
కార్తీకమాసం పరమ పవిత్రం
భారతీయ సాంప్రదాయంలో పవిత్రమైన నెలల్లో కార్తీక మాసం ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ఈ నెలలో భక్తులు ఉపవాసాలు, దీపారాధనలు, దానధర్మాలు, గోపూజలు నదీ స్నానాలు చేస్తూ భగవంతుని కృపను పొందాలని ప్రయత్నిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసం అంటేనే ఆధ్యాత్మికతకు, భక్తిబావానికి, పుణ్య కార్యక్రమాలకు నెలవు. ఈ కార్తీకమాసం మొదలవ్వగానే భక్తులు తెల్లవారుజామునే లేచి గంగ, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. ఈ ఆచారం కార్తీక స్నానం అని పిలుస్తారు. పండితుల మాటల్లో, ఈ స్నానం వలన మనిషికి సకల శుభాలు, పాప విమోచనం కలుగుతాయి.
కార్తీకమాసం మన హృదయాలలో భక్తి వెలుగులు వెలిగించే పవిత్ర సమయం. ఈ మాసం వస్తే గాలి భక్తిరసంతో నిండిపోతుంది. ఉదయాన్నేనదీ తీరాలలో స్నానం చేసి దేవాలయాల వైపు బయలుదేరే జనాలు, గృహాల ముందు వెలిగే దీపాలు, గోపూరాల వద్ద మోగే గంటలు అన్నీ ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ మాసంలో ప్రతి దీపం ఒక ప్రార్థన, ప్రతి జపం ఒక ఆత్మశాంతి మార్గం. శివుడు, విష్ణువు, తులసి దేవి అనుగ్రహం పొందటానికి ఇది అత్యంత శుభకాలం అని పురాణాలు చెబుతాయి. మన మనసును శాంతింపజేసి, జీవితాన్ని వెలుగుల దిశగా నడిపించే ఈ కార్తీకమాసం నిజంగా ఒక భక్తి యాత్రలా మారుతుంది.మరి అలాంటి కార్తీకమాసం గురించిన మరిన్ని విశేషాలు తెలుసుకుందాం …
కీటాః పతంగ౦గ మశకాశ్చ వృక్షాః| జలేస్థలే యే నివసంతి జీవాః| దృష్టివా ప్రదీపం న చ జన్మ భాగినః| భవంతిత్వం శ్వపచాహి విప్రాః||
ఈ శ్లోకం చదువుతూ కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే పుణ్యం లభిస్తుంది.
“కార్తీకే మాసి దేవేషు దీపదానం విశేషతః।
తులస్యా నమసా యుక్తం సకలమ్భక్తి వర్ధనం॥”
అర్దం: *కార్తీకమాసంలో దేవతలకు దీపారాధన చేయడం అత్యంత పుణ్యమయమైనది. తులసి దళాలతో సమర్పించిన నమస్కారం భక్తిని మరింతగా పెంచుతుంది
“కార్తీకమాసే యో భక్త్యా దీపం యో నిత్యం ప్రదీపయేత్।
తస్య పుణ్యం మహద్ దేవి న కర్తవ్యం పునర్భవం॥”
అర్థం: కార్తీకమాసంలో భక్తితో ప్రతి రోజూ దీపం వెలిగించే వారు పునర్జన్మలకు అతీతులవుతారు. ఆ పుణ్యం అపారమైనది అని అర్దం .
చల్లటి నీటితో పుణ్య స్నానం…
పురాణాల్లో కార్తీక మాసానికి సంబంధించిన అనేక విశేషాలు ప్రస్తావించారు. శ్రీ మహావిష్ణువు ఈ కాలంలో చెరువులు, బావులు, కాలువలలో నివసిస్తారని విశ్వాసం. అందువల్ల ఈ సమయంలో ఆ నీటిలో స్నానం చేయడం ద్వారా మహావిష్ణువు కటాక్షం లభిస్తుందని భావిస్తారు. ఈ స్నానం గత జన్మలో చేసిన పాపాలను నివారించి, పుణ్యాన్ని ప్రసాదిస్తుందనే నమ్మకం విస్తృతంగా ఉంది.
సాధారణంగా భక్తులు ఈ మాసంలో ప్రతిరోజూ నదీ స్నానం చేయాలని ప్రయత్నిస్తారు. కానీ ఎవరైనా నది వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉంటే, వారు ఇంటిలోనే సూర్యోదయానికి ముందే లేచి చల్లటి నీటితో స్నానం చేస్తారు. ఈ స్నానం ముందు యమున, గోదావరి, నర్మద, కృష్ణ, కావేరి వంటి నదులను మనసులో ఆహ్వానించి స్నానం చేస్తే, అదే పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా ఇంటి వద్దే కార్తీక స్నానం చేసినా దాని ఫలితం తగ్గదని నమ్మకం ఉంది. కార్తీక మాసంలో స్నానం చేయడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. చల్లటి నీటితో స్నానం చేయడం ద్వారా శరీర రక్తప్రసరణ మెరుగుపడుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతేకాదు, శరీరాన్ని శీతాకాలానికి అనుకూలంగా మలచుకోవడంలో కూడా ఇది సహాయపడుతుంది. వైద్యపరంగా కూడా ఈ ఆచారం శరీరానికి శ్రేయస్కరం అని నిపుణులు సూచిస్తున్నారు.
భక్తి భావాన్ని పెంచి…
చల్లటి నీటితో స్నానం చేయడం మనసును ప్రశాంతం చేస్తుంది. ఇది భక్తి భావాన్ని పెంచి మనలో ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తుంది. పండితులు చెబుతున్నట్లుగా, కార్తీక మాసంలో స్నానం చేసినవారికి భగవంతుని అనుగ్రహం, ఆరోగ్యం, సంతోషం లభిస్తాయని నమ్మకం. ముఖ్యంగా ఈ రోజు శివ, కేశవ పూజలు చేయడం ద్వారా పుణ్యం రెట్టింపు అవుతుందని భావిస్తారు
కార్తీకమాసంలో శివాభిషేకం చేయడం అత్యంత ముఖ్యమైనది, ఎందుకంటే ఇది శివుడికి ప్రీతికరమైన మాసం. శివునికి అభిషేకం చేయడానికి నీరు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి వంటివి ఉపయోగిస్తారు, ఒక్కొక్కటి ఒక్కో ఫలితాన్నిస్తాయి. అభిషేకం చేసేటప్పుడు "ఓం నమః శివాయ" వంటి మంత్రాలను జపించడం మంచిది.
కార్తీకమాసంలో శివాభిషేకం ప్రాముఖ్యత
శివుడు అభిషేక ప్రియుడు. బోళా శంకరుడు. నీటితో అభిషేకించినా కోటిజన్మల పుణ్యఫలం లాబిస్తుందని భక్తుల నమ్మకం. కార్తీకమాసంలో చేసే అభిషేకాలు, పూజలు, దానాలు విశేషమైన పుణ్యాన్ని ఇస్తాయి. అభిషేకానికి ఉపయోగించే ప్రతి పదార్థం ప్రత్యేక ఆశీర్వాదాలను అందిస్తుంది. ఉదాహరణకు, పాలు స్వచ్ఛతను, పెరుగు ఆరోగ్యాన్ని, నెయ్యి ఆధ్యాత్మిక వృద్ధిని ఇస్తాయని నమ్ముతారు. భక్తితో అభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడై కోరికలను తీరుస్తాడు.
• గరిక నీటితో అభిషేకం చేస్తే నష్టపోయిన డబ్బు తిరిగి పొందవచ్చు.
• పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరకు రసం వంటి వాటితో అభిషేకం చేస్తే ఇవి మనసులోని మాలిన్యాలను తొలగించి, అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి.
• అభిషేకం చేసే విధానం: శివలింగంపై నీటిని సన్నటి ధారగా పోయాలి. ఉద్ధరిణతో పంచపాత్రలో నుండి నీళ్ళు పోయకూడదు. అభిషేకం చేసేటప్పుడు "ఓం నమః శివాయ" వంటి మంత్రాలను జపించాలి. లింగాన్ని పూర్తిగా కప్పే వరకు నీటిని పోస్తూ, తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చెరకు రసం వంటివాటితో అభిషేకం చేయాలి. వీలైతే గురువుల ఆధ్వర్యంలో అభిషేకం చేయడం చాలా శ్రేష్ఠం.
సంధ్యా దీపం: కార్తీక మాసంలో సాయంత్రం వేళ దీపారాధన కూడా ఒక ప్రధాన ఆచారం. ఇల్లు, (గృహద్వారాల వద్ధ), దేవాలయం దీపాలతో ప్రకాశించే ఈ సమయం భక్తి భావాన్ని మరింతగా పెంచుతుంది. స్నానం చేసిన తర్వాత దీపారాధన, జపం, ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మిక తృప్తి పొందవచ్చు.
పురాణాపఠనం:
కార్తీకమాసంలో పురాణ పారాయణం చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాసంలో కార్తీక పురాణాన్ని లేదా ఇతర పురాణాలను పారాయణ చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ముఖ్యంగా ఈ మాసంలో శ్రీమహావిష్ణువుకి సంబంధించిన పురాణాలను లేదా శివ పురాణాన్ని పారాయణం చేయడం మంచిది, ఎందుకంటే కార్తీక మాసం హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం.
కార్తీక పురాణ పారాయణం యొక్క ప్రాముఖ్యత:
కార్తీకమాసంలో పురాణ పారాయణం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని నమ్మకం. హరిహరులకు ప్రీతికరమైన ఈ మాసంలో పురాణ పారాయణం చేయడం ద్వారా వారి శుభ అనుగ్రహం పొందవచ్చని వేదాలు, పురాణాలు చెబుతున్నాయి. రోజువారీ స్నానాలు, దీపారాధన, దానధర్మాలు వంటి నియమాలను పాటించడంతో పాటు, పురాణ పారాయణం కూడా ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
పురాణ పారాయణం చేసే విధానం:
ఈ కార్తీకమాసంలో* *కార్తీక పురాణం చేయడం అత్యంత శ్రేయస్కరం. అలాగే, ఇతర పురాణాలైన భాగవతం, శివ పురాణం వంటివి కూడా పారాయణం చేయవచ్చు. కార్తీకమాసంలోని ప్రతిరోజు పారాయణం చేయడం, ప్రత్యేకించి సోమవారం లేదా పౌర్ణమి వంటి రోజులలో చేయడం వల్ల అధిక పుణ్యం లభిస్తుంది. దేవాలయాలలో, ఇంట్లో లేదా మరేదైనా పవిత్ర స్థలంలో పారాయణం చేయవచ్చు.
పారాయణ చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు:
పురాణ పారాయణంతో పాటు కార్తీకమాస నియమాలను పాటించాలి. ఉదాహరణకు, తలస్నానం చేయడం, ఉపవాసం ఉండటం, దీపారాధన చేయడం, దానం చేయడం వంటివి. ప్రజలు పారాయణం చేసేటప్పుడు సామూహికంగా పారాయణాలు చేయడం, భజనలు, భక్తిగీతాలు ఆలపించడం కూడా ఈ మాసంలో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం. ఈ విధంగా కార్తీకమాసంలో పురాణ పారాయణం చేయడం వల్ల ఆధ్యాత్మిక, శారీరక, మానసిక భావన కలుగుతుంది.
సత్యం, సదాచారం, దానధర్మాలు, గోపూజాలు
ఈ మాసం అంతా సత్యం, సదాచారం, దానధర్మాలు పాటించడం కూడా ముఖ్యమని శాస్త్రాలు చెబుతున్నాయి. పాపాలు తొలగి మనసు ఆద్యాత్మికం వైపు మారలడానికి ఇది శ్రేయస్కరం. అందువల్ల చాలామంది కార్తీక మాసంలో శాకాహారం, ఉపవాసం, దేవాలయ దర్శనం, పఠనం వంటి ఆచారాలను పాటిస్తారు. భక్తులు ఈ కాలంలో ప్రత్యేకంగా శివాలయాలు, విష్ణు ఆలయాలను దర్శించి, ఆరాధనలు చేస్తారు. ఉదయాన్నే స్నానం చేసి దేవుని ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతమవుతుందని చెబుతారు. ఈ మాసంలో ప్రదోష వ్రతం, ఏకాదశి, పౌర్ణమి వంటి పూజల ప్రాధాన్యం కూడా అధికంగా ఉంటుంది.
కార్తీక పౌర్ణమి రోజున నది స్నానం చేసి దీపదానం చేయడం అత్యంత పుణ్యకరమైనదిగా పరిగణిస్తారు. పురాణాల్లో ఈ రోజున స్నానం చేసినవారు పాపాల నుండి విముక్తి పొంది, మోక్షాన్ని పొందుతారని పేర్కొనబడింది. ఈ కారణంగా ప్రతి సంవత్సరం కోట్లాది భక్తులు కార్తీక పౌర్ణమి నాడు నది తీరం వద్ద స్నానం చేస్తారు
గోపూజ విధానం:
స్నానాదులు అయ్యాక శుభ్రమైన దుస్తులు ధరించి, గోమాతను దేవాలయంలో లేదా ఇంట్లో పూజించవచ్చు. గోమాతకు ఆహారంగా పచ్చి గడ్డి లేదా బెల్లం, పొంగలి వంటివి సమర్పించాలి. గంధం, కుంకుమ, పూలు, అక్షతలతో అలంకరించాలి. దీపారాధన చేసి, ధూపం వేయాలి. గోపూజ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని నమ్మకం. కార్తీకమాసంలో గోపూజ చేయడం అనేది కేవలం ఒక ఆచారం కాదు, ఇది ప్రకృతి పట్ల గౌరవాన్ని, దేవుని పట్ల భక్తిని తెలియజేస్తుంది.
గోమాతను పూజిస్తూ, "గోమాత, శ్రీకృష్ణుడి రూపం" అని సంభావించి, ఈ మంత్రాన్ని పఠించవచ్చు:"*ఓం నమో భగవతే వాసుదేవాయ"
కార్తీక మాసంలో వన మహోత్సవం:
కార్తీక మాసంలో జరిగే వన మహోత్సవం లేదా వన భోజనం అనేది ఉసిరి చెట్టు నీడలో బంధుమిత్రులతో కలిసి ప్రకృతి ఒడిలో భోజనం చేసే ఒక సాంప్రదాయక వేడుక. ఇది ప్రకృతితో మనిషి బంధాన్ని గుర్తుచేస్తుంది. పర్యావరణ స్పృహను పెంపొందించేందుకు తోడ్పడుతుంది. ఈ సమయంలో, ప్రజలు ఉసిరి చెట్లను పూజించి, విష్ణువును ఆరాధించి, ఆ చెట్ల కిందే భోజనం చేస్తారు. ఇది కేవలం భోజనం మాత్రమే కాదు, స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ప్రకృతిని ఆస్వాదించే ఒక గొప్ప వేడుక.
ఉసిరి చెట్టు ప్రాధాన్యత:
కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల గొప్ప పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. విష్ణువు, లక్ష్మీదేవి ఉసిరి చెట్టులో కొలువై ఉంటారని భక్తులు భావిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రజలు ఉసిరి చెట్లకు పూజలు చేస్తారు, విష్ణు పురాణం, కార్తీక పురాణాన్ని పఠిస్తారు. పూజ చేసిన తర్వాత, వండిన ఆహారాన్ని అందరూ కలిసి ప్రసాదంగా భావించిన సహపంక్తి బోజనాలు చేస్తారు. పూర్వరోజుల్లో ఐతే మొత్తం గ్రామంలోని ప్రజలంతా ఈ వన మహోత్సవంలో పాల్గొనేవారు. ప్రస్తుత రోజుల్లో ఏదో ఒక వర్గం వారు, స్నేహితులు, కుటుంబ సభ్యులు, కార్యాలయ సిబ్బంది, ఇలా కార్తీక మాసంలో ఆదివారాలు లేదా ఇతర సెలవు దినాలలో ఈ వేడుకను ఎక్కువగా జరుపుకుంటారు.
క్షీరాబ్ధి ద్వాదశి
ఆషాడ మాస శుక్లపక్ష ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుక్ల ఏకాదశి నాడు(ఉత్థాన ఏకాదశి) మేల్కొంటాడని పురాణాలు వచనం. ఉత్థాన ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని బ్రహ్మతో కలసి తన ప్రియురాలైన తులసి ఉండే బృందావనంలోకి ద్వాదశి నాడు ప్రవేశిస్తాడు. కనుక కార్తీక శుద్ధ ద్వాదశీ రోజున క్షీరాబ్ధిశయన వ్రతాన్ని ఆచరించి తులసిని, విష్ణువునూ పూజించి దీపారాధన చేసినయెడల దీర్ఘసౌమంళిత్వం ప్రాప్తించి సుఖసంపదలు, ఐశ్వరం కలుగుతాయని స్మృతికౌస్తుభం పేర్కొన్నది. క్షీరాబ్ది ద్వాదశి కథ క్షీరసాగరమథనం ప్రారంభాన్ని సూచిస్తుంది, ఇది అమృతం కోసం దేవతలు , రాక్షసులు పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించిన రోజు. అందుకే దీనిని "చిలుకు ద్వాదశి" అని కూడా అంటారు.
కార్తీక మాసంలో శుక్లపక్షం ద్వాదశి తిధిని క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు. ఈ రోజు ఉదయం ఏకాదశి ఉపవాసం విరమించి సాయంత్రం ఇంట్లో తులసి మొక్కకు వివాహం జరిపిస్తారు. తులసి వివాహం హిందూ మతంలో ముఖ్యమైన పండుగ. ఈ రోజు సాలిగ్రామ స్వామితో (విష్ణువు స్వరూపం) తులసి వివాహాన్ని ఘనంగా జరిపిస్తారు. ఇంట్లో తులసి కళ్యాణం చేయడం వలన పెళ్ళికాని యువతులకు వివాహం జరుగుతుందని ఓ నమ్మకం. హిందూ మతంలో తులసిని పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. తులసి లక్ష్మీదేవి అవతారంగా భావిస్తారు. విష్ణువుకి తులసి అంటే చాలా ఇష్టం. కాబట్టి, తులసి , శాలిగ్రాముల వివాహం ఒక పవిత్రమైన ఆచారంగా పరిగణిస్తారు. తులసి కళ్యాణం జరిపించడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయని, పాపాలు నశిస్తాయనే నమ్మకం. తులసిని పూజించడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. తులసి వివాహం జరిపించిన అనంతరం ముత్తైదువులను పిలిచి వారికి తాంబూలం వాయనంగా అందించాలి. ఈ విధంగా క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి కల్యాణం జరిపించడం వలన శుభాలు కలుగుతాయని విశ్వాసం.
కార్తీకమాసం హరిహరులకు (విష్ణువు మరియు శివుడు) ఇరువురికీ ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో చేసే పుణ్యకార్యాలైన నదీస్నానాలు, దీపారాధనలు, వ్రతాలు, దానధర్మాలు, ఉపవాసాలు వంటివి అన్ని రకాల పాపాలను తొలగిస్తాయని విశ్వాసం. సూర్యుడు తులారాశిలో ఉండటం వల్ల ఈ మాసంలో చేసే మంచి పనులు ఎప్పటికీ అక్షయంగా ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. పుణ్యనదుల స్నానం: ఈ మాసంలో నదులలో స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు.
కార్తీక పూర్ణిమ
కార్తీక పౌర్ణమి అనేది శివునికి, విష్ణువుకు ఇద్దరికీ ప్రీతికరమైన పవిత్రమైన రోజు. ఈ రోజున చేసే పూజలు, దీపారాధనలు, పుణ్యస్నానాలు సకల పాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదిస్తాయి. ముఖ్యంగా తారకాసురుడిని సంహరించిన రోజు కావడంతో ఈ పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజున దీపం వెలిగిస్తే తెలిసీ తెలియక చేసే అన్ని పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ రోజున దేవతలందరూ భూమిపైకి వచ్చి భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తారని విశ్వసిస్తారు. శివుడు, విష్ణువు ఇద్దరికీ ఇష్టమైన మాసం కావడంతో, ఈ రోజున వీరిద్దరినీ ఆరాధించడం వల్ల శుభం కలుగుతుంది. శివాలయాల్లో రుద్రాభిషేకం చేయించుకుంటే సకల సంపదలు లభిస్తాయని నమ్మకం. పురాణాల ప్రకారం, మహాశివుడు తారకాసురుడిని సంహరించిన రోజు ఇదే. కార్తీక మాసం అంతా దీపాల వెలుగుల్ని కొనసాగిస్తూ, పౌర్ణమి రోజున ప్రత్యేకంగా దీపారాధన చేస్తారు
ఒక్కరోజైనా కార్తీక మాసంలో..
పండితులు చెబుతున్నట్లు, ఒక్కరోజైనా కార్తీక మాసంలో పుణ్య నదిలో స్నానం చేయడం ద్వారా అనేక జన్మాల పాపాలు తొలగుతాయి. సూర్యోదయానికి ముందు స్నానం చేసి, దేవుడిని ధ్యానం చేస్తే ఆ రోజంతా మనసు ప్రశాంతంగా, మన జీవితంలో శుభఫలితాలు కలుగుతాయని విశ్వాసం. అందుకే దీనికి అనుగుణంగా చివరి రోజున పోలి స్వర్గం కథ చెబుతారు. పోలి కార్తీకమాసం లో ఉసిరి చెట్టు కింద వెలిగి వున్న దీపాన్ని చూసినంతనే స్వర్గానికి చేరుకుందని, దీపం చూస్తేనే అంతా పుణ్యం లభిస్తే దీపం వెలిగిస్తే ఇంకెంత పుణ్యమో అని ఈ కథ సారాంశం.
“కార్తీకం వస్తే ఇంట్లో దీపం వెలిగించడమే కాదు. మనసులోనూ ఆద్యాత్మిక వెల్లివిరియాలి. “
