Let's talk: editor@tmv.in
కాంగ్రెస్ '1,000 రోజుల మోసం'పై సెప్టెంబర్ 2 నుంచి బీఆర్ఎస్ నిరసనలు

కాంగ్రెస్ '1,000 రోజుల మోసం'పై సెప్టెంబర్ 2 నుంచి బీఆర్ఎస్ నిరసనలు

Gaddamidi Naveen
25 ఆగస్టు, 2026

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా, ఆ పార్టీ ప్రజలకు చేసిన "మోసాన్ని" ఎండగట్టేందుకు భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి వారం రోజుల పాటు వినూత్న నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించింది.

ఈ మేరకు బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర కమిటీ సభ్యులకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేందుకు 420 హామీలు, 13 డిక్లరేషన్లు, 6 గ్యారెంటీలను ఇచ్చి, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిందని కేటీఆర్ గుర్తుచేశారు. కానీ 1,000 రోజులు గడిచినా ఒక్క హామీని కూడా పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో తెలిపేందుకు "బాకీ కార్డులు" పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టాలని కేటీఆర్ సూచించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, నిరుద్యోగులకు రావాల్సిన నెలవారీ ఆర్థిక సాయం, పాత బకాయిలను ఈ కార్డుల ద్వారా ప్రజలకు గుర్తుచేయాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని, దాదాపు రూ.12,000 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను నిలిపివేసిందని మండిపడ్డారు. ఈ అంశాన్ని ప్రతి కాలేజీ స్థాయిలో విస్తృతంగా చర్చకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ వారం రోజుల కార్యక్రమంలో రైతులు, మహిళలు, విద్యార్థులు, దళితులు, బీసీలు, గిరిజనులు, ఆటో డ్రైవర్లు, ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని స్పష్టం చేశారు.

సోషల్ మీడియా ప్రచారం

రేపటి తరం యువతకు రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు సులభంగా అర్థమయ్యేలా సోషల్ మీడియాను ఒక శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగించుకోవాలని కేటీఆర్ కేడర్‌కు నిర్దేశించారు. నిరసనలు కేవలం నాయకులకే పరిమితం కాకుండా నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో విస్తృతంగా జరగాలని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు ఈ నిరసనల్లో చురుగ్గా పాల్గొని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.