Let's talk: editor@tmv.in
కాంబినేషన్లే ప్రధాన కారణం.. అందుకే గిల్‌ను తప్పించాం: అగర్కార్

కాంబినేషన్లే ప్రధాన కారణం.. అందుకే గిల్‌ను తప్పించాం: అగర్కార్

Pinjari Chand
21 డిసెంబర్, 2025

టీ20 ప్రపంచకప్–2026 జట్టులో శుభ్‌మన్ గిల్‌ను తప్పించి, ఇషాన్ కిషన్, రింకు సింగ్‌లను భారత సెలెక్టర్లు తిరిగి జట్టులోకి తీసుకున్నారు. వైస్ కెప్టెన్ బాధ్యతలను అక్షర్ పటేల్‌కు అప్పగిస్తూ, జట్టు ఫోకస్‌ను టాప్ ఆర్డర్‌లో ఆగ్రెసివ్ వికెట్‌కీపర్–బ్యాట్స్‌మన్‌లు, పవర్‌ప్లేలో అదిరిపోయే ప్రారంభాలు, ఫినిషింగ్ సామర్థ్యంపై దృష్టి పెట్టింది.

టీ20 ప్రపంచకప్–2026కు భారత జట్టులో చోటు దక్కకపోవడంపై శుభ్‌మన్ గిల్ అభిమానుల్లో తీవ్ర చర్చ నడుస్తున్న వేళ, ఈ నిర్ణయానికి గల కారణాలను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్ స్పష్టంచేశారు. గిల్‌ ఆటతీరుపై ఎలాంటి సందేహం లేదని, అయితే ప్రస్తుతం జట్టు అవసరాలు, కాంబినేషన్లే ఈ నిర్ణయానికి కారణమని ఆయన తెలిపారు. శనివారం ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో టీ20 ప్రపంచకప్–2026తో పాటు న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించారు. ఈ సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కార్‌తో కలిసి బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా పాల్గొన్నారు.

టీ20 ఫార్మాట్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న శుభ్‌మన్ గిల్‌కు జట్టులో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనిపై స్పందించిన అగర్కార్, గిల్ వైస్ కెప్టెన్ అయినప్పటికీ, ఈ సారి అతడు జట్టులో లేడు. అందుకే వైస్ కెప్టెన్ బాధ్యతలను మళ్లీ అక్షర్ పటేల్‌కు అప్పగించాం. గతంలో గిల్ టెస్టులు ఆడుతున్న సమయంలో అక్షర్ ఈ బాధ్యతను నిర్వహించాడని చెప్పారు.

జట్టు కాంబినేషన్ అంశాన్ని వివరిస్తూ అగర్కార్ మాట్లాడుతూ, ప్రస్తుతం మేం కాంబినేషన్లపై ఎక్కువగా దృష్టి పెట్టాం. టాప్ ఆర్డర్‌లో వికెట్‌కీపర్ బ్యాట్స్‌మన్ ఉంటే, మరో వికెట్‌కీపర్ అవసరం అనిపించింది. అందుకే సంజూ శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేశాం. ఈ కారణంగానే జితేశ్ శర్మను తప్పించాల్సి వచ్చిందన్నారు.

శుభ్‌మన్ గిల్ ప్రతిభపై ప్రశంసలు కురిపించిన అగర్కార్ గిల్ గొప్ప ఆటగాడు. అయితే ప్రస్తుతం అతడు కొంతవరకు పరుగులు తీయడంలో ఇబ్బంది పడుతున్నాడు. గత ప్రపంచకప్‌లో కూడా కాంబినేషన్ల కారణంగానే అతడికి అవకాశం దక్కలేదు. ఈసారి కూడా అదే జరిగిందని స్పష్టం చేశారు. గిల్ ఇటీవల ఫామ్, ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌కు ముందు గాయం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. ఆసియా కప్‌లో ఉప కెప్టెన్‌గా తిరిగి వచ్చినప్పటి నుంచి టీ20ల్లో అతడి ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. 15 టీ20 మ్యాచ్‌ల్లో 291 పరుగులు మాత్రమే చేశాడు. సగటు 24.25 కాగా, ఒక్క అర్ధశతకం కూడా నమోదు కాలేదు. అతడి అత్యధిక స్కోరు 47.

ఇక, ఓపెనింగ్ బాధ్యతలను సంజూ శాంసన్, అభిషేక్ శర్మకు అప్పగించారు. మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, రింకు సింగ్‌లు బ్యాటింగ్‌కు బలం చేకూరుస్తారు. స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్‌తో పాటు వరుణ్ చక్రవర్తి ఉండగా, పేస్ దాడికి జస్ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తాడు. అతనికి అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా తోడుగా ఉంటారు.

భారత్ గ్రూప్–ఏలో నమీబియా, నెదర్లాండ్స్, పాకిస్థాన్, అమెరికా ఉన్నాయి. ఫిబ్రవరి 7న ముంబైలో అమెరికాతో తొలి మ్యాచ్ ఆడి భారత జట్టు తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

ఇషాన్ కిషన్, రింకు సింగ్‌కి మళ్లీ అవకాశం

భారత టీ20 ప్రపంచకప్–2026 జట్టులో శుభ్‌మన్ గిల్‌ను తప్పించి భారత క్రికెట్ సెలెక్టర్లు సాహాసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అతని స్థానంలో వికెట్‌కీపర్–బ్యాట్స్‌మన్ ఇషాన్ కిషన్, స్పెషలిస్ట్ ఫినిషర్ రింకు సింగ్‌ను తిరిగి జట్టులోకి తీసుకొచ్చారు. ఈ నిర్ణయం అత్యంత ఆసక్తికరంగా నిలిచింది, అయితే గిల్ ఇటీవల టీ20 ఫార్మాట్‌లో మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

గిల్ జట్టులో లేనందున, వైస్ కెప్టెన్ బాధ్యతలను అక్షర్ పటేల్ కు అప్పగించారు. టెస్టులు, వన్డేల్లో స్థిరమైన బ్యాటింగ్ ప్రదర్శనను అందించిన గిల్, టీ20ల్లో ప్రత్యేకంగా ఓపెనర్‌గా నిలబడలేక పోవడంతో జట్టులో చోటు దక్కలేదు. పవర్ ప్లేల్లో అతడి స్ట్రైక్ రేట్ సరిగా లేకపోవడం, ఇతర బ్యాట్స్‌మన్ల కారణంగా గిల్ ఎంపికపై ప్రభావం చూపాయి. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల్లో గిల్ 4, 0, 28 పరుగులు మాత్రమే చేశాడు.

సెలెక్టర్స్ చైర్మన్ అజిత్ అగర్కార్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం పరుగులు తీయడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కోంటున్నాడు. గత ప్రపంచకప్‌లో కూడా అతడికి అవకాశం దక్కలేదని గుర్తు చేశారు. ఇషాన్ కిషన్ తిరిగి జట్టులోకి రావడం టీమ్స్ లో లెఫ్ట్ –రైట్ బ్యాటింగ్ కాంబినేషన్, ఆగ్రెసివ్ వికెట్‌కీపర్–బ్యాట్స్‌మన్లపై సెలెక్టర్స్ దృష్టిని సూచిస్తుంది. ఇషాన్ ఈ సంవత్సరం ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఎక్కువ కాలం జట్టులో లేరు. అయితే ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో అద్భుత ప్రదర్శనతో జార్ఖండ్ జట్టు టైటిల్ గెలవడంలో కీ రోల్ పోషించారు. ఫైనల్లో సెంచరీ కూడా కొట్టారు.

జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గిల్ ను ఎంపిక చేయకపోవడంపై వ్యాఖ్యానిస్తూ గిల్ ఫాం గురించి కాదు. మేం టాప్‌లో వికెట్‌కీపర్ కావాలని అనుకున్నాం అని చెప్పారు. ఇషాన్ కిషన్ జట్టులోకి రావడం వలన ప్రతిభావంతుడు యశస్వి జైస్వాల్ స్థానాన్ని కోల్పోయాడు, అలాగే జితేశ్ శర్మకు కూడా జట్టులో స్థానం దక్కలేదు.

జట్టులో టాప్, మిడిల్ ఆర్డర్‌లో పవర్‌ను పెంచుతూ, సూర్యకుమార్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌లను ఎంపిక చేశారు. రింకు సింగ్ ఫినిషర్‌గా జట్టులో ఉండడం, ఒత్తిడి సమయంలో బ్యాటింగ్ చేసి చివరి దశలో స్కోరును పెంచే భారత జట్టు తీరును చూయిస్తుంది. హార్దిక్ పాండ్యా జట్టు సమతుల్యత బాధ్యతను మళ్లీ వహించనుండగా, శివమ్ దూబే స్పినర్లను టార్గెట్ చేయగల సామర్థ్యంతో జట్టుకు మద్దతు ఇస్తాడు. అక్షర్–వాషింగ్టన్ సుందర్ జంట వేరియిటీ, కంట్రోల్, బ్యాటింగ్ డెప్త్‌ను అందిస్తారు.

బుమ్రా నాయకత్వంలో బౌలర్ల దాడి

బౌలింగ్ యూనిట్ అనుభవాన్ని కొత్త ఆలోచనలతో రూపొందించారు. జస్ప్రీత్ బుమ్రా పేస్ దాడికి నాయకత్వం వహిస్తారు. అర్షదీప్ సింగ్ లెఫ్ట్-ఆర్మ్ పేస్ ఆప్షన్‌గా ఉన్నాడు. హర్షిత్ రాణా కొత్త పేస్, బౌన్స్‌ని జట్టులో తీసుకురావడమే లక్ష్యంగా ఎంపికయ్యాడు.

స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి జంట, మిడిల్ ఆవర్స్‌లో వ్యూహాత్మక ప్రదర్శన చేయగల సామర్థ్యాన్ని అందిస్తుంది. అక్షర్, వాషింగ్టన్ సుందర్ టెయిలెండర్లలో జట్టును ఆదుకునే వారిలో ఉన్నారు. భారత్ జట్టు ఫిబ్రవరి 7న అమెరికాతో ముంబైలో ప్రారంభమవుతున్న టోర్నమెంట్‌లో పాల్గొంటుంది.

తర్వాతి మ్యాచ్‌లు

ఫిబ్రవరి 12 – నమీబియా, ఫిబ్రవరి 15 – పాకిస్తాన్ (కొలంబో), ఫిబ్రవరి 18 – నెదర్లాండ్స్ (అహ్మదాబాద్).

సూపర్ 8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి, ఫైనల్ మార్చి 8న ఉంటుంది.

భారత్ జట్టు (టీ20 ప్రపంచకప్ 2026)

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్ (ఉపకెప్టెన్), కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, సంజూ శాంసన్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రింకు సింగ్.

కాంబినేషన్లే ప్రధాన కారణం.. అందుకే గిల్‌ను తప్పించాం: అగర్కార్ - Tholi Paluku