
కార్తీకమాసంలో పంచారామాల దర్శనం
కార్తీకమాసoలో దీపాల వెలుగులు మన హృదయాలలో ఒక ఆద్యాత్మిక భావన కలిగిస్తాయి.ఈ మాసం లో ప్రతి సోమవారం, సాయంత్రం లక్షల దీపాలు వెలిగే తీర్థం ఒక దివ్య క్షేత్రం గా మారుతుంది. ఆ సమయంలో, ఉత్తరాంధ్ర లోని ఐదు శివాలయాలు (పంచారామ క్షేత్రాలు) మనకు ఒక ప్రత్యేక ఆహ్వానం పంపుతాయి: “రండి … దర్శనం చేసుకోండి . మనస్సు లో ఆద్యాత్మికతను పెంపొందించుకోండి” అని ..పంచారమాలలో ప్రతీ ఆలయం విభిన్నంగానే ఉంటాయి. రాత్రి వేళల్లో ఆలయం గోపురాలు ప్రకాశంలో మెరిసిపోతాయి. చీకటిలో వెలిగే దీపాల వెలుగు భక్తుల హృదయంలో నిశ్శబ్దం ముద్ర వేస్తుంది. ఆలయం లో భక్తుల కదలికలు, దీపాల వెలుగు … ఇవన్నీ కలిపి మంచి అనుభూతితో నిండిన యాత్రగా ఈ యాత్ర మారుతుంది.
“ఒక్క రోజు లో ఈ ఐదు ఆలయాలు” అనే సంకల్పం ఆధ్యాత్మిక తలపుల తెరుచుకుని మనల్ని పవిత్ర భక్తి భావనలో మునిగేలా చేస్తాయి. మరి ఆ పంచారామాల గురించి తెలుసుకుందాం.
శ్రీనాదుడు (క్రీ.శ. 14 నుండి 15వ శతాబ్డం) రచించిన భీమేశ్వర పురాణములో ఈ పంచారామాల ఉద్భవం గురించి ఒక కథ ఇలా ఉంది. క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్నిమహా విష్ణువు మోహినీ రూపం ధరించి సురాసురులకు పంచుతుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేతృత్వములో తీవ్రమైన జపతపాలను ఆచరించగా శివుడు వారి తపస్సుకు మెచ్చి, వారికి వరములిచ్చాడు. కొత్తగా సంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహాదేవుని శరణువేడుకున్నారు. దేవతల మొర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగం మాత్రం చెక్కుచెదరలేదు. దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛేదించి ఐదు వేరు వేరు ప్రదేశములందు ప్రతిష్ఠించుటకు ఇవ్వడం జరిగింది. లింగ ప్రతిష్ఠ చేసిన ఈ ఐదు ప్రదేశాలే పంచారామాలుగా ప్రసిద్ధికెక్కాయి.
స్కాంద పురాణంలోని తారాకాసుర వధ ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తోంది. హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుండా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ,వారు అతనిని గెలవలేకపొవటం జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ, పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యమని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.
*శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః
తారకాసురుడు నేలకూలడంతో అతని దగ్గరున్న ఆత్మలింగం ఐదు ఖండాలుగా మారింది. దేవతలు ఆ ఐదు లింగ శకలాలను ఐదు చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచారామ క్షేత్రాలు. అవి:
• భీమేశ్వరుడు- దక్షారామం (ద్రాక్షారామం, కోనసీమ జిల్లా)
• భీమేశ్వరుడు- కుమారరామం (సామర్లకోట, కాకినాడ జిల్లా)
• రామలింగేశ్వరుడు- క్షీరారామం (పాలకొల్లు, పశ్చిమ గోదావరి జిల్లా)
• సోమేశ్వరుడు- భీమారామం (భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా)
• అమరేశ్వరుడు- అమరారామం (అమరావతి, పల్నాడు జిల్లా)
ద్రాక్షారామం - భీమేశ్వరుడు
ద్రాక్షారామ భీమేశ్వరాలయం, కోనసీమ జిల్లా, రామచంద్రపురం మండలం, ద్రాక్షారామం గ్రామంలో, గోదావరి నది తూర్పు ఒడ్డున ఉంది. ఈ ఆలయం పంచారామాలలో ఒకటి. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ద్రాక్షారామం కాకినాడ నుండి 28 కిమీ, రాజమండ్రి నుండి 50 కిమీ, అమలాపురం నుండి 25 కిమీ దూరంలో ఉంది. ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామ అని వాడుకలో పిలుస్తారు. దీని అర్థం "ద్రాక్షారామం" అంటే దక్ష ప్రజాపతి నివాసం. దక్ష ప్రజాపతి శివుని మామ, 'సతి' పార్వతీ తండ్రి, శివుని ఆధ్యాత్మిక జీవిత భాగస్వామి. ఇది 'స్కంద పురాణం'లో వివరించబడింది. ద్రాక్షారామం ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా అంటారు.ఈ ఆలయం శివ పంచారామాలలో ఒకటి, 18 శక్తి పీఠాలలో ఒకటి. కనుక ఇది శివ క్షేత్రంగానూ, శక్తి క్షేత్రంగానూ ప్రసిద్ధి చెందింది.
క్షేత్ర ప్రాముఖ్యత
ఈ ప్రదేశం పేరు, ఈ ప్రదేశంలో శివుని ఉనికి గురించి ఆసక్తికరమైన పురాణంప్రకారం , తారకాసుర వధ సమయంలో, తారకాసురుని కంఠంలో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విరిగిపోయి, ఒక ముక్క ఇక్కడ పడిందని. ఆ తర్వాత దీనికి ద్రాక్షారామం అనే పేరు వచ్చిందని కథనం. ఒక మెట్ల మార్గం గర్భగుడి పై స్థాయికి చేరుకుంటుంది, ఇక్కడ భీమేశ్వర స్వామి పై భాగాన్ని చూడవచ్చు. ద్రాక్షారామంలోని శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. తెల్లవారుజామున లేత సూర్యకాంతి శివలింగంపై పడుతుంది. శివలింగం స్ఫటిక ఆకృతిలో ఉంటుంది. శివలింగం పైభాగంలో నల్లటి చారలు మనకు కనిపిస్తాయి. శివుడు అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు వేటగాడి వేషంలో ఉన్నప్పుడు ధరించిన పులి చర్మానికి సంబంధించిన గుర్తులని భక్తులు నమ్మకం.
మాణిక్యాంబా దేవి శక్తి పీఠం
ద్రాక్షారామ భీమేశ్వరాలయ ప్రాకారంలో ఈశాన్యంలో అష్టాదశ శక్తి పీఠాలలో 12వ శక్తిపీఠం **మాణిక్యాంబ ఆలయం** కొలువై ఉంది.
అలయ చరిత్ర: ఈ ఆలయాన్ని సాశ. 7, 8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసింది. తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా, మరొకటి శ్రీశైలం. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం ఒప్పారుతోంది.
శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న ప్రాకృతభాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటేరకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాధ కవి భీమపురాణం లో లో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు. తిట్టుకవిగా ప్రసిద్ధి నందిన వేములవాడ భీమకవి "ఘనుడన్ వేములవాడ వంశజుడ, ద్రాక్షారామ భీమేశునందనుడన్.... " అని చెప్పుకొన్నాడు.
శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, పంచారామాల్లో ఒకటిగా, దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి. అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు.
అష్ట లింగాలు
ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. వీటిని అష్టలింగములు లేదా అష్ట సోమేశ్వరములు అంటారు. తూర్పున కోలంక, పడమర వెంటూరు, 'దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దంగేరు. నైరుతిలో కోరుమిల్లి వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది.
ప్రత్వేక ఉత్సవాలు
ప్రతీ ఏకాదశీ పర్వదినములలో ఏకాంతసేవ, పవళింపుసేవ ఉంటాయి. ప్రతీ మాసశివరాత్రి పర్వదినములలో గ్రామోత్సవం జరుపుతారు. ప్రతీ కార్తీక పూర్ణిమతో కూడిన క్రృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం జరుగుతుంది. ప్రతీ మార్గశిర శుద్ధ చతుర్ధశి రోజున శ్రీ స్వామివార్ల జన్మ దినోత్సవం జరుపుతారు. ప్రతీ ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులు అయిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు విశిష్టంగా జరుగుతాయి. ప్రతీ మాఘశుద్ధ ఏకాదశీ ( భీష్మ ఏకాదశి ) రోజున శ్రీ స్వామి వారి, అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం జరుగుతుంది. ప్రతీ మహాశివరాత్రి పర్వదినాలలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. శరన్నవరాత్రులు (దేవీనవరాత్రులు) - ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు జరుగుతాయి
కార్తీకమాసం ప్రత్యేక ఉత్సవాలు, జ్వాలాతోరణం (కార్తీక పున్నమి నాడు) జరుగుతుంది. సుబ్రహ్మణ్యం షష్టి ఉత్సవం మార్గశిర శుద్ధ షష్ఠి నాడు
వసతి, అన్నదానం
యాత్రీకుల సౌకర్యార్ధం ఇచ్చట పైండా వారిచే నిర్మించబడిన ఆన్నదాన సత్రం ఉంది. దేవస్థానం వారి యాత్రికుల వసతి గృహం, ఆలయానికి 1/2 కి.మీ దూరంలో ఆర్.టి.సి బస్టాండుకు దగ్గర కోటిపల్లి రోడ్డులో ఉంది.
కుమారరామం - భీమేశ్వరుడు
కాకినాడ జిల్లా సామర్లకోట సమీపంలో కుమార భీమారామం క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామివారు కుమార భీమేశ్వరుడు తల్లి బాలా త్రిపుర సుందరి. ఈ క్షేత్రం ప్రశాంతంగా చుట్టూ పచ్చని పంటచేలతో ఉంటుంది. ఇక్కడ లింగం కూడా 14 అడుగుల ఎత్తున రెండస్తుల మండపంగా ఉంటుంది. దీనిని చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని క్షేత్ర కథనంలో వివరించబడింది. ఇది పూర్వం చాళుక్య భీమవరంగా ప్రసిధ్ధి చెందినట్టు భీమేశ్వరాలయంలోని శిలాశాసనాలనుబట్టి తెలుస్తోంది. ఈయనే దాక్షారామ దేవాలయాన్నీ నిర్మించింది. అందుకే ఈ రెండు గుళ్ళు ఒకే రీతిగా వుండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయి కూడా ఒకటేరకంగా, నిర్మాణ శైలికూడా ఒకే విధంగా వుంటుంది. ఈ మందిరం నిర్మాణం క్రీ.శ.892లో ప్రారంభమై సుమారు క్రీ.శ.922 వరకు సాగింది. దీనిని భారతదేశంలోని ప్రముఖ శైవ తీర్థాలైన పంచారామ క్షేత్రాలలో ఒకటిగా భావిస్తారు.
తారకాసురుడు తనదైన అజేయత కోసం శివుడి నుంచి ఆత్మలింగాన్నిపొందుతాడు. ఈ లింగాన్ని మెడలో వేసుకుంటాడు . దాన్ని కుమారస్వామి ఐదు భాగాలుగా విభజిస్తాడు.
ఆ భాగాలు వివిధ ప్రదేశాల్లో పడ్డాయి, అక్కడ ఐదు ఆలయాలు ఏర్పడ్డాయి. అనేదే కథ. ఈ ఆలయంలోని లింగాన్ని కుమారస్వామి స్వయంగా ప్రతిష్ఠ చేశారని కూడా చెప్పబడుతుంది, అందుకే పేరు “కుమారారామం”
నిర్మాణం, శిల్పకళ & ముఖ్యాంశాలు
ఈ ఆలయం చాళుక్య కాలంలో నిర్మించబడినది. ముఖ్యంగా చాళుక్య రాజు భీముని కాలంలో సుమారు 892–922 సంవత్సరాల మధ్య ఇది నిర్మించబడినది .ద్రవిడ శైలిలో నిర్మితమైంది. మండపాలు, గోపురాలు, ప్రక్క కట్టడాలు, ఇక్కడ ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఈ ఆలయంలోని శివలింగం పొడవైనదిగా ఉంది.ఆలయం పరిధిలో ప్రాకారం, ద్వారం, ఆవరణ గోడలు, పుష్కరిణి ఉన్నాయి.
ఆచారాలు, ఉత్సవాలు & అవగాహన
ప్రధాన ఉత్సవాలు:మహా శివరాత్రి , కార్తీక మాసం సమయంలో ప్రతిదిన అభిషేకాలు, ఇతర శివ-పూజాలు జరుగుతాయి. భక్తులు ఎక్కువగా కార్తీక మాసంలో, ఫల్గుణ మాసం లో కల్యాణ మహోత్సవం జరుగుతుంది. దర్శనం సమయం: ఉదయం 6-12 గం., సాయంత్రం 4-8 గం వరకు ఉంటుంది. ఈ ఆలయం పంచారామ క్షేత్రాలలో ఒకటిగా ఉండటంతో భక్తులు విశిష్ట ఆలయంగా భావిస్తారు. కుమారస్వామి చేత లింగం స్థాపించబడ్డదని చెప్పబడటం కారణంగా మరింత ప్రత్యేక కలిగివుంది. శిల్పకళ, స్తూపాలు, చరిత్రా శాసనాలు ఉన్నదీ, కేవలం భక్తి స్థలం కాదు, ఇతిహాస-కళా దార్శనికతా ప్రదేశముగా కూడా ఉంది. సామర్లకోట ప్రాంతానికి చెందిన ఈ ఆలయం, కాకినాడ నగరానికి సమీపంలో ఉండటం వల్ల భక్తులకి చేరుకోగలగడం సులభం.
ఆలయ నియమాలు: పాదరక్షలు తీసివేయడం, సంప్రదాయ బట్టలు ధరించడం మంచిది
క్షీరారామం - రామలింగేశ్వరుడు
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో క్షీరారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామి వారు రామలింగేశ్వర స్వామి, అమ్మ వారు పార్వతి. ఈ క్షేత్రంలో లింగాన్ని త్రేతా యుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్ధనుడు. ఆలయ విశేషం తొమ్మిది అంతస్తులతో 20 అడుగుల ఎత్తులో విరాజిల్లే రాజగోపురం. చివర అంతస్తు దాకా వెళ్లడానికి లోనికి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగం రెండున్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఏటా ఉత్తరాయణ దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో కిరణాలు పెద్దగోపురం నుండి శివలింగంపై పడతాయి.
ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణంలో ఉంది. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ శివుడు “క్షీర రామలింగేశ్వర స్వామి”గా పూజించబడతాడు
పురాణకథ & విశిష్టత
ఒక పురాణం ప్రకారం, ఈ స్థలంలో అతిరూపమైన, పాలవర్ణం (తెల్లని) లింగం ఉంది.ఆ కారణంగా “క్షీర రామo ” అనే పేరు వచ్చిందని సాంప్రదాయం ఉంది. ఒక విశ్వాసం ప్రకారం “ఒక రోజు ఇక్కడ ఉండటం వంద సంవత్సరాల పాటు కాశీ లో ఉండటానికి సమానం” అని అంటారు.అలాగే ఈ ఆలయం భారతదేశంలో కేంద్ర రక్షిత చిహ్నం గా వుంది. పురాతన స్మారక చిహ్నాలుగా నమోదైన వాటిలో ఒకటిగా దీనిని ప్రభుత్వం గుర్తించింది.
శిల్పకళ, నిర్మాణ లక్షణాలు
ఆలయం యొక్క గోపురం సుమారు 120 అడుగుల ఎత్తులో ఉంటుంది .ఈ దేవాలయం గోపురం 9 అంతస్తుల వుంది మండపాల్లో 72 పిల్లర్లు ఉన్నాయి. గర్భాలయంలో లింగం (మూలవిరాట్) పాక్షికంగా నాలుగు వైపులా చిన్నకిటికీల ద్వారా చూడగలదిగా వుంది.
ఆచారాలు, ఉత్సవాలు & దర్శన సమయాలు
ప్రధాన ఉత్సవాలలోమహా శివరాత్రి, ముఖ్యంగా పూజలు, రాత్రి విశేష కార్యక్రమాలు పలు వుంటాయి. దర్శనం సమయాలు ఉదయం 5:30 నుంచి 12:30 వరకు, సాయంకాలం 4:00 నుంచి 8:30 వరకు ఉంటాయి.
ఈ దేవాలయం ఒక విశిష్ట స్థలంగా కాదు. భక్తి, శిల్పకళ, పురాతత్వం అన్నిటినీ కలిపి ఉంది.
పాలవర్ణం లింగం ఉండడం, జీవనతత్వం ఉట్టిపడే ఆలయ పరిసరాలు, , అలాగే భక్తుల విశ్వాసం వల్ల అన్ని ఋతువులలో ఇక్కడి దర్శనం ప్రత్యేక భావోద్వేగాన్ని కలిగిస్తుంది.
పంచారామాలలో ఒకటిగా ఉండటం వల్ల ఆధ్యాత్మిక యాత్రలో ముఖ్యమైన గమ్యంగా భావించవచ్చు.ఈ దేవాలయ చరిత్రను చెప్పే అనేక శాసనాలు,ఆధారాలు అందుబాటులో ఉన్నాయి.
భీమారామం - సోమేశ్వరుడు
పశ్చిమ గోదావరి భీమవరం గునుపూడిలో సోమారామం క్షేత్రం ఉంది. ఇచ్చట స్వామివారు సోమేశ్వరుడు. అమ్మవారు ఉమాదేవి. ఈ దేవాలయాన్ని సోమేశ్వర జనార్ధనస్వామి ఆలయం అంటారు. తూర్పుచాళుక్య రాజైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్య రోజున గోధుమ వర్ణంలో మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యధారూపంలోకి వచ్చేస్తుంది. అందుకే దీనికి సోమారామం అనే పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోను అన్నపూర్ణా దేవి అమ్మవారు పైఅంతస్తులోనూ ఉంటారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్ధన స్వామి.
ఆలయ విశిష్టతలు*
తారకాసుర వధ సమయంలో అతని వద్ధ ఉన్న శివలింగం ఐదు భాగాలుగా విరిగిపోయి, ఆ భాగాలు పంచారామ క్షేత్రాలలో ప్రతిష్టించబడ్డాయి. భీమవరం ఆలయం ఆ ఐదు భాగాలలో ఒక భాగాన్ని కలిగి ఉంది. ప్రధాన దేవత శ్రీ సోమేశ్వర స్వామి, అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి
ముఖ్యంగా శివరాత్రి, శరన్నవరాత్రి,కార్తీకమాసం వంటి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శిల్పకళ & నిర్మాణం
ఆలయానికి తూర్పు ముఖంగా ఉన్న 7 అంతస్తుల రాజగోపురం. మూలస్థానానికి ఎదురుగా ఉన్న భారీ నంది వాహనం ఉంటాయి. ఆలయానికి తూర్పు వైపున ఉన్న సోమ గుండం (పుష్కరిణి) పుణ్యస్నానాలకు ప్రసిద్ధి. ఉదయం: 5:00 - 11:00 వరకు సాయంత్రం: 4:00 - 8:00 వరకు దర్శన వేళలు ఉంటాయి. దర్శనం ఉచితం, ప్రత్యేక పూజలకు చెల్లింపు ఉంటుంది. మహా శివరాత్రి, శరన్నవరాత్రి, కార్తీకమాసం వంటి ఉత్సవాల్లో పాల్గొనడం ద్వారా ప్రత్యేక అనుభూతులు పొందవచ్చు. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఆలయ సందర్శన శాంతియుత అనుభూతిని కలిగిస్తుంది. భీమవరం సోమరామం ఆలయం, శివభక్తులకు పవిత్ర స్థలంగా, పంచారామ క్షేత్రాలలో ఒక ముఖ్యమైన క్షేత్రంగా నిలుస్తోంది. ఆలయ దర్శనం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక శాంతిని పొందవచ్చు.
అమరారామం - అమరేశ్వరుడు
అమరావతి పట్టణంలోని శ్రీ అమరేశ్వర స్వామి దేవస్థానం పంచారామ క్షేత్రాలలో ఒకటి. ఇది పల్నాడు జిల్లాలో, కృష్ణానది తీరంలో ఉంది. ప్రధాన దేవుడు శ్రీ అమరేశ్వరుడు (శివుడు), దేవి బాలచముండికా అమ్మవారు. ఓ కథ ప్రకారం, తారకాసురుని వధ సమయంలో కార్తికేయుడు విరగగొట్టిన లింగం ఐదు ముక్కలుగా పడి ఏర్పడిన ఐదు పంచారామాలలో ఇది ఒకటి.
ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ప్రధాన లింగం 15 అడుగుల ఎత్తులో ఉంటుంది. పూజారులు వేదికపై నిలబడి అభిషేకం చేస్తారు. దేవాలయంలో వినాయకుడు, సుబ్రహ్మణ్యుడు, నవగ్రహాల గుళ్లు ఉన్నాయి. ఆలయంలో కీ .శ 1129 కాలానికి చెందిన శాసనాలు ఉన్నాయి.
ప్రధాన ఉత్సవాలు: మహాశివరాత్రి, కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి, నవరాత్రులు. కార్తీకమాసంలో దీపోత్సవాలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు.
గుంటూరు, విజయవాడల నుంచి రోడ్డు మార్గంలో సులభంగా చేరవచ్చు. ఆలయం ఉదయం 6–13 గం., సాయంత్రం 4–8 గం. తెరిచి ఉంటుంది. పాదరక్షలు తీసివేయడం, నది ఘాట్ల వద్ద స్నానం చేయడం వంటి ఆచారాలను పాటించడం ఇక్కడి ఆచారం. ఇది పంచారామాలలో ఒక ముఖ్య క్షేత్రం కావడంతో భక్తులు ఈ కార్తీక మాసంలో ఎక్కువగా విచ్చేస్తారు. కృష్ణా తీరంలోని ఆధ్యాత్మిక వాతావరణం ఈ దేవాలయానికి విశిష్టతను ఇస్తుంది.
అమరావతి క్షేత్రం లోని అమరేశ్వర స్వామి దేవాలయం గుంటూరుకు 35 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ నెలకొన్న శివలింగాన్ని ఇంద్రుడు నెలకొల్పడని ప్రసిద్ధి. ఇక్కడ శివుడు అమరేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.
రవాణా సదుపాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ,తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ యాత్రికులకు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. కార్తిక మాసం సందర్భంగా జిల్లాలో ఉన్న రామచంద్రపురం, అమలాపురం, రావులపాలెం, రాజోలు డిపోల నుంచి పంచారామా శైవ క్షేత్రాలకు ఆర్టీసీ బస్సులు నడపనుంది. అమరావతి, భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామలోని ఆలయాలు దర్శించడానికి బస్సు సర్వీసులు ఉన్నాయి. .
ముందురోజే ప్రయాణం..
ప్రతీ సోమవారం భక్తులు ఆయా ఆలయాలను దర్శించుకునేలా ముందురోజు అంటే ఆదివారాలైన అక్టోబరు 26, నవంబరు 2, 9, 16 తేదీల్లో ఆయా ఆర్టీసీ డిపోల నుంచి సుమారు రాత్రి 8 గంటలకు బయలు దేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరుసటి రోజు అంటే కార్తిక సోమవారాలైన అక్టోబరు 27, నవంబరు 3, 10, 17 తేదీల్లో సుమారు రాత్రి 9 గంటలకు ఆయా ఆర్టీసీ డిపోలకు బస్సులు తిరిగి చేరుతాయి. రామచంద్రపురం నుంచి ధరల వివరాలను డిపో మేనేజర్ పి.భాస్కరరావు పేర్కొన్నారు. మిగిలిన డిపోల నుంచి స్వల్ప తేడాలతో టికెట్ ధరలు ఉంటాయన్నారు. ఏగ్రామంలోనైనా 39 మంది ప్రయాణికులుంటే ఆ గ్రామం నుంచే బస్సు ప్రయాణం అయ్యేలా సర్వీసులు నడుపుతామన్నారు. పంచారామ బస్సుల ముందస్తు రిజర్వేషన్లకు ద్రాక్షారామ, తాళ్లపొలం, రామచంద్రపురం బస్టాండ్, పాతబస్టాండ్, రాజగోపాల్ సెంటర్, బిక్కవోలు, రాయవరం, అంగర, గంగవరం, అనపర్తిలో రిజర్వేషన్ల కౌంటర్లు ఏర్పాటు చేశామని డిపో మేనేజర్ తెలిపారు. పూర్తి వివరాలకు రామచంద్రపురం డిపో మేనేజర్- 9959225536 నంబరుకు సంప్రదించవచ్చని డిపో మేనేజర్ పి.భాస్కరరావు వెల్లడించారు.
