Let's talk: editor@tmv.in
కాపాడాల్సిన వాడే కాటేశాడు !

కాపాడాల్సిన వాడే కాటేశాడు !

Panthagani Anusha
6 అక్టోబర్, 2025

కంటికి రెప్పలా ప్రాణ కవచమై కాపాడాల్సిన కన్నతండ్రి ప్రాణాలు తీసే యముడిగా మరి తన ఏడాది వయసున్న కొడుకును అతి కిరాతకంగా హతమార్చిన హృదయవిదారక ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాలియా జిల్లాలో వెలుగుచూసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రమేష్, అతని భార్య రీనా స్థానికంగా రోజు వారి కూలీగా పనిచేస్తూ జీవనం కొనసాగించేవారు. వీరికి ఇద్దరు పిల్లలు. మద్యానికి బానిసైన రమేష్ రోజూ తాగొచ్చి భార్య రీనాతో తరుచూ గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తాగొచ్చిన రమేష్ భార్యను విచక్షణ రహితంగా కొట్టి ఆ తర్వాత తండ్రి కంలేశ్ తివారిని బెదిరించాడు. దీంతో భయపడిన రీనా తన కూతురు కొడుకును ఇంట్లోనే వదిలి తన తండ్రితో కలిసి ఇంటినుండి బయటకు వెళ్లిపోగా కోపోద్రిక్తుడైన రమేష్ తన కుమారుడు కీనుఫై కత్తితో దాడిచేసాడు.

ఇదిలా ఉండగా మరుసటి రోజు తిరిగివచ్చిన రీనా రక్తపుమడుగులో ఉన్న తన కొడుకును చూసి హుటాహుటిన హాస్పిటల్ కి తరలించినప్పటికీ చిన్నారి కీను మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. తన కొడుకు మరణంతో కృంగిపోయిన రీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

స్థానిక పోలీసు అధికారి మాట్లాడుతూ మద్యానికి బానిసైన రమేష్ భార్యను కొట్టడం కుటుంబసభ్యులను బెదిరించడం వంటి చేసేవాడని చివరికి అతనికున్న తాగుడు అలవాటే ఆ చిన్నారి ప్రాణం పోవడానికి కారణమైందని ఆయన పేర్కొన్నారు. ఇక రీనా చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రమేష్ పై భారతీయ న్యాయ సం‌హితా సెక్షన్లు 105, 115(2), 352, 351(3) కింద కేసు నమోదు చేసి, అతన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు ఘటనకు సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

కాపాడాల్సిన వాడే కాటేశాడు ! - Tholi Paluku