Let's talk: editor@tmv.in
కాప్–30లో భారత్ ప్రధాన లక్ష్యాలు సాధించింది: భూపేందర్ యాదవ్

కాప్–30లో భారత్ ప్రధాన లక్ష్యాలు సాధించింది: భూపేందర్ యాదవ్

Pinjari Chand
1 డిసెంబర్, 2025

ఇటీవల బ్రెజిల్‌లో నిర్వహించిన ఐరాస కాప్–30 వాతావరణ శిఖరాగ్ర సమావేశం అభివృద్ధి చెందుతున్న దేశాల హక్కులకు, సమానత్వానికి మైలురాయిగా నిలిచిందని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. ఈ సమావేశంలో భారత్‌ ముఖ్య లక్ష్యాలన్నీ సాధించి, నిర్ణయాలన్నింటిలోనూ దేశం అభిప్రాయాలు ప్రతిఫలించాయని ఆయన స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కు సంబంధించిన వార్షిక పార్టీల సమావేశం (కాప్)కి 194 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఈ శిఖరాగ్ర సమావేశం నవంబర్ 10 నుంచి 22 వరకు అమెజాన్‌లోని బ్రెజిలియన్ నగరం బెలెమ్‌లో జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాల గురించి కేంద్రమంత్రి ఆదివారం మీడియాతో పంచుకున్నారు. బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, భారత్‌, చైనా దేశాలున్న బీఏఎస్ఐసీ గ్రూప్, అలాగే ఒకే ఆలోచన విధానం ఉన్న దేశాల తరఫున భారత్‌ బలమైన నాయకత్వం వహించిందని యాదవ్‌ పేర్కొన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఊరట

వాతావరణ మార్పులకు అనుగుణంగా అవసరమైన ఆర్థిక వనరులపై (అర్టికల్ 9.1) ప్రత్యేక వర్క్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం ఇండియాకు పెద్ద విజయమని ఆయన వివరించారు. గ్రాంట్-ఆధారిత, కనిష్ఠ వడ్డీతో కూడిన, అప్పు భారాన్ని పెంచని నిధులే అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమని భారత్‌ పట్టుబట్టి ఈ నిర్ణయాన్ని సాధించిందన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు ‘న్యాయమైన మార్పు’ దిశగా సాగేందుకు జస్ట్ ట్రాన్సిషన్ మెకానిజం ఏర్పాటు చేయడం, గ్లోబల్ గోల్ ఆన్ ఆడప్షన్ (జీజీఏ) కోసం స్వచ్ఛంద సూచికలు ఆమోదింపజేయడం, టెక్నాలజీ అమలు కార్యక్రమం (టీఐపీ) స్థాపన కూడా భారత డిమాండ్ల ఫలితమేనని చెప్పారు.

ఏకపక్ష వాణిజ్య చర్యలపై చర్చకు అవకాశం

కార్బన్‌ బార్డర్‌ అడ్జస్ట్మెంట్‌ మెకానిజం వంటి వ్యాపార సంబంధిత ఏకపక్ష వాతావరణ చర్యలు అభివృద్ధి చెందుతున్న దేశాలపై పడే ప్రభావాలపై భవిష్యత్‌ సమావేశాల్లో చర్చకు స్పష్టమైన స్థానం కల్పించామని యాదవ్‌ తెలిపారు. అడాప్టేషన్‌ నిధులను 2035 నాటికి మూడు రెట్లు పెంచేందుకు అభివృద్ధి చెందిన దేశాలు అంగీకరించడం కూడా భారత స్ఫూర్తిదాయక పాత్ర వల్లే జరిగిందని ఆయన చెప్పారు.

29 కీలక నిర్ణయాల్లో భారత ముద్ర

మొత్తం 29 నిర్ణయాలను ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ సమావేశంలో భారత ఆలోచనలు స్పష్టంగా ప్రతిఫలించాయని మంత్రి వివరించారు. ఒకే ఆలోచన విధానం ఉన్న దేశాల గ్రూప్ కు భారత్‌ నేతృత్వం వహించి ఆర్టికల్ 9.1 పై కొత్త అజెండా తీసుకురావడంలో విజయవంతమైందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్‌ వాతావరణ బహుపక్ష విధానానికి కట్టుబడి ఉందని కాప్ 30 మళ్లీ చూపించుకుంది అని యాదవ్‌ చెప్పారు. బ్రెజిల్‌ స్థానిక తుపీ భాషలో ‘ముతిరావో’గా పిలవబడే ‘సమిష్టి యత్నం’ తీర్మానాన్ని తీసుకువచ్చేందుకు భారత్‌ కీలక పాత్ర పోషించిందని ఆయన తెలిపారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు, సమానత్వం, పారదర్శకతలే ఈసారి భారత ప్రధాన అంచనాలు అని, అవన్నీ తుది నిర్ణయాల్లో ప్రతిబింబించాయని యాదవ్‌ పేర్కొన్నారు. అదనపు నివేదికల భారాన్ని లేకుండా, ప్రతి దేశం తమ అవసరాలకు తగ్గట్టు అనువర్తన సూచికలను నిర్ణయించుకోవడానికి అవకాశం సాధించామని కూడా చెప్పారు.

కాప్–30లో భారత్ ప్రధాన లక్ష్యాలు సాధించింది: భూపేందర్ యాదవ్ - Tholi Paluku