Let's talk: editor@tmv.in
కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ అభ్యర్థిపై దాడిని ఖండించిన కేటీఆర్

కామారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్ అభ్యర్థిపై దాడిని ఖండించిన కేటీఆర్

Gaddamidi Naveen
16 డిసెంబర్, 2025

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న ఉద్రిక్తత, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకుల దారుణ దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు దారుణాలకు తెగబడటం 'గూండాగిరి' అని మండిపడిన కేటీఆర్, వెంటనే కామారెడ్డి జిల్లా ఎస్పీకి స్వయంగా ఫోన్ చేసి, దాడికి పాల్పడిన వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

సోమార్‌పేట్‌లో దారుణం: ట్రాక్టర్‌తో హత్యాయత్నం

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్‌పేట్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాల తర్వాత ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన బిట్ల బాలరాజు ఎన్నికల ఫలితాల అనంతరం తన కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి ఇంటి ముందు కూర్చుని ఉన్న సమయంలో ఈ దారుణం జరిగింది. ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ అభ్యర్థి, స్థానిక మండల అధ్యక్షుడు సాయిబాబా ట్రాక్టర్‌తో అక్కడికి వచ్చి బీభత్సం సృష్టించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, నన్ను ఎవరూ ఏం చేయలేరు అంటూ విర్రవీగుతూ నిల్చున్న వారిపైకి ట్రాక్టర్ ఎక్కించి ఢీకొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయని. ఈ హత్యాయత్నంలో బీఆర్ఎస్ అభ్యర్థి బాలరాజుతో పాటు ఆయన అనుచరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనను గమనించిన గ్రామస్థులు వెంటనే స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.

మాజీ ఎమ్మెల్యేతో ఆరా, కార్యకర్తలకు భరోసా

ఈ విషయం తెలిసిన వెంటనే కేటీఆర్ స్పందించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకున్నారు. గాయపడిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి, పార్టీ తరపున పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇలాంటి దాడులతో పార్టీ శ్రేణులు భయపడవద్దని, న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ అన్నారు.

కామారెడ్డి ఎస్పీకి కేటీఆర్ ఫోన్, కఠిన చర్యలకు డిమాండ్

అనంతరం కేటీఆర్ కామారెడ్డి జిల్లా ఎస్పీకి స్వయంగా ఫోన్ చేసి. సోమార్‌పేట్‌లో జరిగిన ఘటనను వివరించి, బాధ్యులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశామ‌ని ఆయ‌న తెలిపారు. అధికార మదంతో హత్యాయత్నాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ నేతలపై పోలీసులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుందని ఆయ‌న‌ హెచ్చరించారు. దాడికి పాల్పడిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలని కేటిఆర్ కోరారు.

శాంతిభద్రతలు అదుపు తప్పితే ప్రభుత్వానికే హెచ్చరిక

రాష్ట్రంలో ఇదే పరిస్థితి కొనసాగితే బీఆర్ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోబోవని కేటీఆర్ హెచ్చరించారు. ప్రజలు, కార్యకర్తలు తిరగబడితే శాంతిభద్రతల పరిస్థితి అదుపు తప్పుతుందని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. చట్టం తన పని తాను చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. గాడి తప్పిన కాంగ్రెస్ నేతలను కట్టడి చేయాల్సిన బాధ్యత పోలీసులదేనని కేటీఆర్ తేల్చిచెప్పారు.