Let's talk: editor@tmv.in
కాజీరంగాలో కొత్త సర్వే ఫలితాలు.. వెలుగులోకి అరుదైన చేపలు, కప్పలు, సరీసృపాలు

కాజీరంగాలో కొత్త సర్వే ఫలితాలు.. వెలుగులోకి అరుదైన చేపలు, కప్పలు, సరీసృపాలు

Pinjari Chand
7 నవంబర్, 2025

దేశంలోనే ప్రముఖ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ఉన్న కాజీరంగా నేషనల్ పార్క్ మరో ప్రత్యేకమైన విషయాన్ని సొంతం చేసుకుంది. చేపలు, కప్పలు, సరీసృపాల వైవిధ్యంపై తాజాగా నిర్వహించిన సర్వే ఫలితాలను పార్క్ అధికారులు గురువారం విడుదల చేశారు.

జూలై నుంచి సెప్టెంబర్ 2025 మధ్య కాలంలో వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తల సహకారంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో 77 రకాల స్వచ్ఛ జల చేపలను గుర్తించారు. ఇవి అస్సాంలోని 216 దేశీయ చేపలలో ప్రధాన భాగం కాగా, ఈశాన్య భారతదేశంలోని 422 స్థానిక చేపలలో కీలక వాటా కలిగి ఉన్నాయని అధికారులు తెలిపారు.ఈ ప్రాంతం 108 రకాల కప్పలు, సరీసృపాలకు నివాసంగా ఉంది. ఇది ఈశాన్య భారతదేశంలో ఉన్న మొత్తం 274కు పైగా జాతులలో సగానికి పైగా. ఇది కాజీరంగా ప్రకృతి వైవిధ్యానికి ప్రతీక అని కాజీరంగా ఫీల్డ్ డైరెక్టర్ డాక్టర్ సోనాలీ ఘోష్ అన్నారు. ఈ సర్వే ద్వారా చేపలు, సరీసృపాలు, ఉభయచరాల ఉనికి కాజీరంగా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె వివరించారు.

ఈ నివేదికతో పాటు కాజీరంగా వార్షిక నివేదికను, డాక్టర్ తప్తి బరువా కాశ్యప్ రాసిన కవితా సంకలనాన్ని కూడా నవంబర్ 2న కోహోరా కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో అస్సాం పర్యావరణ, అటవీ శాఖ మంత్రి చంద్ర మోహన్ పాటో విడుదల చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సోషల్ మీడియాలో స్పందించారు. కాజీరంగా అటవీ ప్రాంతం మన అస్సాం ప్రాణాధారం. ఈ గ్రీన్ ఏరియాలో 108 రకాల ఉభయచరాలు, సరీసృపాలు ఉన్నట్లు గుర్తించడం మన అటవీ శాఖ శ్రమకు నిదర్శనం అని ప్రశంసించారు.

నియంత్రణ లేని చేపల వేట ప్రమాదకరం:డాక్టర్ సోనాలీ ఘోష్

ఇప్పటివరకు గుర్తించిన మొత్తం చేపల జాతులు 77కు చేరుకున్నాయి. వీటిలో వల్లాగో అట్టు (వియూ), పరంబాసిస్ లాలా (ఎన్టీ) వంటి అరుదైన జాతులు ఉన్నాయి. పర్యావరణ మార్పులు, సిల్టేషన్, నియంత్రణ లేని చేపల వేట వంటి అంశాలు వీటికి ప్రమాదకరమవుతున్నాయి. దీర్ఘకాలిక పరిరక్షణ చర్యలు అవసరం అన్నారు. కాజీరంగా, వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా విడుదల చేసిన మరో నివేదిక ‘హెర్పెటోఫౌనల్ డైవర్సిటీ అట్ కాజీరంగా’లో 31 కొత్త జాతులను గుర్తించారు. వీటిలో 17 కప్పలు, 14 సరీసృపాలు ఉన్నాయి. అధ్యయనంలో ఏఐ ఆధారిత శబ్ద రికార్డింగ్ (ప్యాసివ్ అకౌస్టిక్ మానిటరింగ్) పద్ధతిని ఉపయోగించి కప్పల స్వరాలను గుర్తించి వీటి విస్తృతి, ప్రధాన స్థలాలను నిర్ధారించారు. ఇప్పటివరకు కాజీరంగాలో నమోదైన మొత్తం ఉభయచరాలు, సరీసృపాల సంఖ్య 108కు చేరింది. వీటిలో కింగ్ కోబ్రా, అస్సాం రూఫ్డ్ టర్టిల్, ఆసియన్ బ్రౌన్ టార్టాయిస్, స్ట్రైప్డ్ సేసిలియన్, నిల్‌సోనియా నిగ్రికాన్స్, వరానస్ ఫ్లావెసెన్స్ వంటి ప్రమాదంలో ఉన్న జాతులు ఉన్నాయి. కాజీరంగా నదీ, అటవీ ప్రాంతాల మేళవింపుతో ఏర్పడిన ఈ ప్రకృతి వ్యవస్థ జీవ వైవిధ్యానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇది భవిష్యత్ తరాలకు పర్యావరణ పాఠశాలగా నిలుస్తుంది అని తెలిపారు.