Let's talk: editor@tmv.in
కామారెడ్డి అభివృద్ధిపై కేంద్ర మంత్రి గడ్కరీతో ఎమ్మెల్యే కేవీఆర్ భేటీ

కామారెడ్డి అభివృద్ధిపై కేంద్ర మంత్రి గడ్కరీతో ఎమ్మెల్యే కేవీఆర్ భేటీ

Gaddamidi Naveen
15 మార్చి, 2026

కామారెడ్డి నియోజకవర్గ రూపురేఖలను మార్చే దిశగా కీలక అడుగు పడింది. కామారెడ్డి చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం, ప్రధాన రహదారుల అభివృద్ధి కోసం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి శనివారం ఢిల్లీలో కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రతిపాదనలను ఆయన మంత్రికి సమర్పించారు.

గతంలోనే ప్రతిపాదించిన 54 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్డు అంశాన్ని ఎమ్మెల్యే ఈ సందర్భంగా గుర్తు చేశారు. సుమారు రూ. 550 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి తక్షణమే స్థల పరిశీలన చేపట్టాలని, నిధుల ప్రణాళికను సిద్ధం చేయాలని విన్నవించారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి, పనుల ప్రణాళికను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

నియోజకవర్గంలోని ప్రధాన రహదారుల పొడిగింపు, నూతన రహదారుల ఏర్పాటు కోసం సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఐఎఫ్) కింద రూ. 50 కోట్ల నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. ముఖ్యంగా లింగపూర్ నుంచి టెక్రియల్ వరకు రహదారి అభివృద్ధికి ఈ నిధులు అత్యంత అవసరమని వివరించారు. ఈ ప్రతిపాదన పట్ల కూడా మంత్రి గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ప్రాజెక్టులు పూర్తయితే కామారెడ్డి పట్టణంపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గడమే కాకుండా, చుట్టుపక్కల గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఆర్థికాభివృద్ధికి బాటలు పడతాయని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్భంగా వెంకట రమణ రెడ్డి పునరుద్ఘాటించారు.