Let's talk: editor@tmv.in
కాదేది కల్తీకి అనార్హం

కాదేది కల్తీకి అనార్హం

Dantu Vijaya Lakshmi Prasanna
25 ఫిబ్రవరి, 2026

రాజమహేంద్రవరం నగర శివార్లలో వెలుగుచూసిన కల్తీ పాల దుర్ఘటన తెలుగు రాష్ట్రాల్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఆరోగ్యానికి ప్రతీకగా భావించే పాలు, ఇక్కడ ‘తెల్లటి విషం’గా మారి ప్రాణాలు తీసిన తీరు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అనధికార విక్రేత సరఫరా చేసిన కల్తీ పాలను సేవించి వృద్ధులు ప్రాణాలు కోల్పోవడం, చిన్నారులు సహా పలువురు ఆస్పత్రుల్లో మృత్యువుతో పోరాడటం, ఇవి కేవలం ఒక ప్రాంతానికి పరిమితమైన విషాదం కాదు. ఇది మన వ్యవస్థలో ఉన్న లోతైన లోపాలకు, నిర్లక్ష్యానికి, నిరంతర పర్యవేక్షణ లేకపోవడానికి అద్దం పట్టిన ఘటనా పరంపర.

ఆహార భద్రత ఎక్కడ విఫలమైంది? నియంత్రణ వ్యవస్థలు ఎందుకు ముందే అప్రమత్తం కాలేకపోయాయి? బాధ్యులు ఎవరు? ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వ్యవస్థలు ఎందుకు స్పందించలేకపోయాయి? ఈ ప్రశ్నలు ఒక్కొక్కటిగా మన ముందుకొస్తున్నాయి. ఈ ప్రత్యేక కథనం మన నిత్యజీవితంలో కల్తీ ఎలా మెల్లగా పాతుకుపోయిందో విశ్లేషించే ప్రయత్నం.

అనుమానపు నీడలో నిత్యజీవితం

ఈరోజు మనం వినియోగించే దాదాపు ప్రతి వస్తువుపై ఒక అనుమానపు నీడ కమ్ముకుంది. కూరగాయల నుంచి ధాన్యాల వరకూ, నీటి నుంచి ఔషధాల వరకూ.. ఏది స్వచ్ఛమో, ఏది కల్తీయో చెప్పలేని స్థితికి సమాజం చేరింది. లాభమే లక్ష్యంగా కొందరు మనిషి ప్రాణాల విలువను విస్మరిస్తూ, నిత్యావసరాలనే విషపూరితంగా మార్చుతున్నారు. కల్తీ ఇక అరుదైన నేరం కాదు. అది నిత్యజీవితంలో మెల్లగా కలిసిపోయిన ఒక సాధారణ ప్రమాదంగా మారిపోయింది.

ఈ నేపథ్యంలో ‘పాలు’ కూడా కల్తీకి అనర్హమన్న నమ్మకాన్ని రాజమహేంద్రవరం ఘటన పూర్తిగా చెదరగొట్టింది. శిశువు నుంచి వృద్ధుడి వరకు అందరూ విశ్వసించే ఈ తెల్లటి ద్రవం ప్రాణాంతకంగా మారిన వేళ, ఆహార భద్రతపై మన భరోసా మొత్తం కూలిపోయింది. రోజూ తాగే పాలే మృత్యువుకు కారణమైతే, ఇక మనం నమ్మి తినేది ఏమిటి? నిత్యజీవితమంతా కల్తీతోనే నడుస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతి ఇంటి గుమ్మం వద్ద నిలబడి సమాధానం కోరుతున్నాయి.

పాలు, నీళ్లే కాదు… భక్తి, విశ్వాసంతో స్వీకరించే ప్రసాదం కూడా కల్తీ ఆరోపణల నీడలోకి రావడం ఈ కాలపు దురదృష్టం. తిరుపతి లడ్డు ఘటన దీనికి స్పష్టమైన ఉదాహరణ. కోట్లాది భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూపై అనుమానాలు వెల్లువెత్తినా, అసలు నిజం ఏమిటన్నది ఇప్పటికీ పూర్తిగా కొలిక్కి రాలేదు. విచారణలు, ప్రకటనలు, ఖండనలు అన్నీ జరిగాయి. కానీ ప్రజల మనసుల్లో పుట్టిన సందేహానికి మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం దొరకలేదు. ఇది కేవలం ఒక ప్రసాదం విషయం కాదు. అది భక్తుల నమ్మకాన్ని గాయపరిచిన ఘటన.

ఇక్కడే అసలు ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి మనం దేన్ని నమ్మాలి? ఆరోగ్యానికి పాలు సురక్షితం కాదనిపిస్తే, ఆహారంపై అనుమానం వస్తే, చివరకు దేవుడి ప్రసాదంపైనా సందేహం కలిగితే… సామాన్యుడి విశ్వాసానికి ఆధారం ఏముంటుంది? కల్తీ అనేది మార్కెట్‌కే పరిమితమైందన్న భావనను ఈ ఘటనలు పూర్తిగా కూల్చేశాయి. నమ్మకం కూలిన చోట భయం పుడుతుంది. ఆ భయాన్ని తొలగించాల్సిన బాధ్యత వ్యవస్థలదే. నిజాలు ఎప్పటికీ దాచిపెట్టకుండా, స్పష్టంగా బయటపెట్టినప్పుడే ప్రజలు మళ్లీ నమ్మడం మొదలుపెడతారు. లేదంటే “దేన్ని నమ్మాలి?” అనే ప్రశ్న ప్రతి మనసులో నిశ్శబ్దంగా మోగుతూనే ఉంటుంది.

ముందే ఎందుకు గుర్తించలేకపోతున్నాం?

ఈ ప్రశ్నకు మొదటి సమాధానం అవగాహన లోపం. నిత్యజీవితంలో మనం వినియోగించే వస్తువుల పట్ల సరైన అవగాహన ఇప్పటికీ చాలా మందిలో లేదు. కల్తీ అనేది పెద్ద పరిశ్రమలు, పెద్ద వ్యాపారులకే పరిమితమన్న భావన, చిన్న సరఫరాదారులపై అంధ విశ్వాసం ఉంచే మనస్తత్వం ఇప్పటికీ కొనసాగుతోంది. పాలు, నీరు, కూరగాయలు వంటి నిత్యావసరాల్లోనూ కల్తీ ఉండొచ్చన్న ఆలోచనే చాలామందికి రాదు. లక్షణాలు కనిపించినా వాటిని సాధారణ అనారోగ్యంగా భావించడం, అసలు కారణాన్ని గుర్తించేలోపే పరిస్థితి చేజారిపోవడం, ఇదే పదే పదే జరుగుతోంది. అవగాహన లోపమే కల్తీ మృగానికి తొలి తలుపుగా మారుతోంది.

‘మనకెందుకు’ అనే ధోరణి

అవగాహనతో పాటు మరో పెద్ద సమస్య పిర్యాదు చేయలేని, చేయకూడదన్న భావన. ఎవరైనా అనుమానించినా ఎక్కడ ఫిర్యాదు చేయాలి? ఎవరు స్పందిస్తారు? ఫలితం ఉంటుందా? అనే సందేహాలు ప్రజలను వెనక్కి నెడుతున్నాయి. “చిన్న వ్యాపారి కదా”, “మనకెందుకు గొడవలు”, “ఇన్నాళ్లూ ఇదే వస్తోంది” అనే భావనతో చాలామంది మౌనంగా మింగేస్తున్నారు. ‘మనకెందుకు’ అనే ఈ ధోరణే కల్తీకి బలం చేకూరుస్తోంది. ఒక్కరి మౌనం వందల మందికి ప్రమాదంగా మారుతుందన్న సత్యాన్ని సమాజం ఇంకా పూర్తిగా గ్రహించలేకపోతోంది.

కాగితాలకే పరిమితమైన వ్యవస్థ

ఇవన్నీ కలిసివచ్చి పర్యవేక్షణలోపాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. తనిఖీలు, నమూనాల సేకరణ, లైసెన్సుల పర్యవేక్షణ ఇవన్నీ కాగితాలకే పరిమితమవుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. అధికారులు స్పందించేలోపే ప్రాణాలు పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కల్తీపై పోరాటం కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. అవగాహన కలిగిన పౌరులు, స్పందించే వ్యవస్థలు, కఠిన పర్యవేక్షణ ఈ మూడూ కలిసి పనిచేసినప్పుడే నిత్యజీవితంలో విషమవుతున్న కల్తీని అడ్డుకోవడం సాధ్యం.

పాల కల్తీ ఈరోజు మొదలైన సమస్య కాదు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పాత ముప్పే. యూరియా, సోడా, డిటర్జెంట్ పొడి, సోడా ఆయిల్ వంటి పదార్థాలు కలిపి పాల పరిమాణాన్ని పెంచుతూ లాభాలు గడించే దందా ఎన్నోసార్లు బయటపడింది. గతంలో పలు రాష్ట్రాల్లో యూరియా కలిపిన పాలు తాగి చిన్నారులు అస్వస్థతకు గురైన ఘటనలు, డిటర్జెంట్ కలిపిన పాలతో వాంతులు, విరేచనాలు వచ్చిన ఉదంతాలు నమోదయ్యాయి. అయినప్పటికీ, ఈ ఉదాహరణలు పాఠాలుగా మారకపోవడం కల్తీ మృగానికి మరింత ధైర్యం ఇచ్చింది.

రుజువైన నేరాలు, మళ్లీ మళ్లీ అదే కథ

పాలకల్తీ కేవలం అనుమానం కాదు. పలుమార్లు రుజువైన నేరం. 2023లో మీరట్ పరిధిలో పోలీసులు పట్టుకున్న నకిలీ పాల తయారీ కేంద్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. యూరియా, డిటర్జెంట్, సోడా వంటి రసాయనాలతో రోజుకు వేల లీటర్ల నకిలీ పాలు తయారు చేసి సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే దాడులు, అరెస్టులు జరిగాయి. కానీ కొన్ని వారాలకే తనిఖీల తీవ్రత తగ్గిపోయిందన్న విమర్శలు వినిపించాయి.

అదే విధంగా 2022లో హైదరాబాద్ శివార్లలో అనధికార డెయిరీలపై దాడులు జరిగాయి. సోడా ఆయిల్, కెమికల్స్ కలిపిన పాలను స్వాధీనం చేసుకున్నారు. మీడియా దృష్టి ఉన్నంతవరకూ చర్యలు కనిపించాయి. ఆ తర్వాత అదే ప్రాంతాల్లో లైసెన్స్ లేని సరఫరా మళ్లీ మొదలైందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ ఉదాహరణలు ఒకే నిజాన్ని చెబుతున్నాయి. సమస్య వచ్చినప్పుడు మాత్రమే వ్యవస్థ మేల్కొంటుంది; ఆ తర్వాత మళ్లీ నిద్రలోకి జారుతుంది.

హోటళ్లలోనూ అదే కథ

ఇది ఒక్క పాలకే పరిమితం కాదు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లలో జరిగిన తనిఖీలు మరో చేదు నిజాన్ని బయటపెట్టాయి. స్టార్ హోటళ్లతో పాటు చిన్న భోజనశాలల్లోనూ కుళ్లిన కూరగాయలు, పాత మాంసం, గడువు ముగిసిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. హోటళ్లు సీజ్ అయ్యాయి, ఆహారం పారబోసారు, లైసెన్సులు రద్దయ్యాయని ప్రకటనలు వచ్చాయి. కానీ ప్రజల ఆగ్రహం చల్లారిన తర్వాత, కేవలం చిన్నపాటి జరిమానాలతోనే చాలా హోటళ్లు నెలరోజుల్లోనే మళ్లీ తెరుచుకున్నాయి. చర్యలు తాత్కాలికం, పర్యవేక్షణ మాత్రం శాశ్వతంగా లేదు. ఇదే నిజం.

లేబుల్ లేని నిత్యవసరాలు

నిత్యవసరాలకు మ్యానుఫ్యాక్చరింగ్ లేబుల్ లేకపోవడం మరో తీవ్రమైన సమస్య. పాలు, పెరుగు, నూనె, మసాలాలు, తినుబండారాలు, చాలా ఉత్పత్తులు లేబుల్ లేకుండానే మార్కెట్‌లోకి వస్తున్నాయి. తయారీ తేదీ ఎప్పటిది, ఎంతకాలం వాడుకోవచ్చు, ఎక్కడ తయారయ్యాయి, ఎవరి బాధ్యతలో ఉన్నాయి అనే కనీస సమాచారం కూడా లేకపోవడం వల్ల వినియోగదారుడు పూర్తిగా అంధుడిగా మారుతున్నాడు. లేబుల్ లేకపోతే ప్రశ్నించడానికి ఆధారం ఉండదు, ప్రమాదం జరిగితే బాధ్యత వహించాల్సిన వారు తప్పించుకునే పరిస్థితి ఏర్పడుతుంది.

ఇది కేవలం వినియోగదారుల నిర్లక్ష్యం కాదు, వ్యవస్థాగత వైఫల్యానికి ప్రతీక. నిత్యవసరాలకు కూడా తప్పనిసరిగా మ్యానుఫ్యాక్చరింగ్ లేబుల్ ఉండాలన్న నియమాల అమలు క్షేత్రస్థాయిలో సరిగా జరగడం లేదు. “ఇన్నాళ్లూ ఇదే వాడుతున్నాం”, “ఇప్పటివరకు ఏం కాలేదు” అనే అలవాటు ప్రజలను నిర్లక్ష్యానికి అలవాటు చేస్తే, పర్యవేక్షణ లోపం వ్యాపారులకు ధైర్యం ఇస్తోంది. ఫలితంగా నిత్యవసరాలే నిశ్శబ్ద ప్రమాదాలుగా మారుతున్నాయి. స్పష్టమైన లేబులింగ్, కఠిన తనిఖీలు, ప్రజల్లో ప్రశ్నించే ధైర్యం ఇవి లేకపోతే కల్తీపై పోరాటం మాటలకే పరిమితం అవుతుంది.

ఒకవేళ లేబుల్ ఉన్నా సమస్య తీరడం లేదు. కల్తీ సమస్యకు మరో మౌన కారణం కార్పొరేట్ నిర్లక్ష్యమే. చాలా కంపెనీలు ఉత్పత్తులపై కీలక సమాచారం ఉండాల్సిన లేబుళ్లను అతి చిన్న అక్షరాల్లో ముద్రించడం వల్ల సాధారణ వినియోగదారులకు అవి చదవడం కష్టంగా మారుతోంది. తయారీ తేదీ, వినియోగ గడువు, పదార్థాల వివరాలు, హెచ్చరికలు ఇవన్నీ స్పష్టంగా కనిపించాల్సినవి. కానీ లేబుల్ ఉన్నంత మాత్రాన బాధ్యత తీరినట్టుగా వ్యవహరించడం వల్ల, వినియోగదారుడు తెలియకుండానే ప్రమాదాన్ని ఇంటికి తెచ్చుకుంటున్నాడు.

దీనికి తోడు చాలామందికి పూర్తిగా చదవడం రాకపోవడం లేదా సాంకేతిక పదాలు అర్థం కాకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. చదవలేని వారు అడగడానికి సంకోచించడం, చదవగలిగినా అర్థం కాని పదాలను పట్టించుకోకపోవడం వల్ల లేబుల్ ప్రయోజనం నశిస్తోంది. అవగాహన, చదవగల సామర్థ్యం, స్పష్టమైన సమాచారం ఈ మూడింటిలో ఏ ఒక్కటి లోపించినా అది కల్తీకి, ఆరోగ్య ప్రమాదాలకు దారి తీస్తోంది. వినియోగదారుడి భద్రత కోసం లేబుళ్లు కేవలం చట్టపరమైన ఫార్మాలిటీగా కాకుండా, ప్రతి ఒక్కరికీ స్పష్టంగా అర్థమయ్యేలా ఉండాలన్న ఆలోచన ఇప్పుడెంతో అవసరం. లేబుల్ చట్టపరమైన ఫార్మాలిటీగా కాకుండా, ప్రజల భద్రత కోసం మరింత స్పష్టంగా ఉండాలి.

ప్రయోగశాలలు (ల్యాబ్‌లు) లేకపోవడం

ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన వ్యవస్థలో ఇప్పటికీ కీలక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చాలా జిల్లాల్లో సరిపడా ప్రయోగశాలలు (ల్యాబ్‌లు) లేకపోవడం వల్ల నమూనాలు సేకరించినా వాటి పరీక్షలకు రోజులు, కొన్ని సందర్భాల్లో వారాల సమయం పడుతోంది. అప్పటివరకు నివేదికలు (రిపోర్టులు) ఆలస్యమవుతాయి, అనుమానాస్పద ఆహారం లేదా మందులు మార్కెట్‌లోనే తిరుగుతూనే ఉంటాయి. నివేదిక వచ్చేసరికి నష్టం జరిగిపోయి, ప్రాణాలు పోయిన తర్వాత చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

ఈ కల్తీ ఒక ప్రాంతం కథ కాదు. ఇది మనందరి కథ. మనం రోజూ తాగే పాలు, తినే ఆహారం, నమ్మే వ్యవస్థ ఇవన్నీ మన ప్రాణాలతో ముడిపడి ఉన్నాయి. కానీ లాభం కోసం ప్రాణాలను తాకట్టు పెట్టే దందా, నిర్లక్ష్యానికి అలవాటుపడ్డ వ్యవస్థ, ప్రశ్నించడానికి భయపడే సమాజం, ఈ మూడూ కలిసినప్పుడే ఇలాంటి విషాదాలు పునరావృతమవుతున్నాయి. దీన్ని తగ్గించాలంటే ప్రభుత్వం కొత్త ఆలోచనలతో మేల్కోవాలి.

మొబైల్ పరీక్షా వాహనాలు

దీనంతటికి పరిష్కారంగా, ఈ లోటును భర్తీ చేయడానికి, మొబైల్ పరీక్షా వాహనాలు అందుబాటులోకి రావాలి. ఇవి నిఘా వ్యవస్థలా నిరంతరం పనిచేయాలి. ఎక్కడికక్కడ అనుమానం రాగానే అధికారులు తనిఖీలు చేయగలగాలి. అక్కడికక్కడే ప్రాథమిక పరీక్షలు చేసి, రిపోర్ట్ వెంటనే వచ్చే సౌకర్యం ఉండాలి. మొబైల్ పరిశీలన, పరీక్షా వాహనాలు క్షేత్రస్థాయిలో అందుబాటులోకి వస్తే హోటళ్లలో, డెయిరీల్లో, మార్కెట్లలో అక్కడికక్కడే పరీక్షలు చేసే సదుపాయం ఉంటే, అనుమానాస్పద ఉత్పత్తులను వెంటనే అడ్డుకోవచ్చు. నమూనాలు ల్యాబ్‌కు వెళ్లేలోపు వ్యాపారం సాగకుండా, తక్షణ హెచ్చరికలు జారీ చేసే విధానం ఏర్పడుతుంది. ఇది నివారణకు తొలి అడుగు.

అదే సమయంలో శిక్షలు వెంటనే అమలుకావడం అత్యంత కీలకం. సంవత్సరాల తరబడి కేసులు నడవడం, జరిమానాలు నామమాత్రంగా ఉండడం వల్ల కల్తీదారులకు భయం లేకుండా పోయింది. తప్పు తేలిన వెంటనే లైసెన్స్ రద్దు, వ్యాపారం మూసివేత, క్రిమినల్ కేసులు వంటి కఠిన చర్యలు అమలులోకి రావాలి. శిక్ష వేగంగా, స్పష్టంగా పడితేనే కల్తీపై అడ్డుకట్ట సాధ్యం. ఆలస్యం అంటేనే ప్రమాదం. ఈ సత్యాన్ని వ్యవస్థ ఇకనైనా గుర్తించాల్సిన సమయం వచ్చింది. అప్పుడే వ్యాపారస్తుల్లో కల్తీ అనే భావన తగ్గుతుంది, భయమే మనిషిని నిజాయితీగా మారుస్తుంది.

ప్రాణాలకు ధర లేదు. ధర లేనివి విలువలేనివిగా కూడా మారితే, సమాజం మూల్యం చెల్లించాల్సిందే. కల్తీపై పోరాటం నినాదంగా కాకుండా, నిత్యబాధ్యతగా మారిన రోజే ఈ తెల్లటి విషం నుంచి మన జీవితాలు బయటపడతాయి. అప్పటివరకు ప్రతి పాల చుక్క, ప్రతి రొట్టె ముక్క, మన మనస్సులో ఒకే ప్రశ్నను మిగులుస్తూనే ఉంటుంది, “ఇది నిజంగా సురక్షితమేనా?”అని ..

కాదేది కల్తీకి అనార్హం - Tholi Paluku