
కామారెడ్డి లో ఘోర రోడ్డు ప్రమాదం
దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక చిన్న నిర్లక్ష్యం, ఒక తప్పుడు నిర్ణయం క్షణాల్లో ప్రాణాంతక ఘటనగా మారుతోంది. అయితే కామారెడ్డి జిల్లాలో బుధవారం ఉదయం చోటుచేసుకున్న ప్రమాదం ఇందుకు తాజా ఉదాహరణ. జాతీయ రహదారి 44 పై బిక్కనూర్ మండలం పరిధిలోని జంగంపల్లి గ్రామం సమీపంలో రాంగ్ రూట్‌లో దూసుకొచ్చిన టిప్పర్ లారీ, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు.
పోలీసుల సమాచారం ప్రకారం, వడ్లపల్లి గ్రామానికి చెందిన కుటుంబం జంగంపల్లి వైపు వెళ్తుండగా, రాంగ్ రూట్ లో దూసుకొచ్చిన లారీ వారిని ఢీకొట్టింది. కాగా ప్రమాదంలో 54 ఏళ్ల తండ్రి ఆయన 28 ఏళ్ల కుమార్తె, ఆమె నాలుగేళ్ల కుమారుడు, మూడు నెలల పసికందు ఉన్నట్లు సమాచారం.
**ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..
కాగా ప్రమాదం జరిగిన వెంటనే తండ్రి, కూతురు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మిగిలిన ఇద్దరిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దురదృష్టవశాత్తూ చికిత్స పొందుతూ వారు కూడా తీవ్ర గాయాల కారణంగా మృతి చెందారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది.
పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తప్పుగా వాహనం నడిపి, నలుగురు అమాయకుల ప్రాణాలు తీసిన టిప్పర్ డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. స్థానికులు ఈ ప్రమాదంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాంగ్ రూట్ డ్రైవింగ్‌పై పటిష్టమైన పర్యవేక్షణ లేకపోవడాన్ని విమర్శించారు. ప్రతిరోజూ ఈ రహదారిపై పెద్ద వాహనాలు తప్పుడు దిశలో వస్తుంటాయి, ఎవరూ పట్టించుకోరు, అని గ్రామస్తులు అన్నారు.
ఈ సంఘటనతో ప్రాంతంలో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. గ్రామస్థులు రాంగ్ రూట్ డ్రైవింగ్, వేగ పరిమితి ఉల్లంఘనలు, హెవీ వాహనాల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రమాదం రోడ్డు భద్రత పట్ల అధికారుల నిర్లక్ష్యాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.
