
కాకినాడ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం
కాకినాడ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలం వేట్లపాలెం సమీపంలోని 'సూర్య బాణసంచా' తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడులో 21 మంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఎనిమిది మంది తీవ్ర గాయాలతో మృత్యువుతో పోరాడుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా సంభవించిన ఈ పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది మృతదేహాలు ఛిన్నాభిన్నమై కిలోమీటరు మేర సమీపంలోని వరి పొలాల్లోకి ఎగిరిపడ్డాయి.
సాధారణంగా పనుల్లో నిమగ్నమైన కార్మికులు క్షణం గడవకముందే మంటల్లో చిక్కుకున్నారు. యూనిట్‌లో సుమారు 30 మంది కార్మికులు పనిచేస్తుండగా భారీ ఎత్తున నిల్వ ఉన్న మందుగుండు సామాగ్రికి నిప్పు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ "చిన్న నిప్పురవ్వే ఇంతటి పెను ప్రమాదానికి కారణమై ఉండవచ్చు. అక్కడ భారీగా నిల్వ ఉన్న పేలుడు పదార్థాల వల్ల ఎవరూ తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది" అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులంతా రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబాలకు చెందిన వారని ఆయన పేర్కొన్నారు.
ఛిన్నాభిన్నమైన శరీర భాగాలు.. డ్రోన్లతో గాలింపు
పేలుడు ధాటికి పచ్చని వరి పొలాలు రక్తసిక్తమయ్యాయి. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోగా శరీర భాగాలు దూరంగా విసిరివేయబడ్డాయి. పొలాల్లో పడిపోయిన శరీర భాగాలను గుర్తించేందుకు పోలీసులు డ్రోన్లను రంగంలోకి దించారు. స్థానికులు, సహాయక సిబ్బంది కలిసి బరకాలు, ఎరువుల సంచులలో శరీర భాగాలను సేకరించి తరలించడం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పట్టింది. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వారికి 90 నుంచి 100 శాతం కాలిన గాయాలయ్యాయని కాకినాడ జీజీహెచ్ వైద్యులు తెలిపారు.
ప్రధాని, ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన
ఈ ఘోర ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సహాయ నిధి నుంచి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున సహాయాన్ని ప్రధాని ప్రకటించారు. ఘటనపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంలో 9 మంది మహిళలతో సహా 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్యం అందించాలని ఆ ఖర్చులను పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను కాకినాడ జిల్లాకు చెందిన నలుగురు సీనియర్ అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని సీఎం ఆదేశించారు.సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ పెను ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.
నిబంధనల ఉల్లంఘనే కారణమా?
ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం దర్యాప్తు చేపట్టింది. తయారీ కేంద్రంలో నిబంధనల ఉల్లంఘనలు ఏమైనా జరిగాయా? అనుమతులకు మించి మందుగుండు సామాగ్రిని నిల్వ చేశారా? అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ఆరు నెలల్లో రెండో విషాదం
ఇదే ప్రాంతంలో ఆరు నెలల క్రితం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాయవరం వద్ద జరిగిన పేలుడు ఘటన ఇంకా ప్రజల మరవక ముందే మరో విషాదం చోటుచేసుకోవడం గమనార్హం. రాయవరం ఘటన జరిగిన ప్రదేశానికి ఈ వెట్లపలెం ప్రమాద స్థలం 30 కిలోమీటర్ల లోపే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. కాగా తరచుగా ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంపై భద్రతా ప్రమాణాలు, పేలుడు పదార్థాల నిల్వపై పర్యవేక్షణ వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
