
కార్తీక దీపోత్సవం కన్నుల పండుగగా నిర్వహించాలి: మంత్రి కొండా సురేఖ
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో కార్తీక దీపోత్సవాన్ని కన్నుల పండుగగా, అత్యంత వైభవంగా నిర్వహించాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కార్తీక దీపోత్సవం నిర్వహణపై ఎండోమెంట్ ఉన్నతాధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ దీపోత్సవాన్ని నవంబరు 19, 2025 వరకు కార్తీక మాసం ఉండనున్న నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రతి దేవాలయాన్ని దీపాలతో అలంకరించాలని మంత్రి అధికారులకు తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల కార్యనిర్వహణాధికారులు (ఈవోలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.
శుభప్రదంగా సామూహిక దీపోత్సవం
కార్తీక మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైనదని మంత్రి కొండా సురేఖ గుర్తు చేశారు. ఈ మాసంలో దీపాలను వెలిగించడం అత్యంత శుభప్రదమని పేర్కొన్నారు. సామూహిక కార్తీక దీపోత్సవం అంటే భక్తులందరూ కలిసి దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తి భావంతో పూజలు చేయాలని ఆమె సూచించారు.గతంలో మాదిరిగానే ఈ సంవత్సరం కూడా దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి దేవాదాయ శాఖ చేపట్టిన ఏర్పాట్లను అధికారులు మంత్రికి వివరించారు.
నిర్వహణ సమయం ప్రతిరోజూ సాయంత్రం 6:00 గంటల నుండి సామూహిక కార్తీక దీపోత్సవం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో పాల్గొనే మహిళా భక్తులకు దేవాదాయ శాఖ తరపున మట్టి ప్రమిదలు, వత్తులు, నూనెతో పాటు పసుపు, కుంకుమ, తాంబూలాలను అందజేయనున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని దేవాలయాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ముఖ్యంగా రద్దీ ప్రాంతాల్లో భద్రతా చర్యలు పటిష్టం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో కార్తీక దీపోత్సవం విజయవంతం కావడానికి దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలని కోరారు. ఈ పవిత్ర మాసంలో భక్తులందరూ ఉత్సవాల్లో పాల్గొని, దైవ కృపకు పాత్రులు కావాలని ఆమె ఆకాంక్షించారు. సమావేశంలో ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, డైరెక్టర్ హరీష్, అడిషనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు.
