
కారుణ్య మరణానికి అనుమతి పొందిన హరీశ్‌రాణా మృతి
దేశంలో కారుణ్య మరణానికి (పాసివ్ యూతనేషియా ) అనుమతి పొందిన తొలి వ్యక్తి హరీశ్ రాణా మంగళవారం ఢిల్లీలోని ఆల్‌ఇండియా ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో కన్నుమూశారు. 2013 నుంచి కోమాలో ఉన్న ఆయన 13 ఏళ్లకు పైగా జీవన పోరాటం సాగించారు. పంజాబ్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న సమయంలో నాలుగో అంతస్తు నుంచి పడిపోవడంతో తీవ్ర తల గాయాలు కావడంతో ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కృత్రిమ ఆహారం, అవసరమైనప్పుడు ఆక్సిజన్ సాయంతోనే జీవించేవారు. మార్చి 11న సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పులో హరీశ్ రాణా కు పాసివ్ యూతనేషియాకు అనుమతించింది. అనంతరం మార్చి 14న ఆయనను ఘజియాబాద్‌లోని నివాసం నుంచి ఎయిమ్స్‌లోని ప్యాలియేటివ్ కేర్ యూనిట్‌కు తరలించారు.
పాసివ్ యూతనేషియా అంటే
జీవితం కొనసాగేందుకు అవసరమైన చికిత్స లేదా లైఫ్ సపోర్ట్‌ను నిలిపివేయడం ద్వారా సహజ మరణానికి అవకాశం కల్పించడాన్ని పాసివ్ యూతనేషియా అంటారు. ఆసుపత్రిలో చేరిన తర్వాత ఆయనకు ఇస్తున్న కృత్రిమ ఆహారం దశలవారీగా తగ్గించారు. కుటుంబ సభ్యులు ఈ నిర్ణయం తమకు వ్యక్తిగత ప్రయోజనం కోసం కాదని, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మరెందరికో మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. హరీశ్ రాణా తండ్రి అశోక్ రాణా మాట్లాడుతూ, ఈ నిర్ణయం తన కుమారుడికి గౌరవప్రదమైన ముగింపు ఇస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త పింకీ విరాణి స్పందిస్తూ, ఎయిమ్స్ వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబ సభ్యులు ముందుగానే తమ ఇలాంటి నిర్ణయాలపై అభిప్రాయాన్ని తెలియజేయాలని సూచించారు.
ఇది 2011లో అరుణ షాన్‌బాగ్ కేసులో ప్రారంభమైన చర్చలకు కొనసాగింపుగా భావిస్తున్నారు. ఆమె కేసులో కూడా యూతనేషియా అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. సుప్రీంకోర్టు 2018లో గౌరవంతో మరణించే హక్కును రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద మౌలిక హక్కుగా గుర్తించింది. 2023లో ఈ మార్గదర్శకాలను మరింత సులభతరం చేసింది. తాజా తీర్పులో కేంద్ర ప్రభుత్వం పాసివ్ యూతనేషియాపై సమగ్ర చట్టం తీసుకురావాలని కోర్టు సూచించింది. అలాగే లైఫ్ సపోర్ట్ ఉపసంహరణకు రెండు వైద్య బోర్డుల అనుమతి అవసరమని స్పష్టం చేసింది. హరీశ్ రాణా తల్లిదండ్రుల సేవలను కోర్టు ప్రత్యేకంగా ప్రశంసిస్తూ అతని కుటుంబం ఎప్పుడూ అతని పక్కనే నిలిచిందని పేర్కొంది.
