
కారుపై పడ్డ కంటైనర్.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం
చిత్తూరు జిల్లా ఇరువారం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న కంటైనర్ లారీ అదుపుతప్పి కారుపై పడటంతో 28 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు.
పోలీసుల కధనం ప్రకారం వివరాల ప్రకారం చిత్తూరు సమీపంలోని ఇరువారం క్రాస్ వద్ద బాల త్రిపుర సుందరి కల్యాణ మండపం సమీపంలో ఉదయం సుమారు 8.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. గుడిపాల మండలం రామాపురం గ్రామానికి చెందిన అనుదీప్ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. విధులకు హాజరయ్యేందుకు కారులో బయలుదేరిన సమయంలో ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ అకస్మాత్తుగా కుడివైపుకు వరిగి కారుపై పడినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ తుషార్ దూడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ల సహాయంతో భారీ కంటైనర్‌ను పక్కకు తొలగించి నుజ్జునుజ్జున కారు నుంచి అనుదీప్ మృతదేహాన్ని అతికష్టం మీద బయటకు తీశారు. కంటైనర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల లేదా వాహనంలో లోడ్ సరిగ్గా లేకపోవడం (ఇంబ్యాలెన్స్) వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసి పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నామని తెలిపారు.
