Let's talk: editor@tmv.in
కాకినాడ జిల్లాలో అగ్నిప్రమాదం

కాకినాడ జిల్లాలో అగ్నిప్రమాదం

Panthagani Anusha
14 జనవరి, 2026

సంక్రాంతి పండుగ వేళ కాకినాడ జిల్లాలో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదం సార్లంకపల్లెను తీవ్ర విషాదంలోకి నెట్టింది. జిల్లా పరిధిలోని మాన్యం గ్రామ పంచాయతీకి చెందిన సార్లంకపల్లెలో సోమవారం సంభవించిన అగ్నిప్రమాదంలో గిరిజన కుటుంబాలకు చెందిన 38 నుంచి 40 పూరి గుడిసెలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోయినా 120 మందికి పైగా గ్రామస్థులు నిరాశ్రయులయ్యారు.

ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం బాధితులకు వెంటనే తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.25 వేల నగదు అందజేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మొత్తాన్ని ఆలస్యం లేకుండా బాధితులకు పంపిణీ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ఇల్లు కోల్పోయిన ప్రతి కుటుంబానికి శాశ్వతంగా కొత్త ఇల్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు బాధితులకు తాత్కాలిక వసతి, ఆహారం, అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా హోంమంత్రి వి. అనిత బాధితులకు అందుతున్న సహాయ చర్యలపై ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామస్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా తాత్కాలిక ఆశ్రయం, భోజన ఏర్పాట్లు, త్రాగునీరు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.

అగ్నిప్రమాదం కారణంగా తమ ఆధార్ కార్డులు, ఇతర ముఖ్యమైన పత్రాలు కోల్పోయిన బాధితులకు వాటిని తిరిగి జారీ చేసేందుకు గ్రామంలోనే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అదేవిదంగా సహాయ, పునరావాస చర్యలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అన్న విషయాన్ని మంత్రులు, జిల్లా ఉన్నతాధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.

ఇదిలా ఉండగా అగ్నిప్రమాదం జరిగిన సమయంలో గ్రామస్థులు పండుగ సామాగ్రి కొనుగోలు కోసం సమీపంలోని తుని పట్టణానికి వెళ్లినట్లు సమాచారం తిరిగి గ్రామానికి చేరుకున్న సమయంలో తమ ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతైన దృశ్యాన్ని చూసి గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. గ్రామంలో మూడు పక్కా ఇళ్లు మినహా మిగిలిన పూరి గుడిసెలన్నీ పూర్తిగా దగ్ధమయ్యాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం ఇళ్లలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గాలి వేగంగా వీస్తుండటంతో మంటలు క్షణాల్లోనే గ్రామమంతా వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే తుని నుంచి ఫైర్ సిబ్బంది బయలుదేరినప్పటికీ గ్రామానికి సుమారు 50 కిలోమీటర్ల దూరం ఉండటంతో ఫైర్ ఇంజన్ చేరేసరికి భారీ నష్టం జరిగిపోయిందని అధికారులు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకురావడానికి గ్రామస్థులు, స్థానికులు శ్రమించిన ఎటువంటి ఫలితం లేకపోయింది.

ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడం కొంత ఊరటనిచ్చినా పండుగకు సిద్ధంగా ఉంచిన బట్టలు, ఇంట్లో ఉన్న సరుకులు, ధాన్యాలు, ఇతర సామాగ్రి పూర్తిగా నష్టపోవడంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఘటనాస్థలాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు పరిశీలించి నష్టంపై అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది.