
కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం గ్రామం సమీపంలోని జాతీయ రహదారి–16 పై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో విశాఖపట్నం నుండి జగ్గంపేట వైపు వేగంగా వెళ్తున్న ఒక స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్ దాని ముందు వెళ్తున్న ఒక మోటార్‌సైకిల్‌ను, రిక్షా వాహనాన్ని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
ఢీకొన్న వేగం అధికంగా ఉండటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, మరొక వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. గాయపడిన మిగతా ముగ్గురు వ్యక్తులను తక్షణమే సమీప దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ బిందు మాధవ గరికపాటి తెలిపిన వివరాల ప్రకారం , కారు నడుపుతున్న డ్రైవర్ జోగారావు విశాఖపట్నంలో జరిగిన కుటుంబ వివాహ కార్యక్రమం హాజరై తిరిగి వస్తుండగా అలసటతో నిద్రమత్తులో వాహనం నియంత్రణ కోల్పోయినట్లు తెలిపారు. కాగా ఘటనలో మృతి చెందిన వారు సోమవరం గ్రామానికి చెందిన మోర్టా ఆనంద కుమార్ (60), యలేశ్వరం గ్రామానికి చెందిన కాకాడ రాజు (60), సోమవరం గ్రామానికి చెందిన మోర్టా కొండయ్య (31)గా గుర్తించారు.
కాగా కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ కుటుంబ సభ్యలకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన డ్రైవర్ జోగారావును అదుపులోకి తీసుకున్నారు. హైవేపై నిర్లక్ష్యపు డ్రైవింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
