Let's talk: editor@tmv.in
కార్తీకమాసం- దీపాల కాంతిలో దివ్యభక్తి పరవశం

కార్తీకమాసం- దీపాల కాంతిలో దివ్యభక్తి పరవశం

Dantu Vijaya Lakshmi Prasanna
7 అక్టోబర్, 2025

భారతీయ సంప్రదాయంలో కార్తీకమాసానికి ఉన్న స్థానం అపారమైనది. దీపావళి ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే ఈ పవిత్రమాసం సర్వమానవాళికి ఆధ్యాత్మిక శాంతి, పుణ్యఫలం అందిస్తుంది. ఈ నెలలో భూమి అంతా దీపాల కాంతితో ప్రకాశిస్తుంది. ఇళ్లు, దేవాలయాలు, నదీ తీరాలు అన్నీ భక్తి పరవశంలో తేలుతాయి. దీపావళి పండుగ ముగిసిన తరువాత ప్రారంభమయ్యే కార్తీకం, క్షీరసాగర మథనంతో సంబంధమున్న పుణ్యకాలం. ఆ సమయంలో లక్ష్మీదేవి జన్మించినందున దీపాల రూపంలో ఆమెను ఆరాధించడం ప్రారంభమైంది. అదే పరంపరగా ప్రతి సంవత్సరం ప్రజలు దీపాలను వెలిగించి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, శివుడి పూజలు చేస్తారు.రాముడు సీతాదేవితో అయోధ్యకు తిరిగి వచ్చిన రోజున వెలిగించిన దీపాలే నేటి దీపోత్సవానికి మూలమని పురాణాలు చెబుతున్నాయి.దీపావళి మొదలుకుని కార్తికమాసం చివరి వరకు భారతీయుల్లో విశేష భక్తి పూర్వక పూజలు, దీపారాధనలు, ఉపవాసాలు, లక్ష్మీదేవి పూజలు, హరిహరుల నామస్మరణలు జరుగుతాయి.

ఈ మాసంలో ప్రతీ చోటా, ప్రతీ నదీ పరీవాహక ప్రాంతాలలో ,సముద్ర తీరాలలో పండుగ వాతావరణం స్పష్టంగా కనిపిస్తుంది. నదీ ప్రాంగణంలో దీపాల వెలుగులతో సాగే , లక్ష్మీదేవి పూజ, శివారాధన, వైష్ణవారాధనలతో శ్రద్ధ, ఆనందం పరిపూర్ణంగా సాగే ఈ కార్యక్రమాల వెనుక ఒక లోతైన చరిత్ర, సంప్రదాయం దాగి ఉంది. దీపావళి పండుగను ఐదురోజులుగా జరుపుతారు. ధనత్రయోదశి, నరకచతుర్దశి, దీపావళి అమావాస్య రోజులను కలిపి మొదటి రెండు రోజులు బలిపాడ్యమి, యమద్వితీయతో కొనసాగిస్తారు. పురాణకథ ప్రకారం, దుర్వాస మహర్షి ఇంద్రుడికి ఇచ్చిన హారం కారణంగా ఆయన సర్వ సంపద కోల్పోయి శ్రీహరిని ప్రార్థించగా మహావిష్ణువు జ్యోతి వెలిగించి మహాలక్ష్మి స్వరూపంలో పూజించమని ఆజ్ఞాపించాడట. ఈ విధంగా దీపాలను వెలిగించి లక్ష్మీదేవిని పూజించే సంప్రదాయం ఏర్పడింది . దీపావళి అనంతరం ప్రారంభమయ్యే కార్తీక మాసం శివకేశవులకూ, కార్తికేయుడికీ ప్రత్యేకమైనది. ఈ మాసంలో చేసే స్నానాలు, దీపారాధన, ఉపవాస దీక్షలకు వేదపరమైన, ధార్మిక పుణ్యఫలం ఉంటుంది. భక్తులు సూర్యోదయం ముందు, సూర్యాస్తమయం తరువాతా తులసికోట వద్ద దీపాలను వెలిగిస్తూ పరమేశ్వరుడిని పూజిస్తారు, విష్ణుసహస్రనామ పఠనాలు చేస్తారు. కార్తీక సోమవారాల్లో శివారాధన, అభిషేకాలు విశేషంగా జరుగుతాయి

హరిహరులకు ప్రీతికరమైన పుణ్యకాలం

కార్తీకమాసం విష్ణుమూర్తి, శివుడికి సమానంగా ప్రీతికరమైన మాసంగా పేర్కొనబడింది. స్కందపురాణం ప్రకారం, ఈ నెలలో చేసే ప్రతీ పూజా కార్యమూ వంద రెట్లు పుణ్య ఫలాన్ని ఇస్తుందని భక్తుల నమ్మకం . ఉదయాన్నే నదీస్నానం చేసి తులసి కోట వద్ద దీపాలు వెలిగించడం భక్తులు తప్పనిసరిగా ఆచరిస్తారు. సాయంత్రం సూర్యాస్తమయానంతరం మరోసారి దీపారాధన చేస్తారు. ఈ మాసంలో ఉపవాసం, జపం, దానం, దైవదర్శనం అన్నీ ఆధ్యాత్మిక పర్వంగా జరుగుతాయి.

ఆచారాల వెనుక ఉన్న ఆరోగ్యరహస్యం

ఈ కాలంలో చలికాలం ప్రారంభమవుతుంది. శరీరంలో జీర్ణక్రియ మందగించే సమయం కావడంతో ఉపవాసం పాటించడం శాస్త్రపరమైనదే. తెల్లవారుజామున స్నానం చేయడం, దీపాల వెలుగులో ధ్యానం చేయడం మనసును ప్రశాంతం చేస్తుంది. ఇది శరీరానికీ, ఆత్మకూ ఆరోగ్యాన్ని అందించే ఆచారం.

దీపారాధన ఫలాలు

కార్తీకమాసంలో దీపారాధన అత్యంత ముఖ్యమైన ఆచారం. నువ్వుల నూనెతో దీపాలు వెలిగిస్తే ఆయురారోగ్యం పెరుగుతుంది. ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే లక్ష్మీప్రసాదం లభిస్తుంది. తులసి కోట వద్ద దీపం వెలిగించడం కుటుంబ శాంతి, ఐశ్వర్యానికి సంకేతం. ప్రతి సాయంత్రం వెలిగించే దీపం మనసులోని అజ్ఞానాన్ని తొలగిస్తుంది.

భక్తి, జ్ఞానం, ఆరోగ్యం మూడు మేళవించే మాసం

కార్తీకమాసం కేవలం పండుగ కాలం కాదు, జీవన విలువలను నేర్పే కాలం. దీపాల వెలుగు మనసులోని చీకటిని తొలగిస్తుంది. ఉపవాసం ద్వారా శరీరం శుద్ధమవుతుంది. దానం ద్వారా మనసు విశాలమవుతుంది. ధ్యానం ద్వారా మన ఆత్మలో శాంతి ప్రసరిస్తుంది.

కార్తీక మాసంలో **ప్రత్యేక రోజులు, పండుగలు

బలి పాడ్యమి: ఈరోజు బలి చక్రవర్తి స్మరణం ద్వారా కీర్తి, యశస్సు లభిస్తాయి.

భగినీహస్త భోజనం: సోదరీమణుల ఇళ్లకు వెళ్లి భోజనం చేసి కానుకలు సమర్పించడం ద్వారా వారికి సౌభాగ్యం, కుటుంబ ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది.

నాగుల చవితి: నాగ దేవత, సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని ఆరాధించడం ద్వారా కుజదోషం, రాహుకేతు దోషాలు తొలగుతాయి.వంశాభివృద్ధి కోసం నాగేంద్రుడిని నాగుల చవితి నాడు ఆరాధిస్తారు. ద్వాదశి నాడు తులసీకి (విష్ణు ప్రతిరూపం) కలిపి తులసీ కల్యాణం చేస్తారు. దీన్నే చిలుక ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని పిలుస్తారు

ఏకాదశి: శివ, విష్ణు పూజలు, సత్యనారాయణ వ్రతాలు, చాతుర్మాస్య వ్రతాలకు ప్రత్యేకమైన రోజుగా చెబుతారు. .

క్షీరాబ్ది ద్వాదశి: తులసికోట వద్ద ఉసిరి మొక్కను ఉంచి రెండిటికి కలిపి దీపారాధన చేస్తే ఏడాదంతా పూజలు చేసిన పుణ్యఫలం లభిస్తుంది.

కార్తీక పౌర్ణమి: శివారాధన, అభిషేకం, దీపారాధన, నదీస్నానం ద్వారా హరిహరుల అనుగ్రహం పొందుతారు.కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడిని ధ్యానించి, ఉపవాసం, దీపారాధన చేస్తే అన్ని శుభాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. ఉపవాసానికి, దీపారాధనకు, నదీస్నానం చేయడంలో శాస్త్రపరమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.360 రోజుల పుణ్యఫలం కోసం భక్తులు 360 వత్తులను కలిపి ఒకే దీపంలా వెలిగిస్తారు. సాయంత్రం చంద్రుణ్ణి అద్ధం లో చూస్తూ పూజలు చేస్తారు.

పోలి స్వర్గం:కార్తీకమాసం చివారిరోజును పోలి స్వర్గం అంటారు.

కార్తీక దీపారాధన మహిమ

పోలి అనే ఆమె ప్రాణాలతో స్వర్గానికి చేరుకున్నాక, ఆమెను అక్కడి దేవతలు అడిగారు.

“నీవు ఏమి పుణ్యం చేసావు? ఇంత భాగ్యం ఎలా లభించింది?”

అప్పుడు ఆమె ఇలా చెప్పింది. “నేను కేవలం తులసి చెట్టు కింద వెలిగిన కార్తీక దీపాన్ని చూసి భక్తితో నమస్కరించాను. అంతే నా జీవితం మారిపోయింది.” ఈ సంఘటన విన్న దేవతలందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు నారద మహర్షి స్వర్గానికి వచ్చి ఇలా అన్నారు.

“దీపాన్ని చూసినవారికి ఇంత పుణ్యం లభిస్తే, దీపాన్ని వెలిగించినవారికి ఆ పుణ్యం వంద రెట్లు ఉంటుంది. అందుకే ప్రతి జీవి కార్తీకమాసంలో దీపారాధన చేయాలి. అది స్వర్గమార్గానికి ద్వారం అవుతుందని అంటారు. ఇది ప్రతీ ఒక్కరూ కార్తీక మాసం చివరి రోజు చెప్పుకునే కధ .

కథలో అంతరార్థం

ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. కార్తీకమాసంలో ఒక్క దీపం వెలిగించినా, ఒక్క నదీ స్నానం చేసినా, ఒక్క సారి తులసి కోట వద్ద జపం చేసినా, అది మన ఆత్మకు విముక్తి ఇస్తుంది. ఇది కేవలం పుణ్యమాసం కాదు, పునీతమైన ఆత్మోద్వేగ మాసం.

భక్తుల విశ్వాసం

కార్తీక మాసంలో ప్రతిరోజూ చేసే స్నానాలు, దీపారాధన, ఉపవాసాలు చేస్తే మనశ్శాంతి, ఆరోగ్యం, సంపద, భక్తి అభివృద్ధికి దోహదపడతాయని పురాణాలు చెబుతున్నాయి.అలాగే భక్తితో కార్తీక పురాణాన్ని చదువుకుంటారు.పురాణ కాలక్షేపం మనస్సును ఆద్యాత్మికం వైపు నడిపిస్తుంది. అంతే కాదు దీపారాధన మరింత శక్తిని ప్రసాదిస్తుంది. ప్రత్యేకించి దీపారాధనలో నువ్వుల నూనె, ఆవు నెయ్యి వాడడం ద్వారా ఆయురారోగ్యం, లక్ష్మీ ప్రసాదం సాధ్యమవుతుందని శాస్త్రవచనం స్పష్టం చేస్తుంది. కార్తీకమాసం అనేది భక్తి, పుణ్యం, ఆరోగ్యం, దైవానుభూతి కలిసిన ఆధ్యాత్మిక పర్వం. దీపాన్ని వెలిగించడం కేవలం ఆచారం కాదు . అది జీవితం మీద వెలుగు ప్రసరించే మార్గం. ప్రతి ఒక్కరూ ఈ మాసంలో ఒక దీపం వెలిగించి, ఒక్క జపం చేసినా, ఆ కాంతి వారి జీవితాన్ని ధన్యంగా మారుస్తుంది.

కార్తీకమాసంలో **దర్శించాల్సిన **ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు

భారతదేశంలో అనేక ప్రదేశాలు కార్తీకమాసంతో ఆధ్యాత్త్మికంగా ముడిపడి ఉన్నాయి. ప్రతి ప్రదేశానికీ ప్రత్యేకత, పురాణ గాథ ఉంది.

వారాణసి (కాశీ):కార్తీకమాసంలో కాశీ నగరం దీపాలతో మునిగి పోతుంది. గంగాతీరం వద్ద జరిగే "దీపదానం" అద్భుత దృశ్యం. హరిహరుల పూజకు అత్యంత పవిత్రమైన స్థలంగా పరిగణించబడుతుంది.

తిరువన్నామలై (తమిళనాడు): కార్తీక పౌర్ణమి నాడు జరిగే "గిరిప్రదక్షిణ" ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి. అందుకే కార్తీక మాసంలో అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి లక్షలాది భక్తులు తరలివస్తారు.

పుష్కర్ (రాజస్థాన్):పుష్కర్ సరస్సు వద్ద జరిగే కార్తీక పౌర్ణమి స్నానం, బ్రహ్మదేవుని పూజ విశేష పుణ్యకార్యంగా పరిగణించబడుతుంది.

శ్రీశైలం (తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు):శ్రీ మల్లికార్జున స్వామి, భ్రమరాంబ దేవాలయంలో కార్తీక దీపోత్సవాలు ఘనంగా జరుగుతాయి. వేలాది దీపాలతో దేవాలయం ప్రకాశిస్తుంది.

కాశీపురం (వెల్లూరు జిల్లా): ఇక్కడ విష్ణుమూర్తి ఆలయంలో కార్తీకమాసంలో ప్రతి రోజు దీపారాధనలు, ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి.

యాదాద్రి, బాసర, వేములవాడ, వేంకటగిరి, కాళేశ్వరం తెలంగాణలో ఈ ఆలయాలు కార్తీకమాసంలో విశేష రద్దీతో కళకళలాడుతాయి.

తిరుమల, సింహాచలం, శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్‌లో విష్ణు, శివాలయాల ఈ త్రయం కార్తీక పౌర్ణమి వేళ ఆధ్యాత్మిక జ్యోతులతో నిండిపోతాయి.

ఈ పుణ్యక్షేత్రాల్లో నదీస్నానం, దీపదానం, జపం చేస్తే జన్మాంతర పాపాలు నశిస్తాయని భక్తులు నమ్ముతారు.మరి రాబోయే కార్తీకమాసాన్ని మరింత భక్తి శ్రద్ధలతో జరుపుకుందాం .

కార్తీకమాసం- దీపాల కాంతిలో దివ్యభక్తి పరవశం - Tholi Paluku