
కామారెడ్డికి బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు అరెస్ట్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాన్సువాడలో హిందూ సంఘాలు, కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి, కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించడానికి వెళ్తున్న తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఆయన దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. రామచందర్‌రావును తార్నాకలోని ఆయన నివాసం వద్ద పోలీసులు అడ్డుకుని బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీజేపీ ఎమ్మెల్యేపై జరిగిన దాడిని ఖండిస్తూ సంఘీభావం తెలపాలనే ఉద్దేశంతో బయలుదేరిన తనను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగ చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని పేర్కొన్నారు. బాన్సువాడ ప్రజలకు, హిందూ సంఘాలకు శాంతియుతంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం చేతిలో బందీ అయిందని, అసదుద్దీన్ ఓవైసీ చెప్పినట్టుగా పాలన సాగుతోందని ఆయన ఆరోపించారు. ఇటువంటి ప్రజావ్యతిరేక చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టాలని చూస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు.
బాన్సువాడలో ఇప్పటికే 75 మందికి పైగా బీజేపీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి, తప్పుడు కేసులు పెట్టారని ఆయన మండిపడ్డారు. కేవలం హిందువులనే లక్ష్యంగా చేసుకుని చర్యలు తీసుకోవడం పక్షపాత వైఖరి అని విమర్శించారు.
నేతల ఖండన
తెలంగాణ బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి. సుభాష్ కూడా ఈ అరెస్టును తీవ్రంగా ఖండించారు. బాన్సువాడకు బయలుదేరిన రాష్ట్ర అధ్యక్షుడిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించడం ప్రజాస్వామ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రత్యక్ష దాడి అని విమర్శించారు. దాడులు చేసిన కాంగ్రెస్ నేతలను వదిలేసి, బాధితుల పక్షాన నిలిచిన బీజేపీ నాయకులను టార్గెట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్బంధ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. అక్రమ అరెస్టులు, హౌస్ అరెస్టులతో భయపెట్టాలని ప్రయత్నించినా బీజేపీ ప్రజాస్వామ్య పోరాటం ఆగదని ఆయన పేర్కొన్నారు.
ఈ అంశంపై కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు అరెస్టును బహిరంగంగా ఖండిస్తున్నానని తన ఎక్స్ వేదిక ద్వారా తెలిపారు. ప్రతిపక్ష నేతను ఈ విధంగా లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. రాజకీయ ప్రతీకార దురుద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఈ అరెస్టులకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాలని, బాన్సువాడ ఘటనలో బాధిత హిందువులకు అండగా నిలవాలని పార్టీ పిలుపునిచ్చింది.
