
కాకినాడలో గ్రీన్ ఫ్యూయల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కాకినాడ జిల్లాలో గ్రీన్ అమ్మోనియా,గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు.
రూ.13,000 కోట్ల భారీ పెట్టుబడితో, ఏడాదికి 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు కానున్న ఈ ప్లాంట్ యంత్రాల బిగింపును సూచిస్తూ ఇద్దరు నేతలు పైలాన్‌ను ఆవిష్కరించారు.
ఈ ప్రాజెక్టు ముఖ్య విశేషాలు:
పర్యావరణ హితంగా చెప్పే ఈ ప్రాజెక్టు బొగ్గు, చమురు, సహజ వాయువును ఉపయోగించి తయారుచేసే గ్రే మరియు బ్లూ అమ్మోనియాల వలే కాకుండా, గ్రీన్ అమ్మోనియా ఎటువంటి కార్బన్ ఉద్గారాలు లేకుండా పర్యావరణానికి పూర్తిగా సురక్షితమైనది. కాకినాడ పోర్టు సమీపంలో సుమారు 500 ఎకరాల్లో ఈ ప్లాంట్ నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఉన్న స్థానిక గ్రే అమ్మోనియా ప్లాంట్‌ను గ్రీన్ అమ్మోనియా ప్లాంట్‌గా పునర్నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్టును మలేషియాకు చెందిన పెట్రోనాస్, సింగపూర్‌కు చెందిన జిఐసి , యుఏఈ కి చెందిన ఏడిఐఏ వంటి ప్రపంచ స్థాయి భాగస్వాముల సహకారంతో ‘ఏఎమ్ గ్రీన్’ సంస్థ అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 8,000 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ గ్రీన్ ఎనర్జీ మార్కెట్‌లో కీలక భాగస్వామిగా నిలబెట్టనుంది.
ఎగుమతులు, వృద్ధి:
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇక్కడ తయారయ్యే గ్రీన్ ఎనర్జీ మాలిక్యూల్స్‌ను జర్మనీ, జపాన్, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేయనున్నారు. తద్వారా భారత్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ వేదికపై క్లీన్ ఎనర్జీ ఎగుమతిదారుగా గుర్తింపు పొందుతాయని ప్రభుత్వం తెలిపింది.
ఉత్పత్తి దశలు:
• 2027: 0.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ప్రారంభం.
• 2028: 1 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తికి పెంపు.
• 2030: 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో పూర్తి స్థాయి సామర్థ్యం.
ఈ సందర్భంగా ముఖ్య మంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటు చేయటం సంతోషదాయకం అన్నారు.ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టును ప్రారంభించిన ప్రమోటర్లకు అభినందనలు తెలియచేస్తున్నాను. గత ఏడాది గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చాం.2027 జూన్ కల్లా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. చరిత్ర తిరగ రాయటం తెలుగువాళ్ల వల్లే సాధ్యం అవుతుందని మరోమారు నిరూపితం అవుతోందన్నారు.
గతంలో గ్రే అమోనియా తయారీని నాగార్జునా ఫెర్టిలైజర్స్ చేపట్టింది. ఇప్పుడు అదే ప్రాంతంలో గ్రీన్ అమోనియా తయారు చేసి పర్యావరణ హిత ఉత్పత్తులు తయారవుతాయి. పర్యావరణ సమతుల్యత సాధించటమే ప్రస్తుతం ఉన్న లక్ష్యం. అందుకు అనుగుణంగా ప్రణాళికలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఆయన లక్ష్యాన్ని అందిపుచ్చుకుని ఏపీలో 160 మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని తయారు చేసేలా లక్ష్యాలను నిర్దేశించుకున్నామన్నారు.
సమీప భవిష్యత్తులోనే ఏపీ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుతుంది. సౌర ఫలకాలను ఇళ్లపై ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వినియోగదారులు ప్రోజ్యూమర్లుగా మారారు. సన్ రైజ్ ఏపీలో వెయ్యి కిలోమీటర్ల తీరరేఖలో 20 పోర్టులు రాబోతున్నాయి. సౌర, పవన, జల విద్యుత్, పంప్డ్ స్టోరేజీ లాంటి విద్యుత్ ఉత్పత్తికి, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ఉత్పత్తికి అనుకూలమైన రాష్ట్రం ఏపీ అన్నారు.
ఏఎం గ్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్లాంట్ ద్వారా గ్రీన్ హైడ్రోజన్, అమోనియా, ఇథనాల్, గ్రీన్ మాలిక్యూల్స్ లాంటి ఉత్పత్తులు వస్తాయి. గ్రీన్ ఎనర్జీ గురించి చర్చ వస్తే ప్రపంచ వ్యాప్తంగా కాకినాడ పేరు వినిపిస్తుంది. డీ కార్బనైజేషన్ గురించి అంతా మాట్లాడుతున్నాం కానీ యూరోప్ ఈ రంగంలో ముందుంది. కాకినాడలోనే 2 గిగావాట్ల సామర్ధ్యం ఉన్న ఎలక్ట్రోలైజర్స్ తయారీకి నిర్ణయించటం అభినందనీయమన్నారు..
ఏపీ క్లీన్, గ్రీన్ ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ పాలసీ 2024 దేశంలోనే అత్యుత్తమ విధానం. పారిశ్రామికరంగానికి అనుకూలమైన విధానాల ద్వారా పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావటమే మా ప్రభుత్వ లక్ష్యం. ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా పారిశ్రామికవేత్తలకు అనుమతులు ఇస్తున్నామన్నారు.
గ్రీన్ అమ్మోనియా ద్వారా ప్రకృతి సేద్యానికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల నీటిలో నైట్రోజన్ స్థాయిలు, సెలినీటి ఎక్కువ కలిగిన రాష్ట్రంగా ఏపీ ఉంది. గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా దీనిని సరఫరా చేసేందుకు వీలు కలుగుతుంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా అభివృద్ధి జరగాలి, సంపద రావాలి. తద్వారా సంక్షేమం జరగాలి. 18 నెలల్లో సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసి సంక్షేమంలో రికార్డు సాధించాం. ఏపీపై నమ్మకం ఉంచి దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ట్రానికే వచ్చాయి. రాష్ట్రంలో విద్యుత్ కొనుగోలు భారాన్ని రూ.1.19 పైసలు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
ఇప్పటికే యూనిట్ కు 29 పైసల మేర భారాన్ని వినియోగదారులపై తగ్గించాం. ట్రాన్స్ మిషన్ నష్టాలు కూడా తగ్గించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖకు 1 గిగావాట్ సామర్ధ్యంతో ఏఐ గిగా సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు వచ్చింది. గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ, క్వాంటం వ్యాలీ కూడా ప్రకటించి ఆధునిక భవిష్యత్ కు నాంది పలికాం. వచ్చే ఆరు నెలల్లో అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సేవలు ప్రారంభం అవుతాయి. రాష్ట్రంలో స్పేస్ టెక్నాలజీ లాంటి సాంకేతికతపై కూడా పెద్ద ఎత్తున పురోగతి సాధిస్తాం. సంపద సృష్టికి ఏపీని మించిన అత్యుత్తమ గమ్యస్థానం మరొకటి లేదు. గ్లోబల్ సంస్థలు ఏపీ నుంచి కార్యకలాపాలు నిర్వహించాలని పిలుపునిస్తున్నాను. ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని మెగా ప్రాజెక్టుకు ఇంత వేగంగా శంకుస్థాపన నిర్వహించటం అభినందనీయం. 2029-30 నాటికి ఈ ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యుత్తమంగా మారాలని ఆకాంక్షిస్తున్నాను. రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపుతుంది. పారిశ్రామికవేత్తలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి రాష్ట్రాభివృద్ధిలో భాగం కావాలి గత ప్రభుత్వం రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారుల్ని బెదిరించింది. కూటమి ప్రభుత్వం వేధించదు… అండగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ యజ్ఞంలో గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు గేమ్ ఛేంజర్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ దేశ కాలుష్యరహిత ఇంధన ప్రయాణంలో కీలక మైలురాయి కానుంది. పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని అగ్రపథాన నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఆ దిశగా వేసిన బలమైన అడుగు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ అని, ప్రభుత్వాలు మారినా పాలనా విధానాలు స్థిరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులు, ఉన్నత అధికారులు పాల్గొన్నారు.
