
కామారెడ్డిలో రాజకీయ సెగ: కాంగ్రెస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ
కామారెడ్డి జిల్లా కేంద్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భూ వివాదానికి సంబంధించిన ఆరోపణలు, ప్రత్యారోపణల నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగడంతో కామారెడ్డి పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ఒక భూమి వ్యవహారానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ మధ్య గత కొన్ని రోజులుగా సవాల్-ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో, శిశుమందిర్, అరోరా కాలేజ్ విషయంలో కాంగ్రెస్, నాయకులు చేసిన ఆరోపణలకు సాక్ష్యాధారాలు తీసుకొని శనివారం శిశుమందిర్‌కి రావాలని కాంగ్రెస్ నాయకులకు, ఈ అంశంపై బహిరంగ చర్చకు రావాలని షబ్బీర్ అలీకి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి సవాల్ విసిరారు. అయితే, శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు ఎమ్మెల్యేను చర్చకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
రణరంగంగా మారిన ఎమ్మెల్యే కార్యాలయం
ఇదిలా ఉండగా, రెండు పార్టీల కార్యకర్తలు ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి క్యాంప్ కార్యాలయం వద్దకు చేరుకుని పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించగా, తోపులాటలు చోటుచేసుకున్నాయి. ఈ గందరగోళంలో కాంగ్రెస్ నాయకుడి వాహనాన్ని ధ్వంసం చేసి, రోడ్డుపై బోల్తా కొట్టించారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి దిగ్భ్రాంతికరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి రాజకీయ హింసకు చోటు లేదు అని ఆయన 'ఎక్స్' వేదికగా పేర్కొన్నారు. మరోవైపు,ఈ క్రమంలో కామారెడ్డికి బయలుదేరిన తమను మేడ్చల్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి తనతో పాటు, ఎమ్మెల్సీ అంజి రెడ్డిని కూడా పోలీసులు నిలిపివేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధులు తమ సహచరులను పరామర్శించడం రాజ్యాంగబద్ధ హక్కు అని ఆయన అభిప్రాయపడ్డారు.
కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ఘర్షణకు పాల్పడిన పలువురిని అదుపులోకి తీసుకున్నామని, అరెస్టుల ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరించినట్లు వెల్లడించారు.
తప్పు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం: ఎమ్మెల్యే
తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి సవాల్ విసిరారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు జరిపిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు.
ప్రభుత్వ కళాశాల భూముల విషయంలో తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యే సవాల్ విసిరారు. "నేను తప్పు చేసినట్లు ఆధారాలతో నిరూపిస్తే స్పీకర్ సలహాతో పదవికి రాజీనామా చేస్తా. వచ్చే సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వస్తాను, దమ్ముంటే వచ్చి నిరూపించండి" అని ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీపై మండిపడుతూ.. తాము తెచ్చిన నిధులకు ఆయన ఇంచార్జ్ మంత్రి సమక్షంలో ప్రారంభోత్సవాలు చేసి, వాటిని తమవిగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలో మంత్రిగా ఉండి కూడా కామారెడ్డికి ఏమీ చేయలేదని, ఇప్పుడు నవాబులా చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు.
కళాశాల భూముల విషయంలో కాంగ్రెస్ నాయకుడు చేసిన ఆరోపణలకు చర్చకు రావాలని సవాల్ విసిరితే, వందల సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు తన క్యాంపు కార్యాలయానికి వచ్చి ఉద్రిక్తత సృష్టించారని పేర్కొన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు బయటకు రావద్దని సూచించడంతో తాను సహకరించానన్నారు. మున్సిపల్లో తప్పు జరగకుండా చూస్తానన్న కక్షతోనే తనపై దాడికి దిగారని ఎమ్మెల్యే ఆరోపించారు. "ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది" అని వ్యాఖ్యానించారు.నేటి నుంచి గ్రామాల్లో పర్యటిస్తానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారు.
