్వహించాలని కోర్టు వ్యాఖ్యానించింది.
గత ఆదేశాలు – తాజా నిర్ణయాలు
2019లో పర్యావరణవేత్త ఎమ్‌కే రంజిత్‌సింహ్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.
2021లో సుప్రీంకోర్టు రాజస్థాన్, గుజరాత్‌లో సుమారు 99,000 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఓవర్‌హెడ్ ట్రాన్స్‌మిషన్ లైన్లపై ఆంక్షలు విధించింది. అయితే భారత్ రిన్యూవబుల్ ఎనర్జీ లక్ష్యాలపై ప్రభావం పడుతుందని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేయడంతో, 2024 మార్చిలో ఆ ఆదేశాలను సవరించింది.
నిపుణుల కమిటీ సిఫార్సులను అంగీకరిస్తూ, కోర్టు రాజస్థాన్‌లో 14,013 చదరపు కిలోమీటర్లు, గుజరాత్‌లో 740 చదరపు కిలోమీటర్లను ప్రాధాన్య సంరక్షణ ప్రాంతాలుగా ఖరారు చేసింది.
కఠిన ఆంక్షలు
ఈ ప్రాంతాల్లో:
• కొత్త విండ్ టర్బైన్‌లు అనుమతి లేదు
• 2 మెగావాట్లకు మించి సామర్థ్యం గల కొత్త సోలార్ పార్కులు నిషేధం
• ఇప్పటికే ఉన్న సోలార్ పార్కుల విస్తరణకు అనుమతి లేదు
• 11 కేవీకి మించిన ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్లు నిషేధం (నిర్దిష్ట పవర్ కారిడార్లు తప్ప)
