Let's talk: editor@tmv.in
కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం

కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం

Panthagani Anusha
12 అక్టోబర్, 2025

కాన్పూర్ నగరంలోని పింకీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోరాంగ్ మండి దగ్గర శనివారం ఉదయం 8:30 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో రైల్వే ప్రాజెక్ట్‌కు చెందిన ఒక ముఖ్యమైన స్టోర్‌హౌస్ తోపాటు దాని పక్కనే ఉన్న పాత ఇనుము సామగ్రి (స్క్రాప్) గోడౌన్ మంటల్లో కాలిపోయాయి. పెద్ద ఎత్తున చెలరేగిన మంటల కారణంగా కోట్లల్లో ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు అని అధికారులు అంచనా వేశారు.

ఆకాశాన్ని కమ్మేసిన నల్లటి పొగ

ప్రమాదం జరిగిన వెంటనే అగ్ని జ్వాలల నుంచి వెలువడిన దట్టమైన, నల్లటి పొగ ఆకాశంలో చాలా వరకు కమ్ముకున్నాయి. గోడౌన్‌లో నిల్వ ఉన్న ప్లాస్టిక్, రబ్బర్ ఇతర రసాయనాలతో కూడిన స్క్రాప్ మెటల్ దహనం కావడం వల్లే పొగ తీవ్రత అధికంగా ఉన్నట్లు అగ్నిమాపక దళం గుర్తించింది.

జేసీబీలతో శిథిలాల తొలగింపు

మంటలు భారీ ఎత్తున చెలరేగడంతో వాటిని నియంత్రించడానికి బహుళ అగ్నిమాపక యంత్రాలను హుటాహుటిన సంఘటనా స్థలానికి పంపించారు. అగ్నిమాపక సిబ్బంది గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ ఆపరేషన్‌లో, భవన శిథిలాలను, కాలిపోయిన సామాగ్రిని తొలగించడానికి జేసీబీ యంత్రాలను ఉపయోగించారు.

ఈ ఘటనపై అగ్నిమాపక అధికారి కైలాష్ చంద్ర మాట్లాడుతూ ప్రస్తుతం మంటలు పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్లు ఆయన తెలిపారు. అయితే అగ్ని మాపక సిబ్బంది అవిశ్రాంత కృషి ఫలితంగానే ప్రమాదం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగామని ఆయన స్పష్టం చేశారు.

అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు, ప్రాణనష్టం జరగలేదని అధికారులు నిర్ధారించారు. ఈ భారీ అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. సంఘటనకు గల కారణాలను తెలుసుకోవడానికి సమగ్ర దర్యాప్తు చేయాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్, ఇతరత్రా కారణాలు ఏవైనా ఉండవచ్చు, అని అధికారి కైలాష్ చంద్ర అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు నష్టపోయిన ఆస్తుల పూర్తి వివరాలు అంచనా ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.

కాన్పూర్‌లో భారీ అగ్నిప్రమాదం - Tholi Paluku