Let's talk: editor@tmv.in
కామారెడ్డి జిల్లాలో ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహప్రవేశ కార్యక్రమం

కామారెడ్డి జిల్లాలో ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహప్రవేశ కార్యక్రమం

Gaddamidi Naveen
8 మార్చి, 2026

పేదవాడి సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకం క్షేత్రస్థాయిలో సత్ఫలితాలను ఇస్తోంది. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బీర్ అలీ, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఈ వేడుకకు హాజరై ఇళ్లను ప్రారంభించారు.

ఈ గ్రామానికి చెందిన లబ్ధిదారులు బిక్కనూరు లక్ష్మి, చిట్యాల రాజమణిలకు ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇళ్లలో అతిథులు గృహప్రవేశం చేయించి, వారికి శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, కొత్త ఇళ్లలోకి ప్రవేశిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం తరపున నిత్యావసర వస్తువులు, దుస్తులను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి సీతక్క ఫోన్ ద్వారా లబ్ధిదారులతో మాట్లాడి, వారి ఆనందాన్ని పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. తమకు ఆత్మగౌరవంతో కూడిన గృహాన్ని అందించినందుకు లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

నాడు మాట ఇచ్చారు.. నేడు నెరవేర్చారు:షబ్బీర్ అలీ

ఈ సందర్భంగా మహ్మద్ షబ్బీర్ అలీ మాట్లాడుతూ, గతంలో రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సమయంలో గ్రామాల్లో ఇళ్లు కూలిపోయి పేదలు పడుతున్న ఇబ్బందులను చూసి చలించిపోయారని, అధికారంలోకి రాగానే ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి, నేడు గృహప్రవేశాలు చేయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. గ్రామంలో ఇంకా నిర్మాణం పూర్తికాని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు, తమ ఇళ్లను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లబ్ధిదారులను అభినందించారు.