Let's talk: editor@tmv.in
కాన్షీరాంకు భారతరత్న ఇవ్వాలి: ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ

కాన్షీరాంకు భారతరత్న ఇవ్వాలి: ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ

Pinjari Chand
16 మార్చి, 2026

బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకుడు కాన్షీరాంకు మరణానంతరం దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రదానం చేయాలని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. కాన్షీరాం జయంతి సందర్భంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ రాహుల్ గాంధీ ఈ లేఖ రాశారు. భారత రాజకీయాల స్వభావాన్ని కాన్షీరాం పూర్తిగా మార్చారని, ఆయన ఉద్యమాల ద్వారా బహుజనులు, పేదలలో రాజకీయ చైతన్యం పెరిగిందని రాహుల్ పేర్కొన్నారు. బహుజనులు, పేదలు తమ ఓటు, స్వరం, ప్రతినిధిత్వం ఎంతో ముఖ్యమని కాన్షీరాం గుర్తు చేశారు. ఈ దేశం అందరిదని వారికి తెలియజేశారని లేఖలో పేర్కొన్నారు.

కాన్షీరాం కృషి వల్ల ఇంతకుముందు ప్రజా జీవితంలోకి రావాలని అనుకోని చాలా మంది రాజకీయాలను న్యాయం, సమానత్వం సాధించే సాధనంగా చూడటం ప్రారంభించారని ఆయన అన్నారు.భారత రాజ్యాంగం ప్రతి భారతీయుడికి సమానత్వం, గౌరవం, పాలనలో భాగస్వామ్యం హామీ ఇస్తుందని, ఈ విలువలను సమాజంలోని అణగారిన వర్గాలకు అందించేందుకు కాన్షీరాం జీవితాన్ని అంకితం చేశారని రాహుల్ గాంధీ తెలిపారు. దీంతో భారత ప్రజాస్వామ్యం మరింత బలపడిందని చెప్పారు.

దళిత మేధావులు, సామాజిక కార్యకర్తలు చాలా కాలంగా కాన్షీరాంకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని ఆయన గుర్తుచేశారు. ఇటీవల లక్నోలో జరిగిన కార్యక్రమంలో కూడా ఈ డిమాండ్ బలంగా వినిపించిందని తెలిపారు. కాన్షీరాంకు భారతరత్న ఇవ్వడం ద్వారా ఆయన దేశానికి చేసిన గొప్ప సేవలను గుర్తించడం మాత్రమే కాకుండా, ఆయనను ఆశాకిరణంగా భావించే కోట్లాది ప్రజల ఆకాంక్షలకు గౌరవం ఇచ్చినట్టవుతుందని అన్నారు. ఇటీవల కాంగ్రెస్ నిర్వహించిన ‘సంవిధాన్ సమ్మేళన్’ కార్యక్రమంలో అధికారంలోకి వస్తే కాన్షీరాంకు భారతరత్న ప్రదానం చేస్తామని పార్టీ తీర్మానం కూడా చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాన్షీరాంకు భారతరత్న ప్రదానం చేస్తామని తీర్మానం కూడా చేశారు.

కాంగ్రెస్‌ చేసిన తప్పు చేయొద్దు..మాయావతి

బహుజన్ సమాజ్ పార్టీ స్థాపకుడు కాన్షీరాంకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను వెంటనే ప్రదానం చేయాలని బీఎస్పీ అధినేత మాయావతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కాన్షీరాం జయంతి సందర్భంగా విడుదల చేసిన ప్రకటనలో ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. రాజ్యాంగ శిల్పి బీఆర్‌‌.అంబేద్కర్‌‌కు భారతరత్న ఇవ్వడంలో కాంగ్రెస్‌ చేసిన తప్పును ఇప్పుడు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం పునరావృతం చేయకూడదని ఆమె పేర్కొన్నారు. బీఎస్పీ అధినేత మాయావతి కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. దళిత వ్యతిరేక భావజాలమే బీఎస్పీ ఏర్పాటుకు కారణమని ఆమె అన్నారు.

దేశంలో సమానత్వం ఆధారంగా సమాజాన్ని నిర్మించడంలో కాన్షీరాం చేసిన కృషి చారిత్రాత్మకమని మాయావతి అన్నారు. రాజ్యాంగం పేర్కొన్న సమానత్వ లక్ష్యాలను సాధించేందుకు ఆయన జీవితాంతం పోరాడారని చెప్పారు. అందువల్ల ఆయన కోట్లాది ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించారని ఆమె వ్యాఖ్యానించారు.

కాన్షీరాం కేవలం ఒక రాజకీయ పార్టీనే స్థాపించలేదు, పెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారని మాయావతి గుర్తుచేశారు. తనను ముఖ్యమంత్రిగా చేసే అవకాశాన్ని కూడా ఆయన కల్పించారని తెలిపారు. అయితే మాయావతి మాత్రం కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. బహుజనుల అభివృద్ధి గురించి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, బీజేపీ మాట్లాడుతూనే ఉంటాయని కానీ వారి అభివృద్ధికి నిజంగా పనిచేయడం చాలా అరుదుగా జరుగుతుందని ఆమె ఆరోపించారు.

కాన్షీరాంకు భారతరత్న ఇవ్వాలి: ప్రధానికి రాహుల్ గాంధీ లేఖ - Tholi Paluku