
కాన్పూర్‌లో లాంబోర్గినీ బీభత్సం.. ఆరుగురికి గాయాలు
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వేగంగా దూసుకొచ్చిన లాంబోర్గినీ కారు పాదచారులపైకి దూసుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు గాయపడగా, ఘటనకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ లగ్జరీ కారును స్థానికంగా పేరొందిన పొగాకు వ్యాపారి కుమారుడు నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం సుమారు 3.15 గంటల సమయంలో నగరంలోని ఖరీదైన గ్వాల్టోలి ప్రాంతం వీఐపీ రోడ్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, లాంబోర్గినీ మొదట ఒక ఆటోరిక్షాను ఢీకొట్టగా, అనంతరం రోడ్డుపై నిలిపి ఉన్న మోటార్‌సైకిల్‌ను ఢీకొంది. దీంతో బైక్‌పై ఉన్న వ్యక్తి సుమారు 10 అడుగుల ఎత్తుకు ఎగిరిపడినట్లు తెలిపారు. ఆ కారు మోటార్ సైకిల్ ముందు చక్రాన్ని ఎక్కి కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లి, చివరకు విద్యుత్ స్థంభాన్ని ఢీకొని ఆగిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనలో యమునాగంజ్‌కు చెందిన తౌఫిక్ తీవ్రంగా గాయపడగా, అతని కాళ్లకు తీవ్రమైన గాయాలయ్యాయి. మిగతా గాయపడిన వారికి ఎముకలు విరగడం, తదితర గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) అతుల్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, కేసు నమోదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోందని, కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడా లేదా అన్నది దర్యాప్తు పూర్తయ్యాకే తెలుస్తుందని చెప్పారు.
వ్యాపారవేత్త కుమారుడు కావడంతో పోలీసుల సాఫ్ట్ కార్నర్
పోలీసుల వివరాల ప్రకారం, ఈ లాంబోర్గినీ కారును వ్యాపారవేత్త కేకే మిశ్రా కుమారుడు శివమ్ మిశ్రా నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేకే మిశ్రా బన్సీధర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని కాగా, ఆ సంస్థ గుట్కా తయారీ కంపెనీలకు పొగాకు సరఫరా చేస్తోంది. ప్రమాదం అనంతరం ఆగ్రహించిన స్థానికులు అక్కడికి చేరుకుని కారును చుట్టుముట్టారు. కారుతో పాటు వచ్చిన ప్రైవేట్ బౌన్సర్లు జనాన్ని వెనక్కు నెట్టేందుకు ప్రయత్నించారని, దురుసుగా ప్రవర్తించారని ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్‌ను రక్షించి, గాయపడిన వారితో పాటు అతడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన లాంబోర్గినీ కారును స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్‌లో బాధితులు, స్థానికులు డ్రైవర్ అనుచరుల ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. అతని పలుకుబడి ప్రభావం కారణంగా పోలీసులు సాఫ్ట్‌గా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. కొందరు రాజీ కోసం ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. గాయపడిన సోను త్రిపాఠీ మీడియాతో మాట్లాడుతూ నేను, నా బంధువు బైక్ దగ్గర నిలబడి ఉన్నప్పుడు కారు వచ్చి ఢీకొట్టింది. మేం పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు.
గతంలో జరిగిన ప్రధాన లగ్జరీ కారు ప్రమాదాలు
న్యూఢిల్లీ (2025)వసంత్ విహార్ ప్రాంతంలో మద్యం తాగిన ఆడి కారు డ్రైవర్ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురిని ఢీకొట్టాడు.
నోయిడా (2025)– నిర్మాణంలో ఉన్న భవనం సమీపంలో లాంబోర్గినీ కారు ఇద్దరు కార్మికులను ఢీకొట్టి గాయపరిచింది.
పుణే (2024)– కల్యాణి నగర్‌లో మైనర్ నడిపిన పోర్షే కారు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు ఐటీ ఉద్యోగులు మృతి చెందారు.
అహ్మదాబాద్ (2023)– ఐఎస్‌కాన్ బ్రిడ్జ్‌పై జాగ్వార్ కారు జన సమూహంలోకి దూసుకెళ్లి తొమ్మిది మంది మృతి చెందారు.
పాల్ఘర్ (2022)– టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ ప్రయాణిస్తున్న మెర్సిడెస్ కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది.
బెంగళూరు (2021)– ఆడి కారు అదుపు తప్పి భవనాన్ని ఢీకొనడంతో ఏడు మంది మృతి చెందారు.
ఈ తరహా ఘటనలు, లగ్జరీ వాహనాల యజమానులపై చట్టం సమానంగా అమలవుతోందా? అనే ప్రశ్నను మళ్లీ తెరపైకి తెస్తున్నాయి. అధిక వేగ నియంత్రణ, కఠిన చట్ట అమలు, బాధ్యతాయుత డ్రైవింగ్ అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
