
కాటేస్తోన్న ‘క్యాన్సర్’ రాకాసి
ప్రతిరోజూ 3,000 మంది.. ప్రతి గంటా 125 మంది.. ప్రతి పది మందిలో ఆరుగురు క్యాన్సర్‌కు బలైపోతున్నారని తెలుసా? మన రక్తంలో, మన శరీరంలో, మన ఊపిరిలో నిశ్శబ్దంగా క్యాన్సర్‌పై పోరు జరుగుతోంది. 2050 నాటికి ఇండియా క్యాన్సర్ కు అడ్డాగా మారనుంది. వైద్య శాస్త్రం ఎంత అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ ప్రతి ఐదుగురులో ముగ్గురు క్యాన్సర్‌కు చనిపోతున్నారని నివేదికలు చెబుతున్నాయ్. 3 దశాబ్దాల కాలంలో క్యాన్సర్ బాధితులతో పాటు మృతుల సంఖ్య భారీగా పెరిగిందని 'ది లాన్సెట్ జర్నల్'లో ప్రచురితమైన ఓ స్టడీ స్పష్టం చేసంది. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ క్యాన్సర్ లేబొరేటరీ రిపోర్టు ద్వారా ఈ సమాచారం బయటకు వచ్చింది. అమెరికా, చైనా లాంటి దేశాల్లో క్యాన్సర్ ప్రభావం తగ్గుతుండగా.. ఇండియాలో మాత్రం ప్రతి సంవత్సరం మహమ్మారి విస్తరిస్తోంది.
నిజానికి మన దగ్గర అత్యాధునిక ఆసుపత్రులు, మోడ్రన్ టెక్నాలజీ, మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నా, కేసులు తగ్గకపోవడం, మరణాల సంఖ్య పెరగడం ఒక పెద్ద సమస్యగా మారింది. 1990లో ప్రతి 1,00,000 మందిలో 84.8 క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. అయితే 2023 నాటికి ఈ సంఖ్య 107.2కి పెరిగింది. అదే సమయంలో మరణాల రేటు కూడా 71.7 నుంచి 86.9కి పెరిగింది. అంటే కొత్త కేసులు 26 శాతం పెరిగాయి, దాదాపు 15 లక్షల కొత్త కేసులు వచ్చాయి. మరణాల సంఖ్య కూడా 21 శాతం పెరిగి, 12 లక్షల ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు చైనా, అమెరికా వంటి దేశాల్లో గత 33 ఏళ్లలో క్యాన్సర్ కేసులు తగ్గాయి. చైనాలో 18.5 శాతం, అమెరికాలో 20 శాతం వరకు తగ్గుదల కనిపించింది. ఇది ఎందుకు సాధ్యమైందంటే, అక్కడ ప్రభుత్వాలు చాలా కఠినమైన చట్టాలను అమలు చేశాయి. పొగాకు వాడకాన్ని బాగా తగ్గించారు. వ్యాక్సిన్‌ల ద్వారా హెచ్‌పీవీ, హెపటైటిస్ బి లాంటి వైరస్‌లను అరికట్టారు. స్క్రీనింగ్ ప్రోగ్రామ్‌లతో క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారత్ వంటి మధ్య ఆదాయం కలిగిన దేశాల్లో జనాభా పెరుగుతుండటం, వృద్ధాప్యం ఎక్కువవడం వల్ల కేసులు, మరణాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి.
అలాగే మన దైనందిన అలవాట్ల మార్పులు కూడా పెద్ద సమస్యగా మారాయి. ఎక్కువగా పొగాకు వాడటం, గుట్కా నమలడం, సిగరెట్ తాగడం వల్ల ఊపిరితిత్తుల, నోటి, గొంతు క్యాన్సర్లు వస్తున్నాయి. జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల పేగు క్యాన్సర్లు పెరుగుతున్నాయి. స్థూలకాయం కారణంగా రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్లు ఎక్కువవుతున్నాయి. మద్యం ఎక్కువగా తాగడం వల్ల కూడా నోటి, గొంతు, కాలేయ క్యాన్సర్లు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. అంటే మన జీవన శైలి మార్పులు క్యాన్సర్‌ను మరింత ప్రోత్సహిస్తున్నాయి.
ఇక కిడ్నీ క్యాన్సర్ విషయానికి వస్తే, ఇది ప్రపంచవ్యాప్తంగా మెల్లిగా వ్యాప్తి చెందుతోంది. రానున్న 25 ఏళ్లలో కిడ్నీ క్యాన్సర్ కేసులు రెట్టింపు అయ్యే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రతి సంవత్సరం లక్షలాది మంది దీనికి బలవుతున్నారు. 2050 నాటికి ఈ వ్యాధి కారణంగా 3 లక్షల మరణాలు జరగవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 5 నుంచి 8 శాతం వరకు కిడ్నీ క్యాన్సర్ కేసులు వారసత్వ కారణాల వల్ల వస్తున్నాయి. కానీ చాలా వరకు జీవన విధానం, ఆహారపు అలవాట్లే ప్రధాన కారణం. అందుకే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అని చెబుతున్నారు వైద్యులు.
నిత్యం ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. స్త్రీలలో బ్రెస్ట్, గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ తప్పనిసరి. ఇటు జీవనశైలిని మార్చుకోవాల్సిందే. ఫాస్ట్ ఫుడ్‌కు గుడ్‌బై చెప్పాలి. వ్యాయామం చేయాలి, ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఇటు కాలుష్యాన్ని నియంత్రించాలి. పరిశ్రమలు, ట్రాఫిక్ పొగను తగ్గించేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి. ఇకప్రభుత్వం ప్రత్యేక క్యాన్సర్ ఆసుపత్రులను పెంచాలి. గ్రామీణ ప్రాంతాల్లో స్క్రీనింగ్ సెంటర్లు ఎక్కువగా ఏర్పాటు చేయాలి. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి. ఇక క్యాన్సర్ చికిత్స చాలా ఖరీదైనది. ప్రభుత్వం ఆరోగ్య బీమా విధానాలను బలోపేతం చేయాలి. క్యాన్సర్ గురించి ఆలోచించాల్సిన సమయం రేపు కాదు.. ఇప్పుడే అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి! లేదంటే 2050 నాటికి ఇండియా మరణపు చితిలో తగలపడిపోవాల్సి రావొచ్చు.
