Let's talk: editor@tmv.in
కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల భారీ విరాళం

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల భారీ విరాళం

Gaddamidi Naveen
28 ఫిబ్రవరి, 2026

తెలంగాణ‌లో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ మానవతా దృక్పథంతో అండగా నిలిచింది. తమ ఒకరోజు పెన్షన్‌ను విరాళంగా సమీకరించి మొత్తం రూ.2.80 లక్షల చెక్కును రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సౌమ్య విధి నిర్వహణలో చూపిన ధైర్యసాహసాలు ఎక్సైజ్ శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే సౌమ్య కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సహాయం మంజూరు చేయడంతో పాటు, ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించినట్లు గుర్తుచేశారు. భవిష్యత్తులో కూడా కుటుంబానికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

మాదకద్రవ్యాలు, అక్రమ మద్యంపై ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై రాజీ పడబోమని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాఖ పరిపాలనా పరమైన అంశాలపై కూడా దృష్టి సారించిన మంత్రి, వారంలోగా సుమారు 2,500 మంది ఎక్సైజ్ కానిస్టేబుళ్ల బదిలీలు పూర్తి చేస్తామని వెల్లడించారు.

ఇటీవల జరిగిన కుమ్మెర జాతర ఘటనపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసినట్లు మంత్రి తెలిపారు. అదేవిధంగా, రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి పేర్కొన్నారు. నూతన పర్యాటక విధానంతో వాటర్ స్పోర్ట్స్, ఎకో టూరిజం, వెల్నెస్ టూరిజం రంగాలను ప్రోత్సహిస్తూ, రాష్ట్రాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.