Let's talk: editor@tmv.in
కాకినాడలో విషాదం…వృద్ధురాలి ప్రాణం తీసిన వానరాలు

కాకినాడలో విషాదం…వృద్ధురాలి ప్రాణం తీసిన వానరాలు

Panthagani Anusha
24 మార్చి, 2026

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం గ్రామంలో కోతుల గుంపు జరిపిన దాడిలో వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. మృతురాలిని దానబోయిన చిన్నబుల్లి (65)గా గుర్తించారు. గ్రామ శివారులోని తన కుమార్తె నివాసం వద్ద ఉన్న పొలం నుంచి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే చిన్నబుల్లి తన కుమార్తె కుటుంబంతో కలిసి గ్రామ శివారులోని మూడు ఎకరాల వ్యవసాయ భూమి పక్కన నివసిస్తోంది. కాగా శనివారం సాయంత్రం ఆమె పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా అక్కడ సంచరిస్తున్న సుమారు 20 కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడికి తెగబడింది. భయంతో వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆమె కింద పడిపోగా కోతులు విచక్షణారహితంగా ఆమెను కరిచి గాయపరిచాయి. ఈ దాడిలో తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు విడిచారు.

ఈ ఘటనతో పెద్దిపాలెం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గత కొంత కాలంగా తమ ప్రాంతంలో కోతుల బెడద విపరీతంగా పెరిగిపోయిందని పంటలను నాశనం చేయడంతో పాటు ఇళ్లలోకి చొరబడి ఇబ్బందులకు గురిచేస్తున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని, వారి నిర్లక్ష్యం వల్లే నేడు ఒక నిండు ప్రాణం బలి అయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోతుల దాడుల్లో మనిషి మృతి చెందడం ఇదే తొలిసారి అని వారు పేర్కొన్నారు.

అటవీ ప్రాంతాలు తగ్గిపోవడం వేసవి తాపానికి ఆహారం, నీటి కొరత ఏర్పడటంతోనే కోతులు గ్రామాలపై పడుతున్నాయని అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి కోతుల బెడదను అరికట్టాలని మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం పరిహారం చెల్లించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.