Let's talk: editor@tmv.in
కార్తీకమాసం శోభతో- నాగులచవితి వైభవం

కార్తీకమాసం శోభతో- నాగులచవితి వైభవం

Dantu Vijaya Lakshmi Prasanna
25 అక్టోబర్, 2025

మన పల్లెల్లో తెల్లవారగానే మట్టి వాసన, తల్లి చేతులలో పసుపు కుంకుమ సువాసన, ముంగిలిలో ముత్యాలముగ్గులు ఇవన్నీ చూస్తే మన హృదయం భక్తితో నిండిపోతుంది. మరి ఇలాంటి కార్తీకమాసంలో ప్రకృతితో మమేకమయ్యే పండుగ నాగులచవితి. నాగులచవితి అంటే కేవలం పాముల పూజ కాదు ఇది ప్రకృతిని గౌరవించే మన సంస్కృతి ప్రతిబింబం. నాగదేవత అంటే భూమాత హృదయంలోని జీవశక్తి. ఆ శక్తిని గౌరవించడం ద్వారా మన జీవితం పచ్చగా, సుఖంగా ఉంటుందని మన పూర్వులు మనకు నేర్పారు.

కార్తీకమాసం లో శివ కేశవులతో పాటు కార్తీకేయుడిని కూడా పూజిస్తారు. కార్తీకేయుడు అంటే సుబ్రమణ్యస్వామి. నాగదేవునిగా కూడా సుబ్రహ్మణ్యేశ్వరప్రతీతి. నాగులచవితి హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగలలో ఒకటి. ప్రతి ఏటా కార్తీక శుద్ధ చవితి నాడు నాగుల చవితిని జరుపుకుంటాము

ఈ పండుగ ప్రధానంగా నాగదేవతలను పూజించడం, వారి ఆశీర్వాదం పొందడం కోసం జరుపుకుంటారు. ఇది సాధారణంగా కార్తీకమాసం లో వస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో విస్తృతంగా జరుపుకుంటారు. (ప్రాంతానుసారం కొంచెం తేడా ఉంటుంది). తెలంగాణా ప్రాంతంలో అయితే ప్రత్యేకంగా శ్రావణమాసంలో వచ్చే నాగుల పంచమిని భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. నాగులచవితి రోజున మహిళలు చేతుల మీద పసుపు ,కుంకుమలు తో నాగదేవతలను ప్రార్థించేటప్పుడు, వారి కన్నుల్లో భయం కాదు నమ్మకం, ప్రేమ, కృతజ్ఞత కనిపిస్తాయి. .“పాములు కాటేస్తాయేమో ” అన్న భయం కన్నా “ప్రకృతిని కాపాడాలి” అన్న ప్రేమే ఈ పండుగ సారాంశం.

నాగులచవితి ఆవిర్భావం

హిందూ పురాణాల ప్రకారం, నాగులు అంటే పాములు ఆది శేషుడు, వాసుకి, తక్షకుడు, కర్కోటకుడు, పింగళుడు వంటి ఐదు ప్రధాన నాగులు. వీరు భూమి లోపలి లోకంలో నివసిస్తూ, భూభారం మోసే బాధ్యత వహిస్తారని విశ్వసిస్తారు.

పురాణ కథనం ప్రకారం

ఒకసారి జనమేజయుడు అనే రాజు తన తండ్రిని చంపిన పాము “తక్షకుడు”ను నశింపజేయడానికి సర్పయాగం చేశాడు. ఆ సమయంలో నాగులన్నీ యజ్ఞ గుండంలో పడి మరణిస్తుంటే,కొన్ని నాగులు బ్రహ్మదేవుణ్ణి శరణువేడగా బ్రహ్మదేవుడు వాటికి అభయమిచ్చి, మనుషులు నాగులను కోపపెట్టకూడదని, వాటిని పూజించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. ఆ నాటి నుంచే నాగుల పూజకు ప్రాముఖ్యత ఏర్పడింది అని నమ్ముతారు.

నాగులచవితి ఓ పౌరాణిక కథ

పూర్వకాలంలో ఒక గ్రామంలో ఓ బ్రాహ్మణ కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో వారికి ఏడుగురు కొడుకులు, ఒక చెల్లెలు ఉండేవారు. ఆ చెల్లెలు చాలా భక్తి పరురాలు, ప్రతి ఏడాది నాగులచవితి రోజున నాగదేవతల పూజ చేసేది. ఒక సంవత్సరం ఆమె వివాహం అయ్యి తన అత్తింటికి వెళ్లింది. అక్కడ నాగులచవితి రోజున ఆమె పూజ చేసేందుకు సిద్ధమయ్యింది. కానీ ఆమె అత్తగారు నవ్వుతూ, ఇంటి పనులు చాలానే ఉన్నాయి, ఈ పాముల పూజలకు సమయం వృధా చేయకు అని నిర్లక్ష్యంగా మాట్లాడారు. అయినా ఆ అమ్మాయి తన మనసులో నాగదేవతలను ప్రార్థించింది.

ఆ రాత్రి ఆమె కలలో వాసుకి (పాము ) దర్శనమిచ్చి, “నీ భక్తి నన్ను సంతోషపరిచింది. కానీ నీ అత్తగారి నిర్లక్ష్యానికి ఫలితం తొందరలో వస్తుంది” అని అన్నాడు. మరుసటి రోజు ఆ ఇంటి పెద్ద కొడుకు పాముకాటు తగిలి మరణించాడు. కుటుంబం భయంతో తల్లడిల్లిపోయింది. ఆ తర్వాత అందరూ కలసి నాగదేవతలను క్షమాపణ కోరారు. పూజ చేసి నైవేద్యం అర్పించారు. వారి భక్తికి ప్రసన్నమైన నాగదేవతలు వారిని కాపాడి, ఆరోగ్యం, ఐశ్వర్యం ప్రసాదించారట. ఆ రోజు నుంచే ప్రతి ఇంట్లో నాగదేవతలకు పూజ చేయడం ఆచారంగా మారింది. అని ఒక కథ వాడుకలో వుంది.

ఆచారం

నాగులచవితి రోజున తెల్లవారగానే స్నానం చేసి, ఇంటి తలుపు ముందు నాగదేవతల చిత్రాలు వేస్తారు లేదా మట్టితో చేసిన విగ్రహాలు చేస్తారు. పసుపు, కుంకుమ, పాలు, పిండివంటలు, పూలు సమర్పించి నాగదేవతలకు ప్రార్థన చేస్తారు. కొన్ని చోట్ల మహిళలు, పురుషులు కూడా ఉపవాసం ఉంటారు. పాలు, పండ్లు, తేలికైన పదార్థాలు మాత్రమే తీసుకుంటారు. పాములను పూజించడం అంటే ప్రకృతిని, జీవాన్ని గౌరవించడం బావిస్తారు. నాగులచవితి కేవలం ఒక పండుగ కాదు, అది మన హృదయాలను ప్రకృతితో కలిపే ఆధ్యాత్మిక సేతువులాంటిది. పసుపు కుంకుమతో అలంకరించిన నాగదేవతల ముందు పిల్లలు పెద్ధలు అందరూ చేతులు జోడించి ప్రార్థించే ఆ క్షణం భక్తి, ఆశ, ప్రేమ అన్నీ ఒకటై మనసును పరవశింపజేస్తాయి. పాములు మనకు అపాయమని కాదు, అవి ప్రకృతిని కాపాడే చిహ్నమని ఈ పండుగ మనకు గుర్తు చేస్తుంది. నాగదేవతలను పూజించడం అంటే ప్రకృతి తల్లి హృదయాన్ని పూజించడం.

రైతులకు ప్రత్యేకం

శీతాకాలంలో పాములు గుంటల నుండి బయటకు వస్తూ ఉంటాయి. దీనితో పంటలు నాశనం చేసే ఎలుకలను అవి తింటాయి. అలాగే హానికరమైన సూక్ష్మజీవులను కూడా పాములు చంపుతాయి. నేలను సారవంతం చేస్తాయి. ఇలా పాములు రైతులకు సహాయం చేయడంతో వాటికి కృతజ్ఞతను చెప్పడానికి నాగుల చవితిని జరుపుతారు.

పూజా విధానం

నాగుల చవితి నాడు చదువుకోవాలసిన శ్లోకాలు

• *ఓం భుజంగేశాయ విద్మహే సర్పరాజాయ ధీమహి తన్నో ముక్తి నాగః ప్రచోదయాత్.

• *సర్వే నాగాః ప్రియన్తాం మే యే కేచిత్ పృథ్వీతలే.. విషాణి తస్య నశ్యంతి నటాం హింసంతి పన్నగాః న తేషా సర్పతో వీర భయం భవతి కుత్రచిత్..*

నాగదేవతను భూమాత పుత్రుడిగా భావిస్తారు. కొందరు మానసాదేవి గా కూడా పూజిస్తారు. పంటల రక్షణ, వర్షాలు సమృద్ధిగా కురవడం, కుటుంబ రక్షణ కోసం నాగపూజలు చేస్తారు. నాగదేవత శివుడి సంకేతం కూడా కాబట్టి శివాలయాలలో నాగశిల్పాలు ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లో నిజమైన నాగులకు (పాములకు) పాలు పోసి పూజ చేసే సంప్రదాయమూ ఉంది.

పల్లెలలో పుట్టలు వున్న ప్రదేశానికి (పొలాల్లోకి) వెళ్ళి పుట్ట వున్న ప్రదేశాన్ని శుభ్రం చేసి పుట్టపై పసుపు నీళ్లు చల్లి వరిపిండితో ముగ్గులు వేసి ,మట్టి ప్రమీదతో దీపం పెట్టి ,దూపం వేసి పువ్వులతో పుట్టకి అలంకరణ చేసి పాలు, పండ్లు ,గుడ్లు నైవేద్యంగా సమర్పిస్తారు. మట్టిలో నుండి తవ్వి తీసిన తేగ ,బుర్రగుజ్జు వంటి వాటితోపాటు,కడుపు చలువ అని చలిమిడి ,వడపప్పు, బెల్లం, నువ్వుపప్పుతోచేసిన ప్రసాదం పుట్టలోవేస్తారు. పిల్లు పెద్ధలు అత్యంత భక్తి పారవశ్యంతో పూజలు చేస్తారు. పుట్ట సమీపంలో టపాసులు కాలుస్తూ సందడి చేస్తారు. పట్టణాలలో అయితే దగ్గరలో వున్న నాగదేవత గుడికో లేదా ప్రతీ గుడిలో వుండే నాగ శిల్పాల దగ్గరకో వెళ్ళి భక్తితో పూజలు చేస్తారు.

మన పూర్వులు చెబుతున్న సత్యం - “ప్రకృతిని గౌరవించు, జీవాన్ని ప్రేమించు.”

నాగులచవితి రోజున మహిళలు, ముఖ్యంగా వివాహిత స్త్రీలుఉపవాసం ఉంటారు. పాములను గౌరవంగా పూజించడం ద్వారా కుటుంబానికి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతానం కలుగుతుందని

నమ్మకం. సంతానం లేని వారు అయితే నాగదోషం నివారణ కోసం ప్రత్యేక పూజలు చేస్తారు.

ఆహార నియమాలు

ఈ రోజున సాధారణంగా చేదు, కారం, పులుపు, నూనె పదార్థాలు తినరు. కేవలం ఉపవాస భోజనం పప్పు అన్నం , పాలు, పండ్లు, పచ్చి బెల్లం వంటివి తీసుకుంటారు. సాయంత్రం పూజ అనంతరం తేలికైన శాకాహార భోజనం చేస్తారు.

నాగులచవితి పండుగ వెనుక ఆధ్యాత్మిక భావం

ఈ పండుగ వెనుక ఉన్న అర్థం కేవలం పాముల పూజ మాత్రమే కాదు. ఇది ప్రకృతిని గౌరవించడం, ప్రాణుల సహజ సమతౌల్యాన్ని కాపాడడం అనే సందేశాన్ని ఇస్తుంది. పాములు భూమిలోని జీవవైవిధ్యాన్ని కాపాడడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వాటిని నాశనం చేయకూడదని, భయపడకుండా గౌరవించాలనే ఆధ్యాత్మిక బోధ ఇది.

సామాజిక ప్రాముఖ్యత

నాగులచవితి సందర్భంగా గ్రామాల్లో, పట్టణాల్లో నాగగుళ్లు (సర్పాల స్థలాలు) శుభ్రపరచి అలంకరిస్తారు. ప్రజలు సమూహంగా పూజలు చేసి, కుటుంబ శ్రేయస్సు, పంటల పరిరక్షణ కోసం ప్రార్థిస్తారు. రైతులు ఈ రోజున పొలాల్లో పనులు చేయరు. భూమాత, నాగదేవతల విశ్రాంతి దినంగా పరిగణిస్తారు.

నాగుల చవితి సందర్భంగా తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ లో నాగదేవత ఆరాధనకు ప్రసిద్ధి గాంచిన ప్రదేశాలు కొన్ని తెలుసుకుందాం ..

నాగదేవత లేదా నాగేంద్రుడు అనే పాము దేవుడిని పూజించడం శతాబ్దాల నాటి ఆచారం. ప్రధానంగా నాగుల చవితి, నాగపంచమి,శ్రావణ మాసం వంటి సందర్భాల్లో ఈ ఆలయాలకు భక్తులు విపరీతంగా వస్తారు.

కొన్ని ప్రసిద్ధ నాగదేవత ఆలయాలు

తెలంగాణ రాష్ట్రంలోని నాగదేవత ఆలయాలు

• నాగులకొండ నాగదేవాలయం -నాగర్‌కర్నూల్ జిల్లా, పాత నాగ శిల్పాలు, పురాతన నాగలింగాలు ఇక్కడ దర్శనీయాలు.

• నాగులపల్లి నాగదేవాలయం - నల్గొండ జిల్లా, ఇక్కడ నాగుల చవితి రోజున ప్రత్యేక పూజలు, పాల అభషేకాలు చేస్తారు.

• నాగేశ్వర ఆలయం - హైదరాబాద్ (ఓల్డ్ సిటీ), నగర మధ్యలో ఉన్న పాత నాగదేవాలయం, శివపార్వతీ సమేత నాగేశ్వరుని పూజలు జరుగుతాయి.

• చింతలూరు నాగదేవత గుడి - సిద్దిపేట జిల్లా, ప్రజలు గ్రామ దేవతగా నాగదేవతను భావించి ప్రతి సంవత్సరం పల్లె జాతర నిర్వహిస్తారు.

• నాగదేవత గుడి - తిరుమలగిరి. ,సికింద్రాబాద్ ,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నాగదేవత ఆలయాలు

• మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం - కృష్ణా జిల్లా, నాగరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు ప్రసిద్ధి. పాములు ఇక్కడ పవిత్రంగా పరిగణించబడతాయి.సంతానమకోశం,నాగ దోష నివారణ కోసం భక్తులు ప్రత్యేక పూజలు జరుపుతారు.

• శ్రీకాళహస్తి నాగలింగేశ్వర స్వామి ఆలయం - తిరుపతి సమీపంలో ఉంటుంది.శివాలయంలో నాగ రూప శిల్పాలు ప్రత్యేకంగా ఉంటాయి,ఇక్కడ నిరంతరం నాగ దోష నివారణ పూజలు, రాహు,కేతు, పూజలు నిర్వహిస్తారు.

• నాగులపల్లి నాగదేవాలయం - గుంటూరు జిల్లా, గ్రామ దేవతగా నాగదేవతను పూజించే ఈ ఆలయం ప్రాచీనమైనది.

• పెద్దవూర నాగదేవత గుడి - ప్రకాశం జిల్లా, ఇక్కడ నాగపూజలు, సర్పబంధ విమోచన పూజలు ప్రసిద్ధం.

నాగులచవితి పూజ భయం కాదు, భక్తి యొక్క ప్రతీక. నాగులు కేవలం పాములు కాదు, ప్రకృతి యొక్క రక్షకులు. ఈ పండుగ జీవజాల సమతౌల్యానికి మన సమర్పణ. ఇది మనిషి మరియు ప్రకృతి మధ్య ఉన్న బంధాన్ని పునరుద్ధరించే పవిత్రదినం. నాగదేవతల ఆశీర్వాదం మన అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ప్రసరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.